పాఠశాల బస్సు తృటిలో పెను ప్రమాదం నుంచి బయట పడింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం ఉదయం జరిగిన ఘటనలో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో చోటుచేసుకుంది.
వివరాలు... ఒంగోలు క్రౌపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఉదయం 20 మంది విద్యార్థులతో త్రోవగుంట నుంచి వస్తోంది. త్రోవగుంట వద్ద జాతీయరహదారిపై అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఆపై రోడ్డుపక్కన భారీ నీటి గుంటలోకి ఒరిగిపోయింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులోని ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పెను ప్రమాదం తప్పటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.