కడప కల్చరల్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ సహకారంతో కల్యాణమస్తు పేరిట వినూత్న కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వివాహాలు చేసుకోవడం ఆర్థికంగా భారం అయిన కుటుంబాలు, పేదలు ఈ కార్యక్రమం ద్వారా వారి బిడ్డలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వివాహాలు చేసుకునే సౌకర్యం కల్పించారు. తిరుమలేశుని సన్నిధిలో ఉంచి పూజించిన వివాహ సామగ్రిని నూతన జంటలకు ఉచితంగా అందజేసేవారు. వాటిలో ముఖ్యంగా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, బాసికాలతోపాటు మంగళ వాయిద్యాలు, పురోహితులను కూడా ఉచితంగా ఏర్పాటు చేసేవారు. డాక్టర్ వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయాయి.
ప్రస్తుత తరుణంలో పిల్లల వివాహాలు చేయడం పేదలకు అసాధ్యమవుతుండగా మధ్యతరగతి కుటుంబాలను అప్పుల పాలు చేస్తోంది. ఈ పరిస్థితి మార్చాలని మధురమైన ఈ కల్యాణ ఘట్టాన్ని మరుపురానిదిగా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టింది. ఈనెల 29వ తేదీనుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఆగస్టు 7న రాష్ట్ర మంతటా సామూహికంగా కల్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ తేదీకంటే ముందుగానే కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
నియమ నిబంధనలు ఇవీ!
► వధూవరుల ప్రస్తుత ఫొటోలు దరఖాస్తుకు జతపరచాలి.
► విడివిడిగా ఉన్న దరఖాస్తు కాలమ్‌లో వధూవరుల పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, గోత్రం, మతం, విద్యార్హతలు, వృత్తి, వారివారి పూర్తి చిరునామాను పొందు పరచాల్సి ఉంది. వధూవరులు విడివిడిగా వారి మొబైల్ ఫోన్ నంబర్లను నమోదు చేయాలి.
► స్వీయ అంగీకార పత్రంలో తాము భారతీయ హిందువులని, వెంకటేశ్వరస్వామిపై పూర్తిగా భక్తివిశ్వాసాలు ఉన్నాయని, ఇద్దరం హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోదలిచామని స్పష్టం చేయాల్సి ఉంది.
► జులై 31 నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరం ఉన్నట్లు రుజువు చేయాల్సి ఉంది.
► వివాహం నాటికి తామిద్దరం మేజర్లమని, ఎలాంటి మానసిక సమస్యలు లేవని సగోత్రికులం కాదని స్పష్టం చేయాలి.
► ఉభయుల తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం చేసుకుంటున్నామని, ఇంతకుముందు తమకు వివాహం కాలేదని సెక్షన్–8 హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం రిజిష్టర్ చేయించుకునే బాధ్యత తమదేనని తెలపాలి.
► న్యాయ, ధర్మబద్ధంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తామని, వివాహం కుదుర్చుకోవడంలో బాధ్యత తమదేనని టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలుపుతున్నట్లు వధూవరులతోపాటు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాల్సి ఉంటుంది.
► వధూవరుల వయస్సు నిర్ధారణ కోసం స్కూలు సర్టిఫికెట్ లేదా ఆధార్‌కార్డు జతపర్చాలి. తల్లిదండ్రుల ఆధార్ ప్రతులను కూడా జత చేయాలి.
► వధూవరులు వేర్వేరు మండలాలకు చెందిన వారైతే తహసీల్దార్ ధ్రువీకరణ పొందాలి. (క్లిక్: కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట)
Comments
Please login to add a commentAdd a comment