అర్హులు ఒక్కరూ మిగిలిపోకూడదని.. | Welfare benefits for everyone who is eligible in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అర్హులు ఒక్కరూ మిగిలిపోకూడదని..

Published Thu, Aug 24 2023 6:19 AM | Last Updated on Thu, Aug 24 2023 8:37 AM

Welfare benefits for everyone who is eligible in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందాలన్న కృత నిశ్చయంతో పారదర్శక విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చనున్నారు. 2022 డిసెంబర్‌ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతోపాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్‌ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 

మిగిలిపోయిన అర్హులకు ఏటా రెండు దఫాలు..
అర్హులై ఉండి కూడా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందని వారు ఆయా పథకాలను అందించిన నెల­లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసు­కోవాలి. వెరిఫికేషన్‌ అనంతరం.. మిగిలిపోయిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం ప్రయో­జనాన్ని చేకూరుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రద­ర్శిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది.

అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా ప్రయోజనం పొందని వారికి గురువారం అందిస్తున్న మొత్తంతో కలిపి 2021 డిసెంబర్‌  నుంచి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాల్లో రూ.1,647 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి 94,62,184 సర్టిఫికెట్ల జారీతో పాటు కొత్తగా అర్హులుగా గుర్తించిన మరో 12,405 మందికి నేడు లబ్ధి చేకూరనుంది. జగనన్నకు చెబుదాం ద్వారా అందిన దరఖాస్తుల్లో అర్హులైన 1,630 మందికి కూడా నేడు ప్రయోజనం కలగనుంది.

అధికారంలోకి వచ్చిన 50 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలు, వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా రూ.2.33 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో సీఎం జగన్‌ జమ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల సిఫారసులు, లంచాలకే పెద్దపీటతోపాటు వీలైనంత ఎక్కువ మందికి ఎగ్గొట్టడమే లక్ష్యంగా వ్యవహరించగా ఇప్పుడు అలాంటి వాటికి ఏమాత్రం తావు లేకుండా పూర్తి పారదర్శకంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement