ముంబై : పాఠశాలల్లో విద్యార్థులపై శారీరక, మానసిక దాడులను తీవ్రంగా పరిగణిస్తూ, టీచర్ల పైశాచిక చర్యలను అరికట్టేందుకు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(సీఐఎస్‌సీఈ) నడుం బిగించింది. ఇందులో భాగంగా తగిన సూచనలు, సలహాలను పాఠశాలల యాజమాన్యాలకు అందించింది. విద్యార్థులపై టీచర్ల అమానవీయ చర్యలను అరికట్టేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) రూపొందించిన సూచనలను అమలు చేయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) సూచింది.
దండనతో దుష్ఫలితాలు
‘పెద్దవాళ్లు లేదా టీచర్లు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దండించడం మూలంగా వారి మృధుస్వభావం గాయ పడుతుంది. సమస్యకు పరిష్కారం దండన అనే భావన చిన్నతనంలోనే నాటుకుంటోంది. ఫలితంగా విద్యార్థులు దూకుడుగా వ్యవహరించడం, విధ్వంసక స్వభావాన్ని అలవర్చుకోవడంతోపాటు స్కూలు మానేయడం, స్కూలుకు దూరంగా ఉండడం, టీచర్లు అంటేనే వ్యతిరేతను ఏర్పరుచుకోవటం జరుగుతోంది. చిన్నతనంలోనే జీవితాన్ని అల్లకల్లోలం చేసుకొంటారు. ఇదంతా సమాజంపై దుష్ర్పభావాన్ని చూపిస్తోంది’ అని సీఐఎస్‌సీఈ పేర్కొంది. ‘అనుకూల ప్రభావం చూపే అంశాలు మాత్రమే విద్యార్థులకు బోధించాలి. జీవితంలో బతకడానికి, స్థిరంగా ఎదగడానికి ఏం కావాలి. ఎలాంటి విద్యాబుద్ధులు అవసరంమో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి’ అని సూచించింది.
హెచ్‌ఆర్‌డీ సూచనలు
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెంపొందించేందుకు కృషి చేయాలని చెప్పింది. వివిధ స్థాయిల నుంచి వచ్చిన విద్యార్థులకు తగిన అవకాశాలను కల్పించాలి, మానసిక పరిపక్వతను పెంపొందించాలని పేర్కొంది. అదేవిధంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని, వారితో సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి అధ్యయనం చేయాలి, అవసరాలను తెలుసుకొని సహకరించాలి. ఆ తర్వాత మాత్రమే శిక్ష గురించి ఆలోచించాలి అని చెప్పింది. ‘‘పాఠశాలలో ఏదైనా విద్యార్థికి సమస్య ఎదురైనప్పుడు టీచర్, యాజమాన్యం తొందరపడకూడదు. ఆ విషయంలోకి ఇతర విద్యార్థులను లాగడం మానుకోవాలి. తలిదండ్రులు పాల్గొనేలా చూడాలి. విద్యార్థి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. లేకుంటే సమస్య తీవ్రమై విద్యార్థులు/ కుటుంబం, టీచర్/స్కూలు యాజమాన్యం/ విద్యార్థి కౌన్సిల్‌లో పరిష్కారాన్ని కనుగొనాలి’ అని సూచింది.
తల్లిదండ్రుల సహాయం తప్పనిసరి : ప్రిన్సిపాల్ ఎఫ్‌ఆర్ కెన్నెత్
ఈ మేరకు నగరంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను దండించడం టీచర్లు మానుకోవాలని సూచిస్తూ ప్రిన్సిపాల్స్ నేతృత్వంలో మార్గదర్శకాలను రూపొందించాయి. సెయింట్ మేరీస్ స్కూల్(ఐసీఎస్‌ఈ) ప్రిన్సిపాల్ ఎఫ్‌ఆర్ కెన్నెత్ మిస్‌కై ్వటా మాట్లాడుతూ ‘‘ విద్యార్థుల చెడు ప్రవర్తన విషయంలో పాఠశాలలు ఎలా వ్యవహరించాలి, వారి నుంచి దేనిని వెలికితీయాలి అనే అంశంపై ఓ నిబంధనావళి ఉండాలి’’ అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహాయాన్ని తీసుకోవాలని చెప్పారు.
వృత్తి నిపుణుల దృష్టికి తీసుకెళ్తాం
హెచ్‌వీబీ గ్లోబల్ అకాడమీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ పాఠక్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకమైన సమస్య ఎదురైనప్పుడు విద్యార్థితో మాట్లాడుతాం. కారణాలను తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నిస్తాం, అప్పటికీ విద్యార్థిలో మార్పురాకపోతే తల్లిదండ్రులకు విషయాన్ని వివరిస్తాం. స్కూల్ కౌన్సెల్‌లో కూడా చర్చిస్తాం. పరిష్కారం కాకపోతే సమస్యను వృత్తినైపుణ్యం కల్గిన వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం’ అని అన్నారు. దాదర్‌లోని బాల్‌మోహన్ విద్యామందిర్ టీచర్ విలాస్ పరాబ్ మాట్లాడుతూ ఖాళీ సమయాల్లో విద్యార్థులు నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలి, అలా చేయడం వలన మానసిక పరిపక్వత పెరుగుంతుందని చెప్పారు.
విద్యార్థులను దండించొద్దు
Published Sat, Aug 23 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement
Advertisement