తొలిరోజే 630 విమానాలు రద్దు | 630 domestic flights cancelled across India | Sakshi
Sakshi News home page

630 విమానాలు రద్దు

Published Tue, May 26 2020 4:08 AM | Last Updated on Tue, May 26 2020 9:23 AM

630 domestic flights cancelled across India - Sakshi

విమానంలో సొంత రాష్ట్రం చేరుకునేందుకు సోమవారం ముంబై ఎయిర్‌పోర్టులో బారులు తీరిన ప్రయాణికులు

న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలకు చేరుకున్నారు. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టులు కొంత రద్దీగా కనిపించాయి. ఢిల్లీ నుంచి మొదటి విమానం ఉదయం 4.45 గంటలకు పుణేకు బయలుదేరింది. ముంబై నుంచి తొలి ఫ్లైట్‌ ఉదయం 6.45 గంటలకు బిహార్‌ రాజధాని పట్నాకు బయలుదేరింది.

అయితే, కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.
 
దేశీయ విమాన సేవలు పునఃప్రారంభం అయ్యాక తొలిరోజు సోమవారం 532 విమానాలు రాకపోకలు సాగించాయని, 39,231 మంది ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ చెప్పారు. మంగళవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 28 నుంచి పశ్చిమ బెంగాల్‌లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మున్ముందు దేశీయ విమానాలు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

 మార్గదర్శకాలు పాటిస్తేనే..:  ప్రయాణికుల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఫేస్‌ మాస్కులు ధరించిన వారినే విమానాల్లోకి అనుమతించాలని పేర్కొంది. విమానాల్లో ఆహారం సరఫరా ఉండరాదంది. మొబైల్‌ ఫోన్లు ఉన్నవారు ఆరోగ్యసేతు యాప్‌లో తమ ఆరోగ్యం వివరాలు నమోదు చేయాలని, లేనివారు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రం సమర్పించాలని సూచించింది. టికెట్ల ధరల విషయంలోనూ పరిమితి విధించింది. తమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులకు విమానాల్లో చేరుకునేవారి విషయంలో సొంతంగా క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేస్తామని కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి.  

వివాదంలో కేంద్ర మంత్రి సదానంద
కేంద్ర మంత్రి సదానంద గౌడ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరు వచ్చి, క్వారంటైన్‌కు వెళ్లకుండా, నేరుగా ఇంటికి వెళ్లడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి.  నిత్యావసర వస్తువుల కిందకు వచ్చే ఔషధ విభాగ ఇన్‌చార్జి మంత్రిగా తనకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఔషధాల ఉత్పత్తి, సరఫరా తదితర కీలక అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన తను క్వారంటైన్‌లో ఉండటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిత్యావసర వస్తు విభాగాలకు చెందినవారికి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని కర్ణాటక ప్రభుత్వం కూడా పేర్కొంది. అయితే, గౌడ తీరుపై సోషల్‌ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. నిబంధనలు సామాన్యులకే కానీ, వీఐపీలకు కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు.   

జూన్‌ 6  వరకు అన్ని సీట్లలో కూర్చోవచ్చు
ఎయిర్‌ ఇండియాను అనుమతించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు జూన్‌ 6 వరకు నడిపే అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీటుని సైతం భర్తీ చేసుకునేందుకు ఎయిర్‌ ఇండియాను సుప్రీంకోర్టు అనుమతించింది. విమానయాన సంస్థల లాభం కంటే ప్రజల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వానికీ, ఎయిర్‌ ఇండియాకీ స్పష్టం చేసింది. జూన్‌ 6 తరువాత మాత్రం బాంబే హైకోర్టు ఆదేశాలననుసరించి ఎయిర్‌ ఇండియా విమానాల్లో మధ్య సీటుని తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని తేల్చింది.

మధ్యసీటు ఖాళీగా ఉంచాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్రం, ఎయిర్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రంజాన్‌ సందర్భంగా కోర్టుకి సెలవు ఉన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారించింది. విమానాల్లో భౌతిక దూరం ఆవశ్యకతను అధికారులు గుర్తించాలని, కోవిడ్‌ నేపథ్యంలో దగ్గరగా కూర్చోవడం ప్రమాదమని  నొక్కి చెప్పింది. ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు అయిన విమానమైతే జూన్‌ 6 వరకు మధ్య సీటుని భర్తీచేసుకునే అవకాశాన్నిస్తున్నట్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement