ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు.
దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్‌లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.
దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి.
‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.
క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం
ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్‌టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్‌బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.
ప్రపంచ పరిణామాలు
ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ
ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది.
మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి
భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్‌ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్‌ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
Published Mon, Oct 24 2022 6:11 AM | Last Updated on Mon, Oct 24 2022 6:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment