
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఇంటి వద్దే ప్రభుత్వ పథకాలు, సేవలను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించడం, 2.62 లక్షల మందికి గ్రామస్థాయిలో సేవ చేసే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. దీనిపై తక్షణం అధ్యయనం నిర్వహించి నివేదిక సమరి్పంచాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
సీఎం శివరాజ్‌సింగ్ ఆదేశాల మేరకు ఆయన ఓఎస్డీ లోకేష్ నవరత్నాలు, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ గురించి ‘సాక్షి’ ప్రతినిధి నుంచి వివరాలను సేకరించారు. మరి కొద్ది నెలల్లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి భోపాల్‌లోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం శివరాజ్‌సింగ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీలో అమలవుతున్న పలు పథకాల గురించి ఆరా తీశారు. ఆ వివరాలివీ..
► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 500కిపైగా సేవలందించడం, ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరు చొప్పున నియమించడం వినూత్నం, అభినందనీయం. యువతకు స్థానికంగా తోటివారికి సేవలందించే అవకాశం లభిస్తుంది.
► ఎలాంటి పడిగాపులు లేకుండా ఇంటివద్దే రేషన్ సరుకులు అందించడం కూడా బాగుంది.
► ప్రజాస్వామ్యంలో అందరినీ స్వాగతిస్తాం. బీఆర్‌ఎస్ పార్టీ మరింత జోరుగా మా రాష్ట్రానికి రావచ్చు. అయినా తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి దేశం మొత్తానికి తెలుసు.