శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన 9మంది పిల్లలకు కేంద్రం ప్రభుత్వం పీఎం కేర్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేసింది. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ఆధ్వర్యంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికార అధికారి అనంతలక్ష్మి, జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణలకు వీరి పాసు పుస్తకాలు హెల్త్ ఇన్సూ్యరెన్స్ కార్డులు అందజేశారు. పిల్లలకు 23 ఏళ్లు వచ్చాక వారి అవసరాలకు వినియోగించుకునే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. వీరికి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి 18 ఏళ్ల నిండాక వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది.
మరో ఘటనలో..
వేసవిలో జాగ్రత్తలు అవసరం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వేసవి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోడప్రతికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికట్టవచ్చన్నారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి (104.9డిగ్రీలు) మెదడుపై ప్రభావం చూపుతుందని తద్వారా వడదెబ్బకు గురవుతారన్నారు.
చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి వంటి లక్షణాలు కనిపించినట్లయితే సమీపంలోని వైద్యులను సంప్రదించి ప్రాథమిక చికిత్స పొందాలని సూచించారు. గొడుగు వాడడం, తెలుపు రంగు లేదా పలుచటి చేనేత వస్త్రాలు ధరించడం, తలకు టోపీ ధరించడం లేదా రుమాలు వాడడం మంచిదన్నారు. ఎండగా ఉండే సమయాల్లో ఆ రుబయట శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండడం మేలన్నారు. ఇంటి నుంచి బయటకెళ్లే ముందు ఒక గ్లాసు మంచినీరు తాగడం ఉత్తమమన్నారు.
మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.విజయసునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా వైద్యారోగ్య అధికారి అనూరాధ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ డోల తిరుమలరావు, జిల్లా సరఫరాల అధికారి డి.వి.రమణ, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు పి.రత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment