AP: వలంటీర్లకు సత్కార వేడుక | Ceremony for volunteers by CM YS Jagan in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: వలంటీర్లకు సత్కార వేడుక

Published Thu, Apr 7 2022 3:38 AM | Last Updated on Thu, Apr 7 2022 8:35 AM

Ceremony for volunteers by CM YS Jagan in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను గడప గడపకూ చేరవేస్తూ లబ్ధిదారులకు పారదర్శకంగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల నిబద్ధతను గుర్తిస్తూ వరుసగా రెండో ఏడాది సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరగనున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు ఇందులో పాల్గొంటారు. వలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో సత్కరించడంతో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,33,333 మంది వలంటీర్లను సచివాలయాలవారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిస్తారు.

విమర్శకులే ప్రశంసించేలా..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వతేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో దీనిపై తీవ్ర విమర్శలు చేసిన వారు సైతం అభినందించేలా ఏడాదిన్నరగా వలంటీర్లు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. సచివాలయాల వ్యవస్థ పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. వలంటీర్ల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఉగాది సందర్భంగా సత్కార కార్యక్రమాలను ప్రారంభించింది. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు.

మూడు అంశాల ఆధారంగా..
సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు, పింఛన్ల పంపిణీ, కరోనా థర్డ్‌ వేవ్‌లో ఫీవర్‌ సర్వే తీరు అంశాల ఆధారంగా వలంటీర్లకు పాయింట్లు కేటాయించి మూడు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. సేవా వజ్ర అవార్డుకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున, సేవా రత్న అవార్డుకు ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున, నగర కార్పొరేషన్‌లో పది మంది చొప్పున ఎంపిక చేశారు. కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేనివారిని సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేశారు.

ఈసారి మరింత మందికి..
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 2,20,993 మంది వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించగా ఈ ఏడాది 2,33,333 మందిని సత్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 875 మంది వలంటీర్లను సేవా వజ్ర అవార్డుతో పాటు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌తో సత్కరించనున్నారు. 4,136 మందికి సేవారత్న అవార్డుతో పాటు రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌ అందజేస్తారు. 2,28,322 మంది సేవా మిత్ర అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతి అందుకోనున్నారు.

మీడియా కంటే ముందే..
► ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు, సంక్షేమ పథకాల సమాచారం ఇప్పుడు పత్రికలు, టీవీల కంటే ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరుతోంది. 33 రకాల సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే  ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. 
► రాష్ట్రంలో 61.03 లక్షల మంది పింఛనుదారులకు ఇప్పుడు ప్రతి నెలా మొదటి తేదీనే వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. రూ.46,564 కోట్లు వలంటీర్ల ద్వారా 
పారదర్శకంగా లబ్ధిదారులకు అందాయి.
► 10.34 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు, 3.60 లక్షల కుటుంబాలకు  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు వలంటీర్ల ద్వారానే మంజూరయ్యాయి.
► జగనన్న తోడు పథకంలో చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందజేసే వడ్డీ లేని రుణాలకు 9.05 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక వలంటీర్ల ద్వారానే సాగింది. 
► కరోనా సమయంలో 1.50 కోట్ల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులపై వలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించింది. బాధితులను గుర్తించి తక్షణమే వైద్య సేవలను అందించింది. కరోనా వ్యాక్సినేషన్‌లోనూ వలంటీర్లది కీలక పాత్ర.
► కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో వీఆర్వోలకు సహాయకారిగా పనిచేయడంతోపాటు వలంటీర్లు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
► ఇంటింటికీ బియ్యం పంపిణీలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

వలంటీర్ల విధులు
► ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగంగా తమకు కేటాయించిన 50 కుటుంబాలలో వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం, వారికి ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలను తెలియచేయడం.
► వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించడం.
► నిర్దేశిత కుటుంబాలు పొందిన పథకాలు, ప్రయోజనాలు, ఆ ప్రాంతం సమాచారాన్ని సమగ్రంగా నిర్వహించడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం.
అర్హులతో దరఖాస్తు చేయించి పథకాల మంజూరులో సహాయకారిగా వ్యవహరించడం. 
► రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల సంబంధిత సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తేవడం. పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, ప్రాథమిక విద్యలో తోడ్పాటు అందించడం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement