సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి(ఏవోవీఎన్) పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనే ప్రతిభావంతులైన దళిత, గిరిజన యువత కల సాకారం చేసే పథకం ఇది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థికసాయం అందుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్యావకాశాన్ని సాకారం చేస్తున్న ఏవోవీఎన్ సత్ఫలితాలిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల ఒక పరిశీలన చేసింది. 117 మంది విద్యార్థుల వివరాలు తెలుసుకుని వారి పరిస్థితిని ఆరా తీసింది. ఇందులో మెజార్టీ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడినట్లుగా గుర్తించింది.
ఐటీ రంగంలోనే అధికం...
ఈ పథకం కింద ఇప్పటివరకు 518 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 407 మంది ఆయాదేశాల్లోని వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. 2017 వరకు ఎంపికైన విద్యార్థులు కోర్సులు పూర్తిచేయగా మిగతావారు కోర్సు కొనసాగిస్తున్నారు. పరిశీలన చేసిన 117 మందిలో 74 మంది ఇప్పటికే ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు సాధించారు. వారిలో దాదాపు 65 శాతం మంది చదువుకున్న చోటే ఉద్యోగాలు పొందారు. మరో 30 మంది అత్యుత్తమ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్నట్లు గుర్తించారు. మరో 13 మంది మాత్రం కోర్సు తుదిదశలో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.63.03 కోట్లు ఖర్చు చేయగా 78.57 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆర్నెళ్లలో సక్సెస్‌రేటు 95 శాతం ఉంటుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఐదేళ్లలో ఏవోవీఎన్ పథకం అమలుతీరు
ఏవోవీఎన్‌కు ఎంపికైన విద్యార్థులు : 518
కోర్సుల కోసం విదేశాలకు వెళ్లినవారు : 407
సక్సెస్ రేట్: 78.57 శాతం
పథకం కింద ఖర్చు చేసిన మొత్తం: రూ. 63.03 కోట్లు
ఏవోవీఎన్ లబ్ధిదారుల పరిశీలన ఇలా...
పరిశీలించిన విద్యార్థులు : 117
ఉద్యోగాలు పొందినవారు : 74
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు : 30
మాస్టర్స్ కోర్సు కొనసాగిస్తున్నవారు : 13
సంతృప్తికర స్థాయిలో లబ్ధి
ఏవోవీఎన్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను అపరిమితం చేశాం. అర్హులు ఎంతమంది వస్తే అంతమందికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం ఆమోదిస్తుండడంతో విద్యార్థులు సైతం సాఫీగా కోర్సు పూర్తి చేయగలుగుతున్నారు.
– పి.కరుణాకర్ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment