St. Marys School
-
20 మందిని కాపాడి.. ప్రాణాలు విడిచాడు
ఒంగోలు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన స్కూల్ బస్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వివరాలు... ఒంగోలు క్రౌపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం 20 మంది విద్యార్థులతో త్రోవగుంట నుంచి వస్తోంది. త్రోవగుంట వద్ద జాతీయరహదారిపై అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆపై రోడ్డుపక్కన భారీ నీటి గుంటలోకి ఒరిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పెను ప్రమాదం తప్పటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారని.. అధికారులు తెలిపారు. -
వాగులోకి దూసుకెళ్లిన బస్సు
పాఠశాల బస్సు తృటిలో పెను ప్రమాదం నుంచి బయట పడింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం ఉదయం జరిగిన ఘటనలో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు... ఒంగోలు క్రౌపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం 20 మంది విద్యార్థులతో త్రోవగుంట నుంచి వస్తోంది. త్రోవగుంట వద్ద జాతీయరహదారిపై అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆపై రోడ్డుపక్కన భారీ నీటి గుంటలోకి ఒరిగిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులోని ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పెను ప్రమాదం తప్పటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. -
విద్యార్థులను దండించొద్దు
ముంబై : పాఠశాలల్లో విద్యార్థులపై శారీరక, మానసిక దాడులను తీవ్రంగా పరిగణిస్తూ, టీచర్ల పైశాచిక చర్యలను అరికట్టేందుకు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(సీఐఎస్సీఈ) నడుం బిగించింది. ఇందులో భాగంగా తగిన సూచనలు, సలహాలను పాఠశాలల యాజమాన్యాలకు అందించింది. విద్యార్థులపై టీచర్ల అమానవీయ చర్యలను అరికట్టేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) రూపొందించిన సూచనలను అమలు చేయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సూచింది. దండనతో దుష్ఫలితాలు ‘పెద్దవాళ్లు లేదా టీచర్లు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దండించడం మూలంగా వారి మృధుస్వభావం గాయ పడుతుంది. సమస్యకు పరిష్కారం దండన అనే భావన చిన్నతనంలోనే నాటుకుంటోంది. ఫలితంగా విద్యార్థులు దూకుడుగా వ్యవహరించడం, విధ్వంసక స్వభావాన్ని అలవర్చుకోవడంతోపాటు స్కూలు మానేయడం, స్కూలుకు దూరంగా ఉండడం, టీచర్లు అంటేనే వ్యతిరేతను ఏర్పరుచుకోవటం జరుగుతోంది. చిన్నతనంలోనే జీవితాన్ని అల్లకల్లోలం చేసుకొంటారు. ఇదంతా సమాజంపై దుష్ర్పభావాన్ని చూపిస్తోంది’ అని సీఐఎస్సీఈ పేర్కొంది. ‘అనుకూల ప్రభావం చూపే అంశాలు మాత్రమే విద్యార్థులకు బోధించాలి. జీవితంలో బతకడానికి, స్థిరంగా ఎదగడానికి ఏం కావాలి. ఎలాంటి విద్యాబుద్ధులు అవసరంమో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి’ అని సూచించింది. హెచ్ఆర్డీ సూచనలు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెంపొందించేందుకు కృషి చేయాలని చెప్పింది. వివిధ స్థాయిల నుంచి వచ్చిన విద్యార్థులకు తగిన అవకాశాలను కల్పించాలి, మానసిక పరిపక్వతను పెంపొందించాలని పేర్కొంది. అదేవిధంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని, వారితో సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి అధ్యయనం చేయాలి, అవసరాలను తెలుసుకొని సహకరించాలి. ఆ తర్వాత మాత్రమే శిక్ష గురించి ఆలోచించాలి అని చెప్పింది. ‘‘పాఠశాలలో ఏదైనా విద్యార్థికి సమస్య ఎదురైనప్పుడు టీచర్, యాజమాన్యం తొందరపడకూడదు. ఆ విషయంలోకి ఇతర విద్యార్థులను లాగడం మానుకోవాలి. తలిదండ్రులు పాల్గొనేలా చూడాలి. విద్యార్థి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. లేకుంటే సమస్య తీవ్రమై విద్యార్థులు/ కుటుంబం, టీచర్/స్కూలు యాజమాన్యం/ విద్యార్థి కౌన్సిల్లో పరిష్కారాన్ని కనుగొనాలి’ అని సూచింది. తల్లిదండ్రుల సహాయం తప్పనిసరి : ప్రిన్సిపాల్ ఎఫ్ఆర్ కెన్నెత్ ఈ మేరకు నగరంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను దండించడం టీచర్లు మానుకోవాలని సూచిస్తూ ప్రిన్సిపాల్స్ నేతృత్వంలో మార్గదర్శకాలను రూపొందించాయి. సెయింట్ మేరీస్ స్కూల్(ఐసీఎస్ఈ) ప్రిన్సిపాల్ ఎఫ్ఆర్ కెన్నెత్ మిస్కై ్వటా మాట్లాడుతూ ‘‘ విద్యార్థుల చెడు ప్రవర్తన విషయంలో పాఠశాలలు ఎలా వ్యవహరించాలి, వారి నుంచి దేనిని వెలికితీయాలి అనే అంశంపై ఓ నిబంధనావళి ఉండాలి’’ అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహాయాన్ని తీసుకోవాలని చెప్పారు. వృత్తి నిపుణుల దృష్టికి తీసుకెళ్తాం హెచ్వీబీ గ్లోబల్ అకాడమీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ పాఠక్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకమైన సమస్య ఎదురైనప్పుడు విద్యార్థితో మాట్లాడుతాం. కారణాలను తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నిస్తాం, అప్పటికీ విద్యార్థిలో మార్పురాకపోతే తల్లిదండ్రులకు విషయాన్ని వివరిస్తాం. స్కూల్ కౌన్సెల్లో కూడా చర్చిస్తాం. పరిష్కారం కాకపోతే సమస్యను వృత్తినైపుణ్యం కల్గిన వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం’ అని అన్నారు. దాదర్‌లోని బాల్మోహన్ విద్యామందిర్ టీచర్ విలాస్ పరాబ్ మాట్లాడుతూ ఖాళీ సమయాల్లో విద్యార్థులు నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలి, అలా చేయడం వలన మానసిక పరిపక్వత పెరుగుంతుందని చెప్పారు. -
ఆమె జీవితం...ఓ పెద్దబాలశిక్ష!!
‘నాన్నా! ఈ ఫ్రాక్ నచ్చలేదు... నేను వేసుకోను’ అంటూ విసిరేసిన బాల్యం ఆమెది ఇంటి బయట కాలు పెట్టేది బాటా చెప్పులతోనే... పదవ తరగతికి వచ్చేసరికి జడగంటలు కట్టిన పొడవాటి జడ... ఆ జడను వయ్యారంగా తిప్పుకుంటూ నడిచే ఆత్మవిశ్వాసం ఆమె సొంతమైంది. ఆ జీవితం ఒక్కసారిగా దూరమైంది... దూరంగా జరిగిపోయింది. స్నేహితులిచ్చిన దుస్తులతో రోజులు వెళ్లదీయాల్సి వచ్చింది. చీరకు కుచ్చిళ్లు పోసేది చిరుగులను కప్పుకోవడానికే అన్నట్లు మారిపోయింది. రెండు రూపాయల పాకీజా చెప్పులతో రోడ్డు మీద మొదలైంది ఆమె ప్రయాణం. పాతికేళ్లకే వందేళ్ల జీవితానుభవాన్ని చూసింది. బాధ్యతల బరువు మోసిన ఆ అనుభవమే... ఇప్పుడు మూడు వందల మందికి ఉపాధినిస్తోంది!! విమల తండ్రి ఎల్ఐసి ఆఫీసర్... రక్షణ వ్యవస్థ మాజీ ఉద్యోగి. మిలటరీ క్రమశిక్షణలో పెరగడంతో ఇల్లు బందిఖానాగా అనిపించి బయటి ప్రపంచం అందమైన హరివిల్లులా కనిపించసాగిందామెకు. పదహారేళ్ల వయసులో ఇల్లు దాటి ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమవివాహంలో తియ్యదనం నాలుగేళ్లు కూడా లేకపోయింది. ఇరవై ఏళ్లకే ఇద్దరు అమ్మాయిలకు తల్లైంది. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు. జీవితం తక్కెడలో సమతుల్యం లోపించింది. ప్రేమ పెళ్లిలో తీపికంటే వైవాహిక జీవితంలో బాధ్యతలే బరువని తెలిసి వచ్చిందామెకు. దురదృష్టం ఏమిటంటే... ఇవేవీ ఆమె భర్త కొండయ్యకు పట్టలేదు. నలుగురు పిల్లల ఆకలి తీర్చడం తల్లిగా తన ధర్మం అనుకున్నారామె. భర్త బాధ్యతరాహిత్యం, నలుగురు పిల్లల పోషణ బాధ్యత ఆమెను సేల్స్‌గర్ల్‌గా మార్చాయి. హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్‌లో సేల్స్‌గర్ల్‌గా చేరిన విమలానాయుడు అనేక కంపెనీలు మారి చివరికి సొంత ఏజెన్సీ ప్రారంభించారు. ‘‘1982లో పాతికమంది ప్రమోటర్స్‌తో ప్రారంభించి ఇప్పుడు మూడు వందల మందితో జాన్సన్స్ అండ్ జాన్సన్స్ వంటి బహుళజాతి కంపెనీలకు సేవలందిస్తున్నాం. ఈ ఏజెన్సీతోనే పిల్లలను చదివించి పెళ్లి చేశాను’’ అన్నారామె. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్లో చదివే రోజుల్లో పడిన తప్పటడుగు ఆమె జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పింది. ప్రమోటర్‌గా ఎండలో నడుస్తూ ఉంటే ఒకరోజు రోడ్డు మీద ఆమె అన్నయ్య ఎదురుపడ్డారు. అంతకాలం తర్వాత కనిపించిన చెల్లిని ఆత్మీయంగా పలకరించక పోగా... ‘నీ జీవితం రోడ్డుపాలే’ అనేసి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా జీవితం తలక్రిందులైన వైనాన్ని తలుచుకుంటూ ‘‘నాలాగ ఎవరూ జీవితంలో తప్పటడుగు వేయకూడదు. ప్రేమ, ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమించడానికి టీనేజ్ సరైన వయసు కాదని ఈ తరానికి తెలియాలి’’ అంటారామె. పిల్లల జీవితం తనలా కాకూడదని... తాను చేసిన పొరపాటే చేస్తుందేమోననే భయంతో పెద్దమ్మాయికి పదో తరగతి పూర్తవగానే పెళ్లిచేశారు విమల. రెండో అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి కొంత భరోసా వచ్చిందంటారామె. ‘‘మోసానికీ బలి కాదనే ధైర్యంతో కాలేజ్‌లో చేర్పించాను. ఇప్పుడు ఎంబిఎ గోల్డ్ మెడలిస్ట్. పెద్దబ్బాయి డిగ్రీ సగంలోనే మానేసి నాతోపాటు ఏజెన్సీ చూసుకుంటున్నాడు. రెండో అబ్బాయి ఎం.ఎ చేశాడు. ఉద్యోగం, పిల్లల బాధ్యతలన్నీ ఒక ఎత్తయితే నాకు రోజూ సాయంత్రం ఏడయ్యేసరికి ఆందోళనతో మనసంతా కకావికలమయ్యేది. తాగి ఫలానా చోట పడి ఉన్నాడని ఎక్కడి నుంచి కబురు వస్తుందో, ఎక్కడికెళ్లి ఆ మనిషిని ఇంటికి తీసుకురావాల్సి వస్తుందోనని గుండె దడదడలాడేది’’ అన్నారామె దుంఖాన్ని దిగమింగుకుంటూ. చిలకలగూడలో మహిళలకు ఇప్పుడు విమలానాయుడు ఓ పెద్దదిక్కు. వారి కష్టాలను పంచుకునే పెద్దక్క. మైత్రి బృందాలతో వారికి ఉపాధి మార్గాలను చూపిస్తున్నారామె. ప్రభుత్వ పథకాలను తమ వాకిళ్లకు తెచ్చుకుంటున్నారు. వీటన్నింటికీ సారా ఉద్యమంలో పాల్గొనడమే కారణం అంటారామె. తనకు చేతనైన సాయం! రంజాన్ మాసంలో గురువారాలు మసీదులో లుంగీలు, పండ్లు పంచుతూ కనిపిస్తారు విమల. చర్చ్‌లో మేరీమాతకు కిరీటం పెట్టి సంతోషిస్తారు. సాయిబాబాకి ఊయల ఊపుతూ ఆనందిస్తారు. తన ప్రమోటర్స్ పెళ్లికి మట్టెలు, తాళిబొట్టు ఇస్తారు. ‘‘అమ్మానాన్నల మనసు కష్టపెట్టిన పాపం నాది. నేను చేసిన తప్పులను పరిహరించమని అందరు దేవుళ్లనూ ఇలా వేడుకుంటున్నా’’ అంటారు. విమలానాయుడు జీవితం తెరిచిన పుస్తకం. అందులోని ప్రతి అక్షరం మరొకరికి హెచ్చరిక కావాలనేది ఆమె కోరిక. జీవితంలో ఎలాంటి పొరపాటు చేయకూడదో తనను చూసి తెలుసుకోమంటారు. జీవితానికి ఎదురు నిలబడి గెలవవచ్చు అనడానికి కూడా పాఠం తన జీవితమే- అంటారామె. - వాకా మంజులారెడ్డి, ఫొటోలు: జి. రాజేశ్ మద్యం మహమ్మారి చేసే వినాశం ఏంటో నేను అనుభవించాను. ఆ గుండెమంట నన్ను సారా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేలా చేసింది. మా స్థానిక మహిళలను సమీకరించి ఉద్యమం చేశాం. అందరికంటే పెద్ద బాధితురాలిని కాబట్టి సారా ఉద్యమంలో మా కాలనీ వాళ్లకు నేనే పెద్ద దిక్కయ్యాను. ఇప్పటికీ వాళ్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అవసరం వచ్చినా తమతో రమ్మని అడుగుతుంటారు. కుట్టుశిక్షణ తరగతులు, మగ్గం వర్క్‌లో శిక్షణ అలా ప్రారంభించినవే. - విమలానాయుడు