vidya nidhi
-
నవంబర్ 1 నుంచి ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మహత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద నవంబర్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణకు తుది గడువుగా నిర్దేశించగా.. దరఖాస్తులను ఈపాస్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. (చదవండి: వచ్చే నెలలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్) పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు టీఎస్ పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 25 వరకు పెంచినట్లు సెట్ కన్వీనర్ పి.రమేశ్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌లో 17,628 అర్హత సాధించారు. వీరిలో ఇప్పటివరకు 7,500 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెబ్ఆప్షన్స్ ఈ నెల 29 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపారు. నవంబర్ 3వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందని, 4 నుంచి 12వ తేదీ వరకూ అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 15 నుంచి క్లాసులు మొదలవుతాయని పేర్కొన్నారు. ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు నోటిఫికేషన్ డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు టీఎస్పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2009 జూలై2 నుంచి 2011 జనవరి 1 మధ్య జన్మించిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. దరఖాస్తులను నవంబర్15లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 18న హైదరాబాద్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్ తెలిపారు. (చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. పెళ్లి పేరుతో!) -
‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య’ అద్భుతం
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి(ఏవోవీఎన్) పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనే ప్రతిభావంతులైన దళిత, గిరిజన యువత కల సాకారం చేసే పథకం ఇది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థికసాయం అందుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్యావకాశాన్ని సాకారం చేస్తున్న ఏవోవీఎన్ సత్ఫలితాలిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల ఒక పరిశీలన చేసింది. 117 మంది విద్యార్థుల వివరాలు తెలుసుకుని వారి పరిస్థితిని ఆరా తీసింది. ఇందులో మెజార్టీ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడినట్లుగా గుర్తించింది. ఐటీ రంగంలోనే అధికం... ఈ పథకం కింద ఇప్పటివరకు 518 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 407 మంది ఆయాదేశాల్లోని వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. 2017 వరకు ఎంపికైన విద్యార్థులు కోర్సులు పూర్తిచేయగా మిగతావారు కోర్సు కొనసాగిస్తున్నారు. పరిశీలన చేసిన 117 మందిలో 74 మంది ఇప్పటికే ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు సాధించారు. వారిలో దాదాపు 65 శాతం మంది చదువుకున్న చోటే ఉద్యోగాలు పొందారు. మరో 30 మంది అత్యుత్తమ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్నట్లు గుర్తించారు. మరో 13 మంది మాత్రం కోర్సు తుదిదశలో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.63.03 కోట్లు ఖర్చు చేయగా 78.57 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆర్నెళ్లలో సక్సెస్‌రేటు 95 శాతం ఉంటుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐదేళ్లలో ఏవోవీఎన్ పథకం అమలుతీరు ఏవోవీఎన్‌కు ఎంపికైన విద్యార్థులు : 518 కోర్సుల కోసం విదేశాలకు వెళ్లినవారు : 407 సక్సెస్ రేట్: 78.57 శాతం పథకం కింద ఖర్చు చేసిన మొత్తం: రూ. 63.03 కోట్లు ఏవోవీఎన్ లబ్ధిదారుల పరిశీలన ఇలా... పరిశీలించిన విద్యార్థులు : 117 ఉద్యోగాలు పొందినవారు : 74 ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు : 30 మాస్టర్స్ కోర్సు కొనసాగిస్తున్నవారు : 13 సంతృప్తికర స్థాయిలో లబ్ధి ఏవోవీఎన్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను అపరిమితం చేశాం. అర్హులు ఎంతమంది వస్తే అంతమందికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం ఆమోదిస్తుండడంతో విద్యార్థులు సైతం సాఫీగా కోర్సు పూర్తి చేయగలుగుతున్నారు. – పి.కరుణాకర్ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
విద్యానిధి నిష్ఫలం?
సాక్షి, కాకినాడ : పేద వర్గాలకు కార్పొరేట్ విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన ‘విద్యానిధి’ నిష్ఫలమైంది. దానికి సంబంధించిన కోట్లాది రూపాయలు బ్యాంకులో మూలుగుతున్నాయి. అయితే దీన్ని పట్టించుకొనే నాథుడే లేడు. వివరాల్లోకి వెళితే... నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు పూర్వపు కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర ‘విద్యానిధి’ పేరిట చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని యోచించారు. ఆమేరకు 2010-11లో రవిచంద్ర ఎస్పీ, మహిళా సమాఖ్య, డీఆర్డీఏ పీడీ తదితరులతో కమిటీ నెలకొల్పారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నెలలో ఒకరోజు వేతనాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. జిల్లాలో ఎనభై వేల వరకూ ఉన్న మహిళా సంఘాల సభ్యులైతే ఒకో సంఘం నెలకో రూపాయి వేస్తే చాలన్నట్టు ట్రస్టును తీర్చిదిద్దారు. వీరు కాక కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛందంగా విరాళాలిచ్చే దాతలు ముందుకొస్తే పేదల విద్యకు అడ్డు ఉండదనుకున్నారు. అలా పోగు చేసిన మొత్తం రూ.3 కోట్లయింది. దీనిని జగన్నాథపురం ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇంత మొత్తం డిపాజిట్ చేసినందుకు జిల్లాలోని ఆ బ్యాంకు బ్రాంచీల నుంచి ఒకో బ్యాంకు కనీసం ఏడాదికి ఐదుగురికి చదువుకునేందుకు రుణం కల్పించాలన్న షరతు పెట్టారు. పథకానికి రూపకల్పన చేసిన కలెక్టర్ రవిచంద్రకు రెండేళ్ల క్రితమే బదిలీ కాగా మరికొంత కాలానికి డీఆర్డీఏ పీడీకి బదిలీ అయింది. మిగిలిన వారు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ మహోదాత్త ఆశయం నీరుకారింది. పేర్లు మార్పుతో ఆచరణలోకి ఉన్నత ఆలోచనలతో వసూలు చేసిన విరాళాల సొమ్ము హోదాలతో కాకుండా ట్రస్టు ద్వారానే వ్యక్తుల పేర్ల (రవిచంద్ర, మధుకర్‌బాబు) మీద బ్యాంకులో జమయింది. వారిద్దరూ జిల్లాను వదిలి వెళ్లడంతో ఆ నిధుల వినియోగానికి ముందుకెళ్లాలంటే ఆయా పేర్లను బ్యాంకులో హోదాలకు బదలాయించాలి. అప్పుడు మాత్రమే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. దీనికి రవిచంద్ర పూర్తి అంగీకారం తెలుపుతూ ట్రస్టు సమావేశమై పిలిస్తే వస్తానంటున్నారు. ఈ అంశంపై డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు మాట్లాడుతూ ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తానన్నారు.