ప్రవక్త జీవితంలో ముఖ్య ఘట్టం.. మొహర్రం | Importance of Muharram: First Month of the Islamic New Year | Sakshi
Sakshi News home page

ప్రవక్త జీవితంలో ముఖ్య ఘట్టం.. మొహర్రం

Published Mon, Jul 15 2024 12:29 AM | Last Updated on Mon, Jul 15 2024 12:29 AM

Importance of Muharram: First Month of the Islamic New Year

ఇస్లామీయ క్యాలండర్‌ ప్రకారం  సంవత్సరంలోని మొదటి నెల ‘మొహర్రం ’. ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్‌  ప్రవక్త (స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్‌’. (మక్కా నుండి మదీనాకు వలస). 

హిజ్రత్‌ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్య సందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉంటుంది.

దేవుడు భూమ్యాకాశాలను సృష్టించిన నాటినుండి నెలల సంఖ్య పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు పవిత్ర మాసాలు’. అందులో ‘మొహర్రం’ కూడా ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం: ‘పన్నెండు నెలలు ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవప్రదమైనవి. జుల్‌ ఖ అద, జుల్‌ హిజ్జ, ముహర్రమ్, రజబ్‌. కనుక ఈ నెలలో ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. 

సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవ భీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ నెల ఘనతకు సంబంధించి ముహమ్మద్‌ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్‌ నెల. రమజాన్‌ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ 

(సహీహ్‌ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్‌ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్తవస్త్రం కప్పేవారు.  ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు.

 ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్‌ బారినుండి రక్షించాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా  పాటించమని ఉపదేశించారు. ముహర్రం మాసం 9, 10 లేదా 10, 11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. 

(సహీహ్‌ ముస్లిం 1162).
మొహర్రం నెల ్రపాముఖ్యం, హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో హజ్రత్‌ ఇమామె హుసైన్, ఆయన పరివారం వీరమరణం పొందారు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ్రపాణాలను సైతం లెక్క చేయకుండా ΄ోరాడి అమరుడయ్యారో మనం దాని నుంచి ప్రేరణ పొందాలి. 

సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు,  సమాజ శ్రేయోభిలాషులు, న్యాయప్రేమికులు, ΄ûరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా ΄ోరాడాలి. ఇదే ఇమామె హుసైన్‌ అమరత్వం మనకిస్తున్న సందేశం.
( 17, బుధవారం మొహర్రం – యౌమె ఆషూరా)

కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్రపాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించనక్కర లేదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. 

అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి ΄ోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు.  

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement