పెళ్లికి వచ్చిన వారిని బయటకు పంపిస్తున్న పోలీసులు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని న్యాల్‌కల్ రోడ్డులోగల ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం పెళ్లి వేడుకను పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి వివాహ వేడుకను నిర్వహిస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా.. ఫంక్షన్‌హాలో వివాహ వేడుకకు 120మంది వరకు అతిథులు హాజరవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 5వ టౌన్ ఎస్సై జాన్‌రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకొని పెళ్లికి హాజరైన వారందరిని అక్కడినుంచి పంపించి వేశారు. అప్పటికి ఇంకా పెళ్లి జరగలేదు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఆగిపోకూడదని పోలీసులను వేడుకున్నారు. దీంతో వారు వధూవరుల కుటుంబాలకు సంబంధించి కేవలం 8మందిని మాత్రమే అనుమతించి మిగితవారందరిని అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ఈ 8మంది సమక్షంలోనే పెళ్లిని నిర్వహించి, అక్కడి నుంచి వారిని పంపించి వేశారు. దీంతో అతిథుల కోసం ఏర్పాటుచేసిన భోజనాలు అలాగే మిగిలిపోయాయి.
లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమణ..
లాక్‌డౌన్ నేపథ్యంలో మున్సిపాలిటీ, పోలీసు శాఖ ఫంక్షన్‌హాళ్లకు అనుమతి ఇవ్వడం లేదు. కానీ అనుమతి లేకున్న న్యాల్‌కల్ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్ పెళ్లికి అనుమతి ఇచ్చింది. పైగా వందకు పైబడి అతిథులు పెళ్లికి హాజరయ్యారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు చేపడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఫంక్షన్‌హాల్ నిర్వాహకులు ఇలా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయవల్సి ఉంది. మున్సిపల్ శాఖ వారు ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేసి అపరాద రుసుంతో పాటు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంపై 5వ టౌన్ పోలీసులను వివరణ కోరగా ఫంక్షన్‌హాల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment