Super numerary posts
-
అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇక ఆరుగురు డీఎంహెచ్వోలు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్రీచ్ కార్యకలాపాలు సీహెచ్‌సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 4,246 ఎంపీహెచ్ఏ పోస్టులు మంజూరు 1,712 పోస్ట్‌లను సూపర్‌న్యూమరరీ పోస్ట్‌లుగా మార్చారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. దాంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది. -
విద్యా సంస్థలకు యూజీసీ లేఖ
సాక్షి, అమరావతి: దేశంలో అనాధ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన సూపర్ న్యూమరరీ సీట్లతో ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది? ఎన్ని విద్యా సంస్థల్లో వారికి సీట్లు ఇచ్చారో తెలపాలని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వాటికి లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన నోటీసును తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. కోవిడ్‌తో 2020, 2021ల్లో అనేక మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో పిల్లలు అనాధలుగా మారారు. వీరిలో కొంతమంది పాఠశాల చదువుల్లో ఉండగా మరికొంతమంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరు తదుపరి ఉన్నత తరగతుల్లో చేరేందుకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్’ కింద అన్ని విద్యాసంస్థల్లోనూ సూపర్ న్యూమరరీ సీట్లు ప్రవేశపెట్టాలని గతేడాది మార్చిలో సూచించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలూ సూపర్ న్యూమరరీ సీట్లను అనాధ విద్యార్థులకు కేటాయించేలా చేసింది. ఇప్పుడు విద్యా సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో సూపర్ న్యూమరరీ సీట్లతో లబ్ధి పొందిన వారి సమాచారాన్ని తెలియచేయాలని యూజీసీ ఆయా విద్యాసంస్థలకు సూచించింది. విద్యార్థుల సంఖ్యతో పాటు వారు ఏయే కోర్సులు అభ్యసిస్తున్నారు? వారు ఎలాంటి సహాయం పొందుతున్నారు? వంటి అంశాలను కూడా అందించాలని కోరింది. -
హైకోర్టుకు 183 సూపర్‌న్యూమరరీ, 267 అదనపు పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు పరిధిలో 183 సూపర్ న్యూమరరీ, 267 పోస్టుల కల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. ఈ మేరకు కేటగిరీల వారీగా ఆయా పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్‌న్యూమరరీ పోస్టుల్లో భాగంగా జాయింట్ రిజిస్ట్రార్(1), డిప్యూటీ రిజిస్ట్రార్ (3), అసిస్టెంట్ రిజిస్ట్రార్(10), సెక్షన్ ఆఫీసర్ (50),జడ్జిలు, రిజిస్ట్రార్లకు పీఎస్‌లు(11), డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్లు(12), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు(24), ఎగ్జామినర్(3), డ్రైవర్(30), రికార్డు అసిస్టెంట్(39) పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇక అదనపు పోస్టుల విషయానికి వస్తే జిల్లా కోర్టులు, అదనపు జిల్లా సెషన్స్ కోర్టులు, కమిషనర్లు, ఎస్పీ కార్యాలయాలు, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టులు, ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు 267 పోస్టులకు అనుమతినిచ్చింది. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(4), గ్రేడ్–1 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (116), గ్రేడ్–2 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(39), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (101), పరిపాలన అధికారులు (2), సూపరిండెంట్లు (2), సీనియర్ అసిస్టెంట్లు(3) పోస్టులు మంజూరయ్యాయి. వీటికి తోడు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో హైకోర్టులో ఒక ఓఎస్డీ పోస్టును కూడా మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ వేరొక ఉత్తర్వు జారీ చేసింది. -
ఆ 329 మంది తిరిగి ఆంధ్రాకు!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు లేకపోవడంతో ఏపీకి ఆప్షన్ ఇచ్చినా తెలంగాణకు కేటాయించిన 329 మంది ఉద్యోగులు తిరిగి ఆంధ్రాకు వచ్చే అవకాశం ఏర్పడింది. వారికోసం సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్థిక, రాష్ట్ర పునర్విభజన విభాగం అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీకి చెందిన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకోవాలని సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకు ఆర్థిక శాఖ కూడా సుముఖత వ్యక్తం చేసింది. 329 మందిని తీసుకున్నప్పటికీ అన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని, కొంత మంది పదవీ విరమణ చేయడంతో పాటు మరి కొంత మంది తెలంగాణ నుంచి రాకపోవచ్చుననే అభిప్రాయం సమీక్షలో వ్యక్తమైంది. -
అభ్యంతరాలు తేలేవరకు సూపర్ న్యూమరరీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ విభజన జరుగుతోంది. రాష్ట్ర పునర్విభజన విభాగం ఇప్పటికే 86 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే వారిలో కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. వారి అభ్యంతరాలను పరిష్కారం చేసేవరకు ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగానైనా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సిందిగా రాష్ట్ర పునర్విభజన విభాగం సూచించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఫైలును సర్క్యులేట్ చేసింది. ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగిని మరో రాష్ట్రానికి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతనిని రిలీవ్ చేయడానికి వీలుండదు. అలాగే ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగిని మరో రాష్ట్రానికి కేటాయించిన పక్షంలో అభ్యంతరం లేకపోతే అతనిని రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా రిలీవ్ చేయాలంటే ఒక పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు ఉంటారు. ఒక పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేనందున... ఆ అభ్యంతరాలు పరిష్కారం అయ్యేవరకు తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టును సృష్టించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి జీత భత్యాలను కూడా ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగా మార్చి నెలవరకైనా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సిందిగా రాష్ట్ర పునర్విభజన విభాగం రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఫైలు ద్వారా కోరింది. ఇలా ఉండగా రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన మొత్తం 118 విభాగాలకుగాను ఇప్పటివరకు రాష్ట్ర పునర్విభజన విభాగం 100 విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను జారీ చేసింది. అందులో ఇప్పటివరకు 86 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ పూర్తి చేసింది. పంపిణీ పూర్తి చేస్తూ 56 విభాగాలకు చెందిన ఉద్యోగులతో నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా 30 విభాగాలకు చెందిన ఉద్యోగుల పంపిణీకి సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇంకా 14 విభాగాలకు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు రావడానికి మరికొంత సమయం ఉంది. ఈ నెలాఖరులోగా ఆ విభాగాలకు చెందిన ఉద్యోగుల ఆప్షన్లను పరిశీలించి ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయనున్నారు.