‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్. చిత్రంలో మంత్రి అమర్‌నాథ్, అధికారులు
అర్హత ఉండి కూడా ఏ కారణం చేతైనా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందకపోయినా, న్యాయం మీ వైపున ఉన్నా న్యాయం జరగని పక్షంలో, ఇప్పటికే ప్రయత్నించినా సత్ఫలితాన్ని ఇవ్వని పరిస్థితుల్లో ఇక నేరుగా మీ జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నంబరు 1902కి ఫోన్ కొట్టండి. నేరుగా నా కార్యాలయానికే (సీఎంవో) ఫోన్ వస్తుంది. సమస్యలకు ఈ స్థాయిలో పరిష్కారం చూపే దిశగా గొప్ప ఆలోచనతో అడుగులు వేస్తున్నాం.
మీ సమస్యను నా సమస్యగానే భావించి ట్రాక్ చేస్తాం. నేరుగా సీఎంవో దీన్ని ట్రాక్ చేస్తుంది. ఫిర్యాదు పరిష్కారంపై ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, సందేశాలు వస్తాయి. మీ సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో మీరు నేరుగా వెబ్‌సైట్లో కూడా చూడవచ్చు.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన
పరిష్కారాలను చూపాలనే తపనతో ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా తానున్నది అధికారాన్ని చలాయించడానికి కాదని, తన దగ్గర నుంచి సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల వరకు అంతా ప్రజా సేవకులమేనని స్పష్టం చేశారు. జగనన్నకు చెబుదాం 1902 టోల్‌ఫ్రీ నంబర్, వెబ్‌సైట్‌ను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, జిల్లా కేంద్రాల నుంచి అధికారులు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా కలసికట్టుగా ఒక్కటై ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలనే తపనతో పనిచేద్దామని ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి సీఎం పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ..
ధర్మబద్ధంగా పరిపాలిస్తే..
జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా వాటి కంటే భిన్నం. 3,648 కి.మీ సాగిన నా సుదీర్ఘ పాదయాత్రలో కనిపించిన సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే దిశగా అడుగులు వేస్తూ నాలుగేళ్లుగా పాలన ముందుకు సాగుతోంది. చాలావరకు ఉత్పన్నమయ్యే సమస్యలన్నీ మానవ తప్పిదాలే అని పాదయాత్రలో అర్థమైంది. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందిస్తే, న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుంది. 90 – 95 శాతం సమస్యలకు పరిష్కారాలను చూపవచ్చని పాదయాత్రలో గుర్తించా.
నాడు.. అడుగడుగునా లంచాలే
నా పాదయాత్రలో గ్రామాల్లోకి వెళ్లినప్పుడు పింఛన్లు రాలేదంటూ చాలా మంది వృద్ధులు వచ్చేవారు. పెన్షన్లు రాలేదని గోడు వెళ్లబోసుకుంటుంటే చాలా బాధ అనిపించేది. ఆ ప్రభుత్వం తీరు పట్ల ఆశ్చర్యం కలిగేది. పెన్షన్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా మలి వయసులో అవస్థలు పడుతున్న దుస్థితి. జన్మభూమి కమిటీలు కనికరిస్తేగానీ పింఛన్లు రాని దయనీయ పరిస్థితి. మొదట మీరు ఏ పార్టీకి సంబంధించిన వారని జన్మభూమి కమిటీ నాయకులు ప్రశ్నిస్తారు.
ఆ తరువాత ప్రతి పనికీ నాకెంత ఇస్తావు? అని లంచాలు అడిగే గుణం వారిది. పెన్షన్ల దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపుల వరకూ ఇదే పరిస్థితి ఉండేది. ప్రభుత్వ పథకం ఏది తీసుకున్నా ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలే కనిపించేవి. ఊర్లో కొంత మందికి మాత్రమే ఇస్తామని చెప్పేవారు. ఎవరైనా చనిపోతే గానీ కొత్తవారికి అందని దయనీయ పరిస్థితులను నా పాదయాత్రలో చూశా.
నాలుగేళ్లుగా సంతృప్త స్థాయిలో
ఏ వ్యవస్ధలోనైనా అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చడం, ఏ పార్టీ అనే వివక్ష లేకుండా ఇవ్వడం, లంచాలకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందించడం గొప్ప మార్పులు తెచ్చేందుకు దోహదం చేస్తాయి. సంతృప్త స్థాయిలో గ్రామ స్థాయిలో అర్హులందరికీ మేలు చేస్తే దాదాపు 90 – 95 శాతం సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని భావించి సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చాం.
లంచాలు, వివక్షకు తావు లేని ఒక గొప్ప వ్యవస్ధని గ్రామ స్థాయిలో తీసుకొచ్చాం. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి యాభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను కేటాయించి ఎవరికి ఏ సమస్య వచ్చినా చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఇవాళ ఉంది. లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం.
ప్రజలకు మరింత చేరువగా పాలన
ఈ వ్యవస్థలే కాకుండా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం, అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు.. ఇలా ఏది తీసుకున్నా గ్రామ స్థాయిలో మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. పాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ వారికి మరింత చేరువయ్యేలా ఈ నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి.
ఆ బాధ తెలిసిన ప్రభుత్వమిది
లంచాలు, వివక్షకు చోటులేని వ్యవస్థ కోసం దేశంలో ఎక్కడా చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. అందులో భాగంగా ఇప్పటికే ‘స్పందన’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. సమస్యల పరిష్కారంలో గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. దీనికోసం ఒక యంత్రాంగాన్ని తెచ్చాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా అందాల్సిన ఏ సేవ అయినా ఎక్కడైనా అందకుంటే బాధ్యతగా అందించేలా, జాప్యం జరగకుండా నివారించగలిగాం.
న్యాయం, ధర్మం మన పక్షాన ఉన్నా కూడా తమకు రావాల్సింది రాకపోతే ఎలాంటి బాధ అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేశాం. సమస్యలకు పరిష్కారాలను చూపేలా స్పందన ద్వారా అడుగులు వేశాం. స్పందన మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం అనే ఆలోచనతో దీన్ని చేపట్టాం.
గట్టి ప్రయత్నం చేసినా ఫలించకుంటే..
మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు, కలెక్టర్ల దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల దాకా, అక్కడ నుంచి గ్రామ సచివాలయాల వరకు అన్ని స్థాయిల్లో అందరినీ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నాం. అర్జీదారుడికి సంతోషాన్ని కలిగించేలా, చిరునవ్వు కనిపించాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాం. నాణ్యతగా సమస్యల పరిష్కారానికి వేదిక ఇది.
ఏదైనా సమస్య ఉన్నప్పుడు సచివాలయం సహా అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారా గట్టి ప్రయత్నం చేయండి. ఆ తరువాత కూడా అర్హత ఉన్నా న్యాయం జరగని పరిస్థితి ఉంటే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ఉపయోగపడుతుంది. నేరుగా జగనన్నకే చెబుదాం అన్నది ఈ కార్యక్రమం సారాంశం.
మీ బిడ్డకే ఫోన్ కొట్టండి
అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందకపోవడం, వైఎస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు, సామాజిక పథకాలు, భూమి రికార్డులు ఇలా ఎలాంటి సమస్యలైనా మీ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు రాని పక్షంలో నేరుగా మీ జగన్‌కు, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ బిడ్డకే ఫోన్ కొట్టండి. 1902కు ఫోన్ కొడితే నేరుగా నా కార్యాలయానికే (సీఎంవో) ఫోన్ వస్తుంది.
ఫిర్యాదులను గౌరవిస్తూ ‘వైఎస్సార్ ఐడీ నంబర్’
మీరు ప్రయత్నం చేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయి. ఫోన్ చేశాక మీకు యునిక్ ఐడీ నంబరు వస్తుంది. యువర్ సర్వీస్ రిఫరెన్స్ (వైఎస్సార్) ఐడీ నెంబరు అని పేరుపెట్టాం. మీ ఫిర్యాదుకు అంత గౌరవం ఇస్తూ వైఎస్సార్ పేరు పెట్టాం.
సీఎంవో, సీఎస్, డీజీపీ పర్యవేక్షణ
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు మండల కేంద్రం, జిల్లా కేంద్రం, రాష్ట్ర సచివాలయం, సీఎంవోలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు పెట్టాం. సీఎంవో, సీఎస్, డీజీపీ దీన్ని సమర్థంగా నిర్వహించేలా బాధ్యతలు అప్పగించాం. మానిటరింగ్ యూనిట్లలో ప్రతి చోటా మీ సమస్య పరిష్కారాన్ని పర్యవేక్షిస్తారు.
స్పెషల్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో మమేకమై జగనన్నకు చెబుదాం కార్యక్రమం సమర్థంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తారు. మీకు ఉత్తమ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటారు. మీ సమస్య పరిష్కారం అయ్యాక ఫోన్ చేసి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇవన్నీ జరుగుతాయి.
ఎదిగేకొద్దీ పెద్ద సేవకులే..
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నా దగ్గర నుంచి ప్రారంభిస్తే అంతా ప్రజలకు దగ్గరై సేవలు అందించడానికే ఉన్నాం. ప్రతి అధికారి పెద్ద స్థాయిలోకి వెళ్లేకొద్దీ మరింత పెద్ద సేవకుడు అవుతాడు. మీకు మరింత మంచి చేయాలనే తపనతో అడుగులు వేస్తున్న మీ ప్రభుత్వం ఇది.
Comments
Please login to add a commentAdd a comment