సాక్షి, మెదక్ : వివాహానికి వెళ్లి ముంబైలో చిక్కుకున్న వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 30 మంది ఉన్నారు. ఇందులో మెదక్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియా, కుమ్మరి వాడకు చెందిన వారు 20 మంది కాగా.. హైదరాబాద్ వాసులు 8 మంది, సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఇద్దరు. ముంబైలో గత నెల (మార్చి) 19న వివాహం ఉండగా.. వీరందరూ అదే నెల 15న అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగా 22వ తేదీన రిజర్వేషన్ సైతం చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రధాని మోదీ 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 23వ తేదీన సైతం టికెట్లు బుక్ చేశారు. కానీ ఈ రోజు నుంచే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు కావడంతో తెలంగాణ వాసులు ముంబైలోనే చిక్కుకుపోయారు. గడువు పొడిగింపుతో ఇక్కట్లు వివాహ అనంతరం తప్పని పరిస్థితుల్లో బాధితులు ముంబై సెంట్రల్ నాగ్పాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కామాటిపుర ఆరో లేన్‌లో రెండు కమ్యూనిటీ భవనాలు అద్దెకు తీసుకున్నారు. (కరోనా : వారి అనుమానం అతని ప్రాణం తీసింది)
భౌతిక దూరం తప్పనిసరి కావడంతో ఒక దాంట్లో మహిళలు, మరో భవనంలో పురుషులు ఉంటున్నారు. ముందుగా మార్చి 31 వరకే లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో క్లిష్టంగా ఉన్నప్పటికీ.. సర్దుకుపోయారు. అయితే.. ఆ తర్వాత లాక్‌డౌన్ ఏప్రిల్ 14.. అనంతరం వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగించడంతో వారు ఏం చేయాలో తోచక నరకయాతన అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇక్కట్లతోపాటు తిండి కష్టాలు వెంటాడుతుండగా.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు అద్దె రూ.4 వేలు ఒక్క భవనానికి రోజుకు అద్దె రూ.2 వేలు కాగా.. రెండింటికి కలిపి రూ.4 వేలు అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి 38 రోజులు అవుతోందని.. ఇప్పటివరకు ఒక్క కిరాయికే రూ.1.60 లక్షలు అయిందని.. అప్పు చేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు వేయించుకుని చెల్లించామని వాపోయారు. కూరగాయాలు, వంట సామగ్రికి సైతం మూడు, నాలుగింతల అధిక రేట్లు ఉన్నాయని.. ఇక తమ దగ్గర ఆర్థిక స్థోమత లేదని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లు సాక్షికి వెల్లడించారు. (యూఎస్‌లో మా ఆవిడ,ఇక్కడ నేను.. )
Comments
Please login to add a commentAdd a comment