
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన మహావికాస్ అఘాడి, మహాయుతి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం మూడు జాబితాలతో కలిపి కాంగ్రెస్ ఇప్పటివరకు 87 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
కాంగ్రెస్ మూడో జాబితాలో డిగ్రాస్ నుంచి మాణిక్‌రావ్ ఠాక్రేను పార్టీ బరిలోకి దించింది. బాంద్రా వెస్ట్ నుంచి ఆసిఫ్ జకారియా, అంధేరీ వెస్ట్ నుంచి సచిన్ సావంత్‌లకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. మాలెగావ్ సెంట్రల్ నుండి కాంగ్రెస్ ఎజాజ్ బేగ్‌కు అవకాశం కల్పించింది. అయితే సమాజ్ వాదీ పార్టీ ఈ సీటు కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ తన రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, తొలి జాబితాలో 48 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
మరోవైపు మహా వికాస్ అఘాడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకానికి సంబంధించిన ఫార్ములాను ప్రకటించింది. దీని ప్రకారం శివసేన (యూబీటీ), కాంగ్రెస్- ఎన్‌సీపీ (ఎస్‌పీ) చెరో 85 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.
ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు
Comments
Please login to add a commentAdd a comment