విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం | Explanation of normal indian student fund his foreign education | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం

Published Mon, Aug 21 2023 4:47 AM | Last Updated on Mon, Aug 21 2023 7:18 AM

Explanation of normal indian student fund his foreign education - Sakshi

హైదరాబాద్‌కు చెందిన వర్ధన్‌కు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు పదో తరగతి చదువుతుంటే, మరొకరు ఐదో తరగతిలో ఉన్నారు. వీరిద్దరినీ అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం విదేశాలకు పంపాలన్నది అతడి లక్ష్యం. వర్ధన్‌ కేవలం ఆకాంక్షతోనే సరిపెట్టలేదు. తమ పిల్లలు మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన వారి భవిష్యత్‌ విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించారు. అది కూడా డాలర్‌తో కోల్పోతున్న రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించారు.

తన పెట్టుబడులను డాలర్‌ మారకంలో ఉండేలా చూసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత తన కుమారుడు గ్రాడ్యుయేషన్‌ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. వర్ధన్‌ ముందస్తు ప్రణాళిక వల్ల నిశి్చంతగా ఉన్నాడు. విదేశాల్లో కోర్సుల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు స్కూల్‌ ఆరంభంలో ఉన్నప్పటి నుంచే పెట్టుబడుల ప్రణాళికలు అమలు చేయాలి. ఈ విషయంలో వర్ధన్‌ అనుసరించిన మార్గం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. పిల్లలకు అత్యుత్తమ విదేశీ విద్యావకాశాలు ఇవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు, అందుకు కావాల్సిన వనరులను సమకూర్చుకునే మార్గాలను చర్చించేదే ఈ కథనం.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వెళుతోంది. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 85 దేశాల్లో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది కెనడాలో చదువుతున్నారు. ఆ తర్వాత అమెరికా, యూఏఈ, ఆ్రస్టేలియా, యూకే భారత విద్యార్థుల ముఖ్య ఎంపికలుగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏటేటా క్షీణిస్తూనే ఉండడాన్ని చూస్తున్నాం. గడిచిన 20 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే డాలర్‌తో రూపాయి ఏటా సగటున 3 శాతం విలువను నష్టపోతూ వచ్చింది.

2009లో డాలర్‌తో రూపాయి విలువ 46.5గా ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పిల్లల చదువు కోసం చెల్లించాల్సిన ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కూడా డాలర్‌ రూపంలో ఉంటుంటే.. మనం సంపాదించేది రూపాయిల్లో. అందుకుని పిల్లల విద్య కోసం పెట్టుబడులను డాలర్‌ మారకంలో చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. మొత్తంగా కాకపోయినా, పెట్టుబడుల్లో చెప్పుకోతగ్గ మేర డాలర్‌ మారకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఒకవైపు డాలర్‌తో రూపాయి మారకం క్షీణిస్తూ పోతుంటే, మరోవైపు ద్రవ్యోల్బణం సైతం కరెన్సీ విలువను కొంత హరిస్తుంటుంది. వీటిని తట్టుకుని పెట్టుబడులపై మెరుగైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్యం తేలికవుతుంది.

ఏమిటి మార్గం..?
విదేశీ విద్య కోసం డాలర్‌ మారకంలో పెట్టుబడులు మేలైన మార్గం అన్నది నిపుణుల సూచన. కానీ, ఒక ఇన్వెస్టర్‌గా తాను చేసే పెట్టుబడులను అర్థం చేసుకుని, వాటి పనితీరును ట్రాక్‌ చేసుకునే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే అంతర్జాతీయ పెట్టుబడులపై ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. దేశీయ అంశాలతో సంబంధం ఉండదు. అందుకని వాటిని విడిగా ట్రాక్‌ చేసుకోవాల్సిందే. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను ఎంపిక చేసుకునే ముందు చార్జీలను తప్పకుండా  చూడాలి. సరైన స్టాక్‌ను సరైన ధరల వద్ద కొనుగోలు చేసే నైపుణ్యాలు కూడా అవసరం’’ అని మహేశ్వరి తెలిపారు.

తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మేర విదేశీ స్టాక్స్‌ కోసం వైవిధ్యం కోణంలో కేటాయించుకోవచ్చు. పిల్లల విదేశీ విద్యకు ఎంత ఖర్చు అవుతుందో, ఆ అంచనాల మేరకు కేటాయింపులు చేసుకోవాలి. స్టాక్స్‌ ఎంపిక తెలియని వారు, ఈ రిస్క్‌ తీసుకోకుండా విదేశీ స్టాక్స్‌తో కూడిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యూఎస్‌ బ్లూచిప్‌ ఈక్విటీ ఫండ్‌ ఏడాది కాలంలో 17 శాతం వరకు రాబడులు ఇచ్చింది. డీఎస్‌పీ యూఎస్‌ ఫ్లెక్సిబుల్‌ ఈక్విటీ ఫండ్‌ 15 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. ఇలాంటి ఎన్నో ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. డాలర్‌ మారకంలో పెట్టుబడులకు అవసరమైతే ఆరి్థక సలహాదారులను సంప్రదించడానికి వెనుకాడొద్దు.

యూఎస్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌ దారి
నేరుగా స్టాక్స్‌  
► దేశీయ బ్రోకరేజీ, విదేశీ బ్రోకరేజీ సంస్థ లేదా ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.
► దేశీయ బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీ సంస్థలతో జట్టు కట్టి సేవలందిస్తున్నాయి.
► ఎన్‌ఎస్‌ఈ, ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా కొన్ని విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఉంది.

ఈటీఎఫ్‌లు
► ఆర్‌బీఐ పరిమితుల వల్ల కొన్ని ఈటీఎఫ్‌లు మినహా.. మిగిలిన ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి.
► కింగ్‌ ఎర్రర్, పెట్టుబడుల విధానంపై అవగాహన కలిగి ఉండాలి.
► ఈ పెట్టుబడులు ఆర్‌బీఐ లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ కిందకు వస్తాయి. ఏడాదిలో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

రూపాయి విలువ క్షీణత..
గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో డాలర్‌తో రూపాయి ఎంతో నష్టపోయింది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలోనే 50 శాతం విలువను కోల్పోయింది. ఈ క్షీణత ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరి తీసుకోవడంతో రూపాయి క్షీణతను ఇక ముందూ చూడనున్నాం. ఎందుకంటే యూఎస్‌ ఫెడ్‌ వైఖరితో డాలర్‌ సరఫరా తగ్గుతుంది.

అది వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుంది’’అని జేఎం ఫైనాన్షియల్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ ధనుంజయ్‌ సిన్హా వివరించారు. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ సైతం ఫారెక్స్‌ నిల్వలను ఉపయోగించుకుంటోంది. డాలర్‌ ఇదే మాదిరిగా గరిష్ట స్థాయిలో కొనసాగితే, అధిక ముడి చమురు ధరల కారణంగా భారత్‌తో వాణిజ్య లోటు ఎగువనే ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణగా ఉంది. ఇది రూపాయి విలువను మరింత కిందకు తోసేస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘స్వల్ప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 6–7 శాతం మేర క్షీణించొచ్చని భావిస్తున్నాం’’ అని ధనుంజయ్‌ సిన్హా చెప్పారు. 1947లో స్వాంతంత్య్రం సిద్ధించే నాటికి మన రూపాయి విలువ డాలర్‌ మారకంలో 4గా ఉంటే, ఇప్పుడు 83 స్థాయిలకు చేరుకోవడం గమనించొచ్చు.

ఫీజులపై రూపాయి ప్రభావం
‘విదేశాల్లో చదువుకు, ముఖ్యంగా అమెరికాలో.. ఎంతలేదన్నా అండర్‌ గ్రాడ్యుయేషన్‌కు 10 వేల నుంచి 50 వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. పీజీ చేసేందుకు 12,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకు (స్కాలర్‌షిప్‌ కలపకుండా) వ్యయం చేయాల్సి వస్తుంది. వీటికి తోడు నివసించే ప్రాంతం ఆధారంగా జీవన వ్యయాలకు అదనంగా ఖర్చు చేయాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోని విద్యా సంస్థలు ఇప్పటి వరకు ట్యూషన్‌ ఫీజుల పెంపులకు దూరంగా ఉన్నాయి.

ఇప్పుడు ఖర్చులు భారీగా పెరిగాయంటే అది కేవలం కరెన్సీ కారణంగానే’ అని విదేశీ! విద్యా కన్సల్టెన్సీ సంస్థ ఏపీఎస్‌ వరల్డ్‌ సీఈవో అనిర్బన్‌ సిర్కార్‌ తెలిపారు. ఏటా రూపాయి విలువ క్షీణిస్తుందని భావిస్తే.. దీనికి అనుగుణంగా విదేశీ కోర్సుల వ్యయం పెరుగుతూ వెళుతుంది. ‘‘విదేశీ విద్యా వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి ద్రవ్యోల్బణం ఒక్కటే కారణం కాదు. డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా కారణమే’’ అని యూఎస్‌లో పెట్టుబడులకు వీలు కలి్పంచే వేదిక వెస్టెడ్‌ ఫైనాన్స్‌ సీఈవో విరమ్‌షా చెప్పారు.
   
2012 జూలైలో రూపాయి విలువ డాలర్‌తో 55గా ఉంది. అప్పుడు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్స్‌ ట్యూషన్‌ ఫీజు ఏడాదికి 20,000 డాలర్లు ఉందని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55 ప్రకారం ఒక ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు కోసం చెల్లించాల్సి వచ్చేది. అదే ఫీజు ఇప్పుటికీ పెరగకుండా అక్కడే ఉన్నా కానీ, రూపాయి విలువ క్షీణత ఫలితంగా కోర్సు వ్యయం రూ.16.60 లక్షలకు పెరిగినట్టు అవుతుంది. అంటే రూ.5 లక్షలకు పైగా పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా కలిపిచూస్తే ఈ భారం ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకని పిల్లల విదేశీ విద్య కోసం పొదుపు చేసే వారు కేవలం ద్రవ్యోల్బణం ఒక్కటే కాకుండా, రూపాయి క్షీణతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

అంతర్జాతీయ పెట్టుబడుల మార్గం
విదేశీ విద్య కోసం చేసే పెట్టుబడులను అంతర్జాతీయ మార్కెట్లకు కేటాయించుకోవడం అర్థవంతంగా ఉంటుంది. జపాన్, బ్రిటన్, యూఎస్‌ తదితర దేశాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పెట్టుబడులకు వైవిధ్యం కూడా తోడవుతుంది. భారత ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది అమెరికన్‌ మార్కెట్లలోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికైతే డాలర్‌ ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న విశ్లేషణ వినిపిస్తోంది.

యూఎస్‌ పెట్టుబడులు కరెన్సీ విలువ పతనానికి హెడ్జింగ్‌గానే కాకుండా పెట్టుబడుల్లో వైవిధ్యానికీ వీలు కలి్పస్తాయన్నది నిపుణుల సూచన. ‘‘విదేశీ విద్య కోసం, డాలర్‌ మారకంలో లక్ష్యాల కోసం యూఎస్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానం అవుతుంది. దీనివల్ల గమ్యస్థానంలో (చదువుకునే) ద్రవ్యోల్బణానికి తోడు, రూపాయి విలువ క్షీణతకు హెడ్జింగ్‌గా పనిచేస్తుంది. చాలా దేశాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉన్నత విద్య ద్రవ్యోల్బణం ఎక్కువే ఉంటుంది’’ అని ఫింజ్‌ స్కాలర్జ్‌ వెల్త్‌ మేనేజర్‌ సీఈవో రేణు మహేశ్వరి సూచించారు. డాలర్‌తో ఇన్వెస్ట్‌ చేసినప్పుడు, తిరిగి డాలర్‌తో ఉపసంహరించుకునేట్టుగా ఉంటే, అది అధిక
ప్రయోజనాన్నిస్తుంది.   
   
ఉదాహరణకు 2012లో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో, ఎస్‌అండ్‌పీ 500లో 100 డాలర్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55గా ఉంది. అప్పటి నుంచి ఈ రెండు సూచీలు ఏటా 13 శాతం రాబడులు ఇచ్చాయి. దీంతో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో 100 డాలర్ల పెట్టుబడి నేడు రూ.18,000 అవుతుంది. ఎస్‌అండ్‌పీ 500 ఈటీఎఫ్‌లో పెట్టుబడి రూ.25,000 అయి ఉండేది. 40 శాతం అధికంగా ఎస్‌అండ్‌పీ 500 ఈటీఎఫ్‌లో రాబడులు వచ్చాయి. రెండు సూచీలు ఒకే విధమైన రాబడిని ఇచి్చనా.. రెండు దేశాల కరెన్సీ విలువల్లో మార్పుల ఫలితంగా ఎస్‌అండ్‌పీ 500లో అధిక రాబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్లే ఇలా జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement