సాక్షి, అమరావతి: దేశంలో అనాధ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన సూపర్ న్యూమరరీ సీట్లతో ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది? ఎన్ని విద్యా సంస్థల్లో వారికి సీట్లు ఇచ్చారో తెలపాలని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వాటికి లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన నోటీసును తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
కోవిడ్‌తో 2020, 2021ల్లో అనేక మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో పిల్లలు అనాధలుగా మారారు. వీరిలో కొంతమంది పాఠశాల చదువుల్లో ఉండగా మరికొంతమంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరు తదుపరి ఉన్నత తరగతుల్లో చేరేందుకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్’ కింద అన్ని విద్యాసంస్థల్లోనూ సూపర్ న్యూమరరీ సీట్లు ప్రవేశపెట్టాలని గతేడాది మార్చిలో సూచించింది.
ఈ మేరకు అన్ని విద్యాసంస్థలూ సూపర్ న్యూమరరీ సీట్లను అనాధ విద్యార్థులకు కేటాయించేలా చేసింది. ఇప్పుడు విద్యా సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో సూపర్ న్యూమరరీ సీట్లతో లబ్ధి పొందిన వారి సమాచారాన్ని తెలియచేయాలని యూజీసీ ఆయా విద్యాసంస్థలకు సూచించింది. విద్యార్థుల సంఖ్యతో పాటు వారు ఏయే కోర్సులు అభ్యసిస్తున్నారు? వారు ఎలాంటి సహాయం పొందుతున్నారు? వంటి అంశాలను కూడా అందించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment