కరోనా కష్ట కాలంలో ఖరీదైన పెళ్లి! | Drive In Wedding In Essex Bypasses Corona Virus Guest Limit | Sakshi
Sakshi News home page

కరోనా కాలంలో వినూత్న పెళ్లి!

Published Wed, Oct 7 2020 7:58 AM | Last Updated on Wed, Oct 7 2020 3:11 PM

Drive In Wedding In Essex Bypasses Corona Virus Guest Limit - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డబ్బున్న వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా పెళ్లిళ్లయినా, పేరాంటాలయిన అంగరంగ వైభవంగా చేసుకుంటారని తెలుసు. అంతో ఇంతో డబ్బున్న ఐటీ రంగానికి చెందిన వారయితే అంగరంగ వైభవానికి తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత మెరుగులు దిద్దుతారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ రూపంలో ప్రపంచవ్యాప్తంగా పాడుకాలం దాపురించడంతో ధనవంతుల పెళ్లిళ్లు కూడా దరిద్రంగా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. పెళ్లికయినా, చావుకైనా పాతికకన్నా ఎక్కువ మంది హాజరుకారాదనే నిబంధనలు పలు దేశాల్లో అమల్లో ఉండడంతో వీలైన ధనంతులంతా పెళ్ళిళ్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. 

లండన్‌లోని సౌత్‌గేట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోన్న 30 ఏళ్ల రోమా పోపట్, ఐటీ కన్సల్టెంట్‌ వినాల్‌ పటేల్‌ (30)లు ప్రేమించుకున్నారు. గత ఏప్రిల్‌ నెలలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉండడంతో వారు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఎన్ని నెలలు గడిచిపోయినా కరోనా మహమ్మారి కరుణించకపోవడం, ప్రభుత్వం ఆంక్షలు సడలించక పోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి 30 మందికి మించి పిలవకూడదనే నిబంధన ఉండగా, నేడు లండన్‌లో 15 మందికి మించి అనుమతించకూడదనే నిబంధన అమలులో ఉండడంతో నిబంధనలకు లోబడే పెళ్లి చేసుకోవాలని వారు తీర్మానించుకున్నారు. అందుకోసం ఎస్సెక్స్‌లోని 500 ఎకరాల గ్రౌండ్‌ను పెళ్లి వేదికగా బ్రాక్స్‌లెడ్‌ పార్క్‌ను పెళ్లి పందిరిగా ఎంపిక చేసుకున్నారు.

పెళ్లి కోసం 250 మంది సమీప బంధు మిత్రులను ఎంపిక చేసుకున్నారు. వారికి  శుక్రవారం నాడు ఆన్‌లైన్‌ ద్వారా ఆహ్వాన పత్రాలు పంపించారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడానికి నాప్‌కిన్స్‌ను, శానిటైజర్లను పంపించారు. పెళ్లి జరిగే మైదానంలో పాటించాల్సిన కరోనా ముందస్తు జాగ్రత్తలను సూచించారు. వాటితోపాటు రుచికరమైన స్నాక్స్‌ను పంపించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివాహమహోత్సవ కార్యక్రమానికి వారంతా ఆడిస్, ల్యాండ్‌రోవర్, లంబోర్గిని తదితర విలాసవంతమైన కార్లలో కులాసాగా వచ్చారు. ముందుగా సూచించిన జాగ్రత్తల మేరకు వారు నిర్దిష్ట దూరంలో కార్లను పార్క్‌ చేశారు. కార్లలో నుంచి ఎవరు దిగకుండా కార్లలో నుంచే పెళ్లి వేదికను, పెళ్లి వేదిక స్పష్టంగా కనిపించేలా అక్కడక్కడ ఏర్పాటు చేసిన స్కీన్లను తిలకిస్తూ వచ్చారు. పెళ్లి వారు సూచించిన ఫుడ్‌ వెబ్‌సైట్‌ను ఆశ్రయించి తమకిష్టమైన తినుబండారాలను, ఇష్టమైన హోటళ్ల నుంచి తెప్పించుకు తిన్నారు. పెళ్లి తతంగం పూర్తయ్యాక నూతన దంపతులు గోల్ఫ్‌ బగ్గీలో మైదానమంతా తిరుగుతూ వచ్చిన అతిథులకు అభినందనలు తెలిపారు.  (‘పెళ్లి కల వచ్చేసిందే కాజల్‌..’)

బయట నుంచి వచ్చిన పార్శళ్లను జాగ్రత్తగా విప్పి ఆర్డర్‌ ఇచ్చిన అతిథులకు వాటిని తగిన జాగ్రత్తలతో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెయిటర్ల బందం అందజేసింది. టాయిలెట్‌ లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి అతిథులెవరూ కార్ల నుంచి కాలు బయట పెట్టలేదు. పెళ్లి వేదికపై 15 మందికి మించి కుటుంబ సభ్యులు లేకుండా చూసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్లి వేడుకను నెట్‌ లింక్‌ ద్వారా భారత్, అమెరికా, కెనడా దేశాల నుంచి మరో 300 మంది అతిథులు వీక్షించారు. ఒక్క రోజు పెళ్లి వేదిక కోసం 15 వేల పౌండ్లు (దాదాపు 14.50 లక్షల రూపాయలు) చెల్లించారు. ఫుడ్‌ వెబ్‌ సైట్‌కు ఎంత ఖర్చు పెట్టారో తెలియరాలేదు. 

పెళ్లికి ఇంత మంది హాజరయ్యాక కరోనా నిబంధనలు ఎక్కడ పాటించారనే ప్రశ్న ఎవరికయినా రావచ్చు. పెళ్లి వేదికపై భౌతికంగా 15 మంది హాజరయ్యేందుకు అనుమతి తీసుకొని అంతమేరకే అనుమతించారు. అవుట్‌ డోర్‌ స్క్రీనింగ్‌ కింద 250 కార్లకు అనుమతి తీసుకున్నారు. కార్ల పార్కింగ్‌లోనూ నిబంధనలు పాటించారు. ఈ రోజు ఇంత పెద్ద ఈవెంట్‌ విజయవంతం అయినందుకు ఆనందంగా ఉందని బ్రాక్స్‌టెడ్‌ పార్క్‌ సీఈవో అలెక్స్‌ రెయినర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పెళ్ళిళ్ల పరిశ్రమ కుప్ప కూలిపోయిందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న తమ ప్రభుత్వం 15 మందికి మించి అనుమతించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోపట్, పటేల్‌ పెళ్లితో కొత్త పద్ధతిలో పెళ్లిళ్లు ఎలా జరపవచ్చో అనుభవపూర్వకంగా తెల్సిందని ఆయన చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement