
‘వృత్తి నైపుణ్యానికి వ్యక్తిత్వ వికాసం’ పేరుతో గతంలో అనేక మండలాల్లో అధ్యాపకులకు (ప్రాథమిక, ఉన్నత పాఠశాలల) రిసోర్స్ పర్సన్‌గా వేసవి శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండటంతో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మండల అభివృద్ధి అధికారి... అక్కడి విద్యాశాఖాధికారి సలహా మేర అప్పటి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఈ వ్యాస రచయితకు కల్పించారు. ఆ శిక్షణా తరగతుల్లో దాదాపు వెయ్యి మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
అప్పుడా సందర్భంగా వారితో ప్రసంగ సంభాషణల్లో ప్రస్తావించిన అనేక అంశాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవరూపం దాల్చటం, అటు లబ్ధిదారులు, ఇటు వాలంటీర్ల నోటిద్వారా వింటూ, చూస్తూ ఉంటే ఎంతో ఆనందం సంతృప్తి కలుగుతోంది. అప్పటి ఆరంభ దశలోని మహోన్నత ఆశయాలు, ఆదర్శాలు ఈ అనతి కాలంలోనే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆచరణ రూపం దాల్చాయి.
తమ దైనందిన సమస్యల నుండి వాలంటీర్ల సేవ ద్వారా విముక్తులు అయినవారు వాలంటీర్లను ప్రశంసించడం ఎంతైనా ముదావహం. అందునా కోవిడ్–19 లాంటి విపత్కర సమయాలలో ఆ యా వాలంటీర్ల అనుపమాన సేవలు సమాజానికి ఎంత అవసరం ఉందో వీటి పట్ల అవగాహన ఉన్న అందరికీ తెలియ వచ్చింది.
అప్పటి వారికి ఉద్బోధించిన వాటిలో ముఖ్యమైనవాటిలో కొన్ని... ఈ నూతన వ్యవస్థ ద్వారా వారు తమకు కేటాయించిన యాభై కుటుంబాలలో అంతర్భాగమై, ఆయా కుటుంబ సభ్యుల వయసు/ వృత్తి/ స్వభావం లాంటి వాటితో నిమిత్తం లేకుండా వారితో ఎంతగా మమేకం అవ్వాలనేదీ; అది వారి వృత్తినీ, వ్యక్తిత్వాన్నీ ఎంతగా పరిపూర్ణం చేసేదీ చెప్పాను.
ఈ ఆత్మీయతా భావం వారికి పుట్టుకతో ఏర్పడే బంధుత్వాలకన్నా వయసు రీత్యా ఏర్పడే అతి కొద్దిమంది స్నేహితులు కన్నా మించి లభించిన అరుదైన అపురూప అవకాశముగా భావించాల్సిందిగా ప్రస్ఫుటం చేశాను. వారి పట్ల ప్రేమతో చేసే సేవ అన్నిటికన్నా మహోన్నతమైనదిగా వివరించాను.
తమ విద్యుక్త ధర్మం సక్రమంగా నెరవేర్చడానికీ, సేవా నిరతిని దృఢ సంకల్పంతో ప్రదర్శించటానికీ, ప్రకటించడానికీ అవసరమైన శారీరక మానసిక ఆరోగ్యం ఎంతటి అత్యవసరమో, అలాగే బాధ్యత విషయంలో భావప్రకటనా సామర్థ్యం, సంబంధిత అంశాల/పథకాల పట్ల విషయ పరిజ్ఞానం, కాల వినియోగం పట్ల చక్కటి ప్రణాళిక –ఆచరణ, అందరితో ఎల్లప్పుడూ సత్సంబంధాలూ, అలాగే ఏ విధంగా ప్రభుత్వ పథకాలన్నీ నిజమైన అర్హులకు చేర్చాల్సినదీ, అందుకు కావాల్సిన ఓర్పు, సహనం, కారుణ్యం లాంటి మానవీయ లక్షణాలు ఎంత ముఖ్యమో వివరించాను.
కుల, మత రాజకీయాలకు అతీతంగా, కోట్లాది మంది తమ గడప దగ్గరే తమకు కావలసినవి తగిన సమయంలో తగిన రీతిలో ఇప్పటిలాగే నిరంతరం పొందాలంటే ఈ వ్యవస్థ ఉండాల్సిందే. అందరూ కోరుకునేది ఇదే.
వ్యవస్థలో లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా సరిదిద్దవలసిందే. అలాకాక మొత్తంగా వాలంటీర్లను కాదనటం అంటే వారి సేవల వల్ల కలిగే ప్రయోజనాలను కాదని అనడమే. ఏమాత్రం వివేకం, విజ్ఞత ఉన్న మనుషులు చేయదగిన పని ఇది కాదు.
ప్రొ‘‘ బి. లలితానంద ప్రసాద్
వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ‘ 9247499715 ‘
Comments
Please login to add a commentAdd a comment