CM YS Jagan To Launch Jaganannaku Chebudam On 9th May 2023 - Sakshi
Sakshi News home page

‘జగనన్నకు చెబుదాం’@ 1902

Published Tue, May 9 2023 3:54 AM | Last Updated on Tue, May 9 2023 10:00 AM

CM YS Jagan To Launch Jaganannaku Chebudam On 9th May 2023 - Sakshi

సాక్షి, అమరావతి: సంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 

పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్‌  
ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్‌ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు. సంక్షేమ పథకాలు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చు.

రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం కోసం 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలి. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ఆహ్వానం
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్‌ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలు / రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవోలు, డీపీవోలకు పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక జడ్పీటీసీకి ఈ సమాచారాన్ని అందచేయడంతోపాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని పేర్కొంది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను ఆహ్వానించాలని సూచించింది. 

ఎలా చెబుదామంటే..?
1. మీ సమస్యను తెలియచేసేందుకు తొలుత 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలి
2. కాల్‌ సెంటర్‌ ప్రతినిధికి మీ సమస్యను చెప్పండి
3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని వైఎస్సార్‌ (యువర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌) ఐడీని కేటాయిస్తారు
4. మీ అర్జీ స్టేటస్‌ గురించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అప్‌డేట్‌ అందుతుంది
5. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement