హెచ్‌సీఏపై హైకోర్టు సంచలన ఆదేశాలు
హైదరాబాద్: నిధుల దుర్వినియోగానికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హెచ్‌సీఏ బ్యాంకు ఖాతాలన్ని వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది. తాజా మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, కార్యదర్శి మనోజ్, జాయింట్ సెక్రటరీ అగర్వాల్ సస్పెండ్ వేటు వేసింది. లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలుచేయకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిటీ సిఫారసుల ప్రకారం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
అలాగే పాత కమిటీని కూడా రద్దు చేసి వెంటనే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలేవీ కూడా ఇప్పటి వరకు హెచ్‌సీఏ తీసుకోలేదు. గత ఐదేరాళ్లుగా హెచ్‌సీఏకు పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నట్లు సమాచారం. ఏటా దాదాపు 31కోట్లు వస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ నిధులను జిల్లాలో స్టేడియాల పేరిట దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎక్కడా ఒక్క స్టేడియాన్ని, ఇతర మౌలిక వసతులు ఏర్పాటుచేసినట్లుగానీ కనిపించని నేపథ్యంలో మరిన్ని నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే హైకోర్టు ఈ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.