ముంబైకి చెందిన హీనా మాండవియ కొడుకు హర్ష్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు భర్త కారు యాక్సిడెంట్‌లో మరణించారు. దీంతో కుటుంబ భారం హీనా మీద పడింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న హీనా కొంతమంది దాతల సాయానికి తోడు రెక్కల కష్టంతో కుటుంబాన్ని లాక్కొచ్చింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాక తనను ఆదుకున్న దాతలకు డబ్బు తిరిగివ్వబోతే..‘‘డబ్బులు వద్దమ్మా.. ఆపదలో ఉన్న ఓ పదిమందిని ఆదుకోండి! అని చెప్పడంతో హీనా, హర్ష్‌లు ఇద్దరూ కలిసి వేలమంది నిరుపేదల ఆకలి తీరుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు.
గుజరాత్‌లోని జామ్ నగర్‌కు చెందిన హీనా... భర్త చనిపోయాక, హర్ష్‌కు మంచి విద్యను అందించేందుకు ముంబైకు మారారు. జీవిక కోసం హీనా టిఫిన్లు తయారు చేసి ఇస్తే.. హర్ష్ ఇంటింటికి తిరిగి వాటిని విక్రయించేవాడు. వీరి టిఫిన్లు శుచిగా రుచిగా ఉండడం తో కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరిగింది. తల్లీ కొడుకులు పడుతున్న కష్టాన్ని గమనించిన ఒక కస్టమర్ అప్పట్లో కొంత సాయం చేశారు. ఆ డబ్బుతో ‘హర్ష్ థాలి అండ్ పరాటా’ పేరుతో ముంబైలో ఒక టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. మొదట్లో హీనా ఒక్కతే టిఫిన్ సెంటర్‌ను చూసుకునేది. హర్ష్ డిగ్రీ పూరై్తన తరువాత వ్యాపారాన్ని విస్తరించాడు. ఆన్‌లైన్ బిజినెస్ బాగా జరగడంతో వారి ఆర్థిక ఇబ్బందులు కూడా కాస్త సర్దుకున్నాయి.
లాక్‌డౌన్ కాలంలో...
గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది ఆకలితో అలమటించారు. ఇది చూసిన ఓ కస్టమర్ వందమందికి భోజనం పెట్టగలరా? అని అడగడంతో తల్లీకొడుకులు వెంటనే ఒప్పుకుని వందమందికి ఉచితంగా ఆహారం అందిం చారు. ఈ ప్రేరణతో హర్ష్ అదేరోజు సాయంత్రం ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తాం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొంతమంది దాతలు సాయం చేయడానికి ముందుకు రావడంతో వీరు రోజూ 100 నుంచి 150 మంది ఆకలి తీర్చేవారు. అప్పటినుంచి ఇప్పటివరకూ తల్లీకొడుకులు నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు.
‘‘స్థోమత లేకపోయినప్పటికి అమ్మ నన్ను మంచి స్కూల్లో చదివించాలనుకుంది. మా పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూల్ డైరెక్టర్ మొత్తం ఫీజును మాఫీ చేశారు. చదువుకుంటూనే అమ్మకు టిఫిన్ల తయారీలో సాయపడేవాడిని. డిగ్రీ అయ్యాక నేను టì ఫిన్ సెంటర్ బాధ్యత తీసుకుని ఆన్‌లైన్‌లో వ్యాపారాన్ని విస్తరించడంతో మా ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఆర్థికపరిస్థితులు మెరుగు పడడంతో నా చిన్నప్పటి స్కూలు డైరెక్టర్ ఇంటికి వెళ్లి ఆయన చేసిన సాయానికి కృతజ్ఞతగా కొంత డబ్బు ఇవ్వబోతే.. అతను ‘‘నాకు ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వనక్కరలేదు. అయితే నాలా మీరు మరికొంత మందికి సాయం చేయండి’’ అని చెప్పారు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూసిన మేము గతేడాది లాక్‌డౌన్ కాలంలో వంద ధాబాలలో ఫుడ్ తయారు చేయించి అడిగిన వారందరికీ ఆకలి తీర్చేవాళ్లం. ప్రస్తుతం కూడా పరిస్థితులు అప్పటిలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు కూడా నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం’’ అని హర్ష్ చెప్పాడు.
తిరిగివ్వొద్దు... పదిమందికి సాయపడండి!
Published Sat, May 8 2021 12:22 AM | Last Updated on Wed, Mar 2 2022 7:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment