న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ 2021 అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ సొల్యూషన్స్ మెరుగుపరిచింది.ఈ ఏడాది సగటున దేశీయ కరెన్సీ విలువ 75.50గా ఉంటుందని అంచనావేస్తోంది. ఇంతక్రితం అంచనా 77 కావడం గమనార్హం. 2022కు సంబంధించి కూడా అంచనాలను 79 నుంచి 77కు మెరుగుపరచింది. ప్రస్తుత స్థాయిల నుంచి సమీప భవిష్యత్తులో స్వల్పంగా మాత్రమే రూపాయి బలహీనపడుతుందని ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి సోమవారం 9 పైసలు లాభపడి 73.02 వద్ద ముగిసింది.
డాలర్ బలహీనత, ఫారెక్స్ పటిష్టత
ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ (ప్రస్తుతం 89.88. 52 వారాల గరిష్టం 103.96) బలహీన ధోరణి, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు ప్రస్తుతం రూపాయిని పటిష్టంగా కొనసాగిస్తున్నాయి. ‘‘డిసెంబర్ 2020 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వల విలువ 578 బిలియన్ డాలర్లు. ఇది 19 నెలల దిగుమతులకు సరిపోతాయి. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి దోహదపడే అంశాల్లో ఇది ఒకటి. 2021లో ఎదురయ్యే ‘ఇంపోర్టెర్డ్ ఇన్‌ఫ్లెషన్’’ సవాలును ఇది భర్తీ చేస్తుంది. తద్వారా 2021లో భారత్ రికవరీ బాటను సంరక్షిస్తుంది’’ అని కూడా ఫిచ్ నివేదిక వివరించింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ).
బ్రెంట్, రెపో, ద్రవ్యోల్బణంపై ఇలా...
► 2020లో రూపాయి సగటు 74.10. కాగా 2020లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ సగటు 43.18 డాలర్లయితే, 2021లో 53 డాలర్లని ఫిచ్ అంచనావేస్తోంది.
► ఇక బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 4 శాతం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని కూడా అంచనావేసింది.
► 2022–23 (ఏప్రిల్ 2022–మార్చి 2023) ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఫిచ్ లెక్కించింది. ఆహార, ఇంధన ధరలు ద్రవ్యోల్బణంపై కొంత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది.
కొనసాగుతున్న రికవరీ: నోమురా ఇండెక్స్
భారత్ ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత జనవరి 3వ తేదీతో ముగిసిన వారంలో చురుగ్గానే ఉందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా ఇండియా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ (ఎన్‌ఐబీఆర్‌ఐ) పేర్కొంది. డిసెంబర్‌లో సూచీ సగటు 91.7 అయితే, జనవరితో ముగిసిన వారంలో ఇది మరింత పెరిగి 94.5కు ఎగసింది. నవంబర్‌లో ఈ సూచీ 86.3 వద్ద ఉంది.
2021లో రూపాయి సగటు...75.50!
Published Tue, Jan 5 2021 6:04 AM | Last Updated on Tue, Jan 5 2021 6:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment