మంచి పని దయ ఎక్కడో... దైవం అక్కడ!
కొందరు మంచి పనులు చెయ్యాలనుకుంటారు. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలీదు. ఇంకొందరు తాము చెయ్యాలనుకుంటున్న సాయం ఎంతమేరకు ప్రయోజనకరంగా ఉంటుందో అని సందేహపడుతూ కొంతకాలం, తగిన మార్గం తోచక కొంతకాలం, తోచినా కూడా తర్వాత చేద్దాంలే అని మరికొంతకాలం తాత్సారం చేస్తూ చివరికి ఏ పనీ చేయకుండానే పుణ్యకాలం కాస్తా గడిపేస్తారు.
అయితే మంచి పనులు చేసిన వారి జాబితా అంతా ఒక చోట రాసి, అందులో వారు ఏం చేశారో, ఆ పనిని ఎలా చేశారో ఎవరైనా రాస్తే ఎలా ఉంటుంది? అవన్నీ చదివిన తర్వాత తప్పక మంచి ఆలోచనలు వస్తాయి, ‘మంచి’తో మమకారం ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచించారు ప్రముఖ రచయిత మల్లాది. అందుకే మంచి పనులు చేసిన వారి వివరాలన్నింటినీ ఓపిగ్గా సేకరించి, వాటన్నింటినీ ఒక చోట గుదిగుచ్చారు. దానికి ‘గుడ్ బెటర్ బెస్ట్’ అనే పుస్తక రూపమిచ్చారు.
ఇందులో దేశవ్యాప్తంగా రకరకాలైన మంచి పనులు చేసిన వారి గురించి ఎంతో క్లుప్తంగా, మరెంతో ఆప్తంగా పొందుపరిచారు. ప్రపంచ ప్రఖ్యాతుల దగ్గర నుంచి, పేరు కూడా తెలియని వారి వరకు ఉన్న ఈ పుస్తకం చివరలో అవలీలగా ఆచరించదగిన కొన్ని పనుల గురించి రచయత తెలియజేసిన తీరు అభినందనీయం.
ఒకవిధంగా ఈ పుస్తకాన్ని చదవడం కూడా మంచి పనే, ఎందుకంటే పదిమందికీ మేలు చేసే పనుల గురించి తెలుస్తుంది. ఆచరణీయ మార్గం దొరుకుతుంది. నాస్తికులకు కూడా నచ్చే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ దొరుకుతుంది.
- డి.వి.ఆర్