రక్షణ ఉన్న యూనివర్సిటీలపై తల్లిదండ్రుల దృష్టి.. కన్సల్టెంట్లు, వ్యక్తుల ద్వారా వాకబు చేయిస్తున్న వైనం
అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చాకే చేర్పించేందుకు సంసిద్ధత
అమెరికాలో భారత విద్యార్థులపై దాడుల నేపథ్యంలో కొత్త ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తమ పిల్లలను పంపే తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడి భద్రతపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో డిగ్రీలకన్నా తమ పిల్లలు భద్రంగా ఉంటారా లేదా అనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఇటీవలికాలంలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల ఉదంతాల నేపథ్యంలో ఈ తరహా జాగ్రత్త కనిపిస్తోంది. ఈ క్రమంలో సవాలక్ష సందేహాలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయని అమెరికా వర్సిటీల్లో మన విద్యార్థులు ప్రవేశాలు పొందడంలో సాయం చేసే కన్సల్టెంట్లు చెబుతున్నారు.
చేర్చాలనుకునే వర్సిటీలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు ముందుగా ఓ వ్యక్తిని పంపి అక్కడి పరిస్థితుల గురించి వాకబు చేయిస్తున్నారు. 2024 అడ్మిషన్ల ఫలితాలు వెల్లడువుతున్న తరుణంలో ఇలాంటి భయాలు తల్లిదండ్రుల్లో ఎక్కువయ్యాయని కన్సల్టెంట్లు అంటున్నారు. అమ్మాయిలను అమెరికాలో పైచదువులకు పంపే తల్లిదండ్రులు మరింత ఎక్కువగా విచారణ చేయిస్తున్నారని బెంగుళూరుకు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో ఆదర్శ ఖండేల్వాల్ తెలిపారు. ‘ప్రస్తుతం అడ్మిషన్ ఫలితాలు వెలువడుతున్నాయి. 2024లో భద్రత అనేది ఒక ప్రధాన అంశంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
క్రైం రేటుపై వాకబు..
అమెరికాలోని ఏయే యూనివర్సిటీల పరిధిలో ఎంత క్రైం రేటు ఉంది? ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? డ్రగ్స్ ప్రభావం ఏమైనా ఉందా? అనే అంశాలను తల్లిదండ్రులు ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం పిల్లలను పంపే తల్లిదండ్రుల్లో నేరాలపై ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. తొలిసారి దేశానికి, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే దీనికి ప్రధాన కారణమని విదేశీ కన్సల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి.
షికాగో, బోస్టన్, ఇండియానా వంటి ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులపై దాడులతోపాటు అక్కడ ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా నివేదికలు ఇవే వెల్లడించడంతో ఈ ప్రాంతాలకు పంపాలంటే తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఇటీవల ఓ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.
సమస్యాత్మకం కాని వర్సిటీల వైపే
అమెరికన్ యూనివర్సిటీలకు వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే తక్కువ సమస్యాత్మకమైన వాటినే భారతీయ విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీనిపై సమగ్ర అవగాహన కలిగాకే విదేశీ చదువులపై ప్రణాళిక రచిస్తున్నారని విదేశాల్లోని స్టడీ కెరీర్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు కరణ్ గుప్తా తెలిపారు. పెద్ద నగరాలు లేదా తక్కువ సమస్యాత్మకమైనవిగా గుర్తించే యూఎస్ వర్సిటీల ఆఫర్లను మాత్రమే ఇష్టపడుతున్నారని తెలిపారు.
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఫ్లోరిడాలోని ‘చి’ యూనివర్సిటీని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతంపై సమగ్ర సమాచారం సేకరించిన తల్లిదండ్రులు తమ కుమారుడిని ఆ వర్సిటీలో కాకుండా ఎన్‌వైయూ యూనివర్సిటీ మంచిదని అందులో చేర్పించారు. 95% కేసుల్లో, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం తల్లిదండ్రులు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని మరో కన్సల్టెంట్ గుప్తా తెలిపారు.
ఆరిజోనా, ఒహాయో, టెక్సాస్, లాస్ ఏంజిలెస్, కాలిఫోర్నియా, డాలస్ వంటి ప్రాంతాలకు తమ పిల్లలను పంపాలనుకొనే తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు కోరుతున్నారు. వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి కాలిఫోర్నియాలోని క్లేర్‌మాంట్ మెక్‌కెన్నా కాలేజీలో చేరాలని ఇష్టపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం దానికి బదులుగా బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆఫర్‌ను తీసుకోవాలని పట్టుబట్టారు, విద్యార్థి మేనమామ అక్కడ నివసిస్తున్నాడని, అది భద్రత కల్పిస్తుందని భావించారు.
కన్సల్టెన్సీల్లోనూ ఆందోళన
భారతీయ విద్యార్థులపై ఆందోళనల నేపథ్యంలో కన్సల్టెన్సీలూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పించే రీతిలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కన్సల్టెన్సీలన్నీ కలిపి తొలిసారిగా విద్యార్థుల భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించాయి. ముందుగా విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆయా ప్రదేశాల సమాచారం అందుబాటులోకి తేవడంతోపాటు అవసరమైతే విద్యార్థులు, తల్లిదండ్రుల బృందాలు కూడా ఆయా వర్శిటీలను సందర్శించేందుకు, అక్కడి సీనియర్ విద్యార్థులతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment