సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఏపీ మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్.సిరి తెలిపారు. పీఎం కేర్స్‌లో కేంద్రం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) ఇస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల సంక్షేమం, సహాయం విషయమై సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోను ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఎం కేర్స్‌కు అర్హులైన పిల్లలను ఆదుకునేలా ప్రధాని నరేంద్రమోదీ పలు సూచనలు చేశారని సిరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ బాధిత పిల్లలకు 23 సంవత్సరాల వయసు వచ్చేవరకు వారి సంరక్షణ, ప్రయోజనాలు కాపాడటం జరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ఎక్స్‌గ్రేషియా అందుతుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 351 మంది పిల్లలను అర్హులుగా ఎంపిక చేసినట్టు తెలిపారు.
వారిలో ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో 56 మంది, తూర్పుగోదావరి 45, అనంతపురం 40, విశాఖపట్నంలో 39, కృష్ణా 28, వైఎస్సార్ 25, గుంటూరు 24, నెల్లూరు 24, చిత్తూరు 21, కర్నూలు 16, ప్రకాశం 16, శ్రీకాకుళం 9, విజయనగరం జిల్లాలో 8 మంది అర్హులు ఉన్నారని వివరించారు. పీఎం కేర్స్‌లో ఆర్థిక సహాయంతోపాటు పిల్లల ఉన్నతవిద్యకు ఏడాదికి రూ.50 వేలు స్కాలర్‌షిప్ ఇస్తారని తెలిపారు. పాఠశాల విద్య కోసం కేజీబీవీ, సైనిక పాఠశాలలు, నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు.
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద 12వ తరగతి వరకు పాఠశాలకు వెళ్లే పిల్లలకు సంవత్సరానికి రూ.20 వేల ప్రత్యేక స్కాలర్‌షిప్‌ను సామాజిక న్యాయం, సాధికారత శాఖ నుంచి ఇస్తారని తెలిపారు. కోవిడ్ అనాథ పిల్లలకు ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జాయ్)లో ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుందని తెలిపారు. వారిలో 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల పిల్లలకు స్టైఫండ్ ఇస్తారని తెలిపారు.
ప్రభుత్వం డిపాజిట్ చేసిన రూ.10 లక్షల మొత్తాన్ని పిల్లలు 23 సంవత్సరాల వయసు నిండాకే అందుకుంటారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సందేహాలు, ఫిర్యాదులు ఉంటే వెబ్‌సైట్: https://pmcaresforchildren. in/.లో తెలపాలని సూచించారు. వాటిని జిల్లా మేజిస్ట్రేట్ స్థాయిలో పరిష్కరిస్తారని తెలిపారు. 15 రోజుల కంటే ఎక్కువకాలం పెండింగ్‌లో ఉంటే ఉన్నతస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు.
కోవిడ్ అనాథ పిల్లలను ఆదుకుంటున్నఏపీ ప్రభుత్వం
Published Tue, May 31 2022 5:10 AM | Last Updated on Tue, May 31 2022 1:22 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment