బెల్లంపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రావణమాసంతో శుభ గడియలు, సుముహూర్తాలు మొదలయ్యాయి. ఈ మాసం హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలోని ప్రతి మంగళ, శుక్రవారాలు మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి. వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం రాక కోసం గృహిణులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. శ్రావణమాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉండటంతో ముందస్తు ప్రణాళిక ప్రకారంగా గృహ ఆరంభ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు, వివాహ నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు జరిపించడానికి తహతహలాడుతుంటారు. శ్రావణమాసం ముహుర్తాలు పోతే మళ్లీ కార్తీక మాసం వరకు వేచి చూడక తప్పదని కొందరు పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు.
పెళ్లికి అనుమతి ఇలా..
♦ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో పెళ్లిళ్లకు వధువు నుంచి 10 మంది, వరుడి నుంచి 10 మంది మొత్తంగా 20 మందితో మాత్రమే అనుమతులు ఇస్తున్నారు.
♦తహసీల్దార్ వద్ద పెళ్లికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోసం 10 రూపాయల నాన్ జ్యూడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు అందజేయాలి.
♦ముద్రించిన పెళ్లి పత్రిక కానీ, పురోహితుడు రాసిన లగ్న పత్రిక జతచేసి తెల్లని కాగితంపై దరఖాస్తు చేసుకోవాలి. అలాగే వివాహానికి హాజరయ్యే 20 మంది పేర్లు కూడా అందులోనే రాసి ఇవ్వాలి.
♦దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్ కూడా అందజేయాలి.
♦రెవెన్యూ అధికారులు దరఖాస్తును పరిశీలించి నిబంధనలతో కూడిన అనుమతి పత్రాన్ని జారీ చేస్తారు.
♦నిబంధనలు పాటించని వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 188 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు.
శుభ ముహూర్తాలు ఇవే..
శ్రావణమాసం మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఆగస్టు 14వరకు శుభకార్యాలు నిర్వహించడానికి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. జూలైలో 25, 26, 27, 29 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో 2, 5, 8, 9, 13, 14లల్లో కూడా మంచి రోజులున్నట్లు వేద పండితులు వివరిస్తున్నారు. ఆయా సుముహూర్తాలలో అన్ని రకాల శుభకార్యాలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు. కాగా సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎలాంటి ముహూర్తాలు లేవని, ఆ రెండు నెలలను అధిక మాసమంటారని పేర్కొంటున్నారు. నవంబర్ 18నుంచి మళ్లీ సుముహూర్తాలు ఆరంభం కానున్నాయి.
నిబంధనలతోనే పెళ్లి
పెళ్లంటే పందిర్లు.. తప్పట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. భజాభజంత్రీలు.. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలతో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుపుకోవాలని వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎన్నో కలలు కంటారు. లక్షల్లో ఖర్చు చేసి వివాహాలు జరుపుకుని జీవితాంతం మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాని అలాంటి వేడుకలకు “కరోనా’ మహమ్మారి పుణ్యమా బ్రేక్ పడింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అందరి పరిస్థితి ఇప్పుడు ఒకేలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 20 మందితో మాత్రమే వివాహాలు జరిపించాలని ఆదేశించింది. అలా హామీ ఇస్తేనే అనుమతి ఇస్తామని స్పష్టంగా చెబుతోంది. ఇక అనుమతి పొంది వివాహాలు జరిపించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనాలు ఏర్పాటు చేయరాదని కూడా తెలియజేస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పెళ్లి అనుమతి పొందిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
వివాహాలకు మాత్రమే అనుమతి
కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లకు తప్ప ఇతర శుభకార్యాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. పెళ్లి తంతు ఎంత వైభవమో పెళ్లి అనంతరం పెళ్లి కొడుకు ఇంటి వద్ద ఇచ్చే విందు కూడా అంతే స్థాయిలో వైభవంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా పెళ్లిళ్ల బరాత్‌లు, విందులకు అనుమతి ఇవ్వడం లేదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
పెళ్లికి అనుమతి పొందిన వారిలో చాలా మంది నిబంధనలు ఉల్లంఘిస్తే ఎం కాదులే అనే ధీమాలో ఉన్నారు. అనుమతి పొందాక నిబంధనలు పాటిస్తున్నామా..? లేదా..? అని పరిశీలించే వ్యవస్థ లేదని, స్థానికంగా ఉండే పోలీసులను మేనేజ్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. కాని ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
మంచి ముహూర్తాలు ఉన్నాయి
శ్రావణమాసం ఆరంభం కావడంతో మంచి ముహూర్తాలు వచ్చాయి. నాలుగు నెలలుగా ఇంటిలో నుంచి బయటకు వెళ్లలేదు. కరోనా వల్ల శుభకార్యాలు జరగలేదు. దీంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తి వేయడంతో ఆంక్షల మధ్య శుభకార్యాలు నిర్వహించడానికి వీలు కలుగుతోంది. కానీ బయటకు వెళ్లడానికి భయపడుతున్నాం. ఈ మాసమైనా పండితులకు కాస్తా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాం.–రాంపల్లి నారాయణ శర్మ, అవధాని, బెల్లంపల్లి
Comments
Please login to add a commentAdd a comment