వలంటీర్ రజితకు సేవామిత్ర పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
పేరుకు వాళ్లంతా వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు పార్టీలు, వేర్వేరు మీడియా సంస్థలైనా అంతా ఒక గజదొంగల ముఠా. నీతి లేదు. నియమం లేదు. న్యాయం, ధర్మం అంతకన్నా లేదు. ప్రజలంటే ప్రేమ లేదు. అధికారం మినహా వేరే అజెండా లేనేలేదు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామో గమనించాలని ప్రజలను సవినయంగా వేడుకుంటున్నా.
–సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సేవాభావంతో పనిచేస్తున్న వలంటీర్ల ద్వారా దేశమంతా మనవైపు చూసేలా ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎండైనా, వానైనా, చలైనా, సెలవైనా వెన్ను చూపని మహా సైన్యమని వలంటీర్ వ్యవస్థను అభినందించారు. ‘తమకు ఎంత వస్తుంది? ఏం ఉపయోగం? అని అంతా లెక్కలు వేసుకుంటున్న ప్రస్తుత సమాజంలో పేదల కళ్లల్లో సంతోషం, సంతృప్తే ఆశీస్సులుగా భావించి గుండెల నిండా మానవతావాదంతో సేవ చేస్తున్న నా వలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్లు.. 2.60 లక్షల మంది మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం వలంటీర్ల సత్కార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు.
రూపాన్ని మార్చుకుని మోసగించే రాక్షసుడు మారీచుడి మాదిరిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు.. ఏ పార్టీతో కావాలనుకుంటే ఆ పార్టీతో జత కడతారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కానుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే తమ బాక్సులు బద్దలవుతాయని గ్రహించి దుష్ప్రచారానికి తెగించారని మండిపడ్డారు. ‘ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తిడతారు.. బురద వేస్తారు... విడిపోతారు.. ఎలాగూ అమలు చేయరు కాబట్టి ఏ వాగ్దానం కావాలంటే అది ఇచ్చేస్తారు. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. ఆ తర్వాత పండుగకు చుట్టం వచ్చినట్టు రాష్ట్రంలో అప్పుడప్పుడు కనిపిస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మంచిదనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారు. లేదనుకుంటే ఏకమైపోతారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి అదే నిజమని నమ్మించే మారీచులతో యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. సీఎం ప్రసంగం వివరాలివీ..
వలంటీర్ల పురస్కారాలకు సంబంధించిన చెక్కును విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్
55 శాతం నా చెల్లెమ్మలే..
వలంటీర్లకు అందిస్తున్న చిరు సత్కారం ఈరోజు నుంచి మొదలై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇరవై రోజులపాటు జరుగుతుంది. వలంటీర్లు అంటే అర్థం స్వచ్ఛంద సేవకులు. వారు చేస్తున్నది ఉద్యోగం కాదు గొప్పసేవ. అలాంటి ఒక గొప్ప వ్యవస్థ్ధ రాష్ట్రంలో ఏర్పాటైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది పని చేస్తున్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా సోషల్ ఆడిట్ నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ వలంటీర్ల ద్వారా పథకాలను అందజేస్తున్నాం. సూర్యోదయానికి ముందే తలుపుతట్టి ప్రతి నెలా ఒకటో తేదీనే 61 లక్షల మందికి ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు మన వలంటీర్లు. వలంటీర్లను వరుసగా రెండో ఏడాది సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు, నగదు బహుమతి, బ్యాడ్జి, సర్టిఫికెట్లతో సత్కరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.33 లక్షల మందికి రూ.239 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేస్తు్తన్నాం. రెండేళ్లలో రూ.465 కోట్ల నగదు పురస్కారాన్ని అందించిన ప్రభుత్వం మనది. వలంటీర్ల వ్యవస్థలో 55 శాతం నా చెల్లెమ్మలే ఉన్నారని తెలియజేస్తున్నా.
దేశమంతా అభినందిస్తోంది..
సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎవరికి, ఎప్పుడు ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి తెలియజేస్తున్న కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. లబ్ధిదారులతో దగ్గరుండి దరఖాస్తు చేయిస్తున్న పరిస్థితిని కూడా మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. విప్లవాత్మక మార్పుతో మనం చేస్తున్న సేవలను దేశమంతా అభినందిస్తోంది. మీ సేవలకు రాష్ట్రం గర్విస్తోందని ప్రతి వలంటీర్ చెల్లెమ్మకు, తమ్ముడికి తెలియజేస్తున్నా.
పెన్షన్‌గా ఇచ్చిన సొమ్మే రూ.50,508 కోట్లు
2019 జూన్ నుంచి 2022 మార్చి వరకు వలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్ల ద్వారా పింఛన్ల కింద పంపిణీ చేసిన సొమ్ము రూ.50,508 కోట్లు. ఇది ఊహలకందని పాలన. రూ.1.34 లక్షల కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారులకు పలు పథకాల కింద అందజేశాం. ఈ ఏడాది మరో రూ.55 వేల కోట్లను డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తాం. 95% హామీలను అమలు చేశాం. గతానికీ, ఇప్పటికీ పాలనలో ఉన్న మార్పు గురించి ఆలోచన చేయమని కోరుతున్నా.
33 పథకాలు పారదర్శకంగా..
వైఎస్సార్ పెన్షన్ కానుక మొదలు బియ్యం కార్డులు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మఒడి, ఆరోగ్య ఆసరా, ఇళ్ల çస్థ్ధలాల పట్టాలు, జగనన్న తోడు, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ కంటివెలుగు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్సార్ మత్స్యకార భరోసా, జలకళ, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం.. ఇలా 33 పథకాలు ప్రతి ఇంటికీ వివక్షకు తావులేకుండా అర్హులందరికీ అందజేస్తున్నాం. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నారు. ఇంతకన్నా గొప్ప పాలన, గొప్ప పరిస్థితులను గతంలో మనం ఎప్పుడైనా చూశామా? అని ఒక్కసారి గుండెలపై చేయి వేసుకుని ఆలోచన చేయమని కోరుతున్నా. మంచి జరిగిందంటే జగన్‌ను ఆశీర్వదించండి.. చెడు జరిగిందంటే ద్వేషించండి.
కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కనీవినీ ఎరుగని విధంగా మేలు చేయగలిగాం. నవరత్నాల పాలన ఇలాగే కొనసాగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ, ఏడుపు ఈరోజు ఎల్లో పార్టీ, వాటికి అనుబంధంగా ఉన్న పార్టీలు, ఎల్లో మీడియాలో కనిపిస్తోంది. మంచి చేసే వాడిమీదే రాళ్లు పడతాయన్నట్టుగా.. పళ్లు కాసే చెట్టుపైకే రాళ్లు వేస్తారన్నట్టుగా... ఈరోజు వీళ్లంతా కలిసికట్టుగా కుయుక్తులు పన్నుతూ బురద జల్లుతున్నారు.
వలంటీర్లకు సెల్యూట్ చేస్తున్న సీఎం జగన్
‘పేట’కు ఫ్లైఓవర్
వెటర్నరీ పాలిటెక్నిక్, ఆటోనగర్ కూడా..
స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ మంజూరు చేస్తున్నట్లు సభలో సీఎం జగన్ ప్రకటించారు. వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ, ఆటోనగర్ కూడా మంజూరు చేస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటన చేశారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, కోన రఘుపతి, కలెక్టర్ లోతేటి శివశంకర్, అజయ్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment