‘అమెరికాలో ఉన్నత విద్యపై హైదరాబాద్ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి’
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి హైదరాబాద్ విద్యార్థుల్లో ఏటేటా పెరుగు తోందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మైకేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలోని పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూ ట్‌లలో 97 వేల మంది భారత విద్యార్థులున్నారని చెప్పారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ఫాల్ సెషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో మైకేల్ ముల్లిన్స్ మాట్లాడారు. ఔత్సాహిక విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
యునెటైడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ తనుష్క బాలి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రాంగణంలో యుఎస్‌ఐఈఎఫ్ కేంద్రం నెలకొల్పామని.. విద్యార్థులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్యలో ఈ సెంటర్‌కు వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు ఒక రోజు ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800 103 1231 ద్వారా కూడా సంప్రదించవచ్చని చెప్పారు. www.usief.org.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
సిల్వర్ ఓక్స్ స్కూల్‌లో డిజైన్ ఫెస్టివల్
సృజనాత్మకత, వైవిధ్యమైన ఆలోచనలే ప్రపంచాన్ని నడిపిస్తాయని అంటున్నారీ చిన్నారులు. నైపుణ్యాలను పెంచుకుంటే ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తు న్నారు. చిట్టిబుర్రలకు పదునుపెట్టేలా నిర్వహించిన ప్రోగ్రామ్‌కు హైదరాబాద్‌లోని సిల్వర్‌ఓక్స్ పాఠశాల వేదికైంది. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ‘చిల్డ్రన్ డిజైన్ ఫెస్టివల్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్, డిజైన్, ఆటోమొబైల్, ఫిల్మ్‌మేకింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ, శిల్పకళ తదితర అంశాల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలను పెంపొందించుకునేందుకు అనువైన వాతావరణం కల్పించారు.