సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ విభజన జరుగుతోంది. రాష్ట్ర పునర్విభజన విభాగం ఇప్పటికే 86 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే వారిలో కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. వారి అభ్యంతరాలను పరిష్కారం చేసేవరకు ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగానైనా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సిందిగా రాష్ట్ర పునర్విభజన విభాగం సూచించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఫైలును సర్క్యులేట్ చేసింది. ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగిని మరో రాష్ట్రానికి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతనిని రిలీవ్ చేయడానికి వీలుండదు.
అలాగే ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగిని మరో రాష్ట్రానికి కేటాయించిన పక్షంలో అభ్యంతరం లేకపోతే అతనిని రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా రిలీవ్ చేయాలంటే ఒక పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు ఉంటారు. ఒక పోస్టుకు ఇద్దరు ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేనందున... ఆ అభ్యంతరాలు పరిష్కారం అయ్యేవరకు తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టును సృష్టించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి జీత భత్యాలను కూడా ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగా మార్చి నెలవరకైనా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సిందిగా రాష్ట్ర పునర్విభజన విభాగం రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఫైలు ద్వారా కోరింది.
ఇలా ఉండగా రాష్ట్ర స్థాయి కేడర్‌కు చెందిన మొత్తం 118 విభాగాలకుగాను ఇప్పటివరకు రాష్ట్ర పునర్విభజన విభాగం 100 విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను జారీ చేసింది. అందులో ఇప్పటివరకు 86 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ పూర్తి చేసింది. పంపిణీ పూర్తి చేస్తూ 56 విభాగాలకు చెందిన ఉద్యోగులతో నోటిఫికేషన్ జారీ చేసింది. మిగతా 30 విభాగాలకు చెందిన ఉద్యోగుల పంపిణీకి సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇంకా 14 విభాగాలకు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు రావడానికి మరికొంత సమయం ఉంది. ఈ నెలాఖరులోగా ఆ విభాగాలకు చెందిన ఉద్యోగుల ఆప్షన్లను పరిశీలించి ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయనున్నారు.
అభ్యంతరాలు తేలేవరకు సూపర్ న్యూమరరీ పోస్టులు
Published Tue, Jun 16 2015 3:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM
Advertisement