హైకోర్టులో వీహెచ్ రచ్చ
♦ ‘హెచ్‌సీయూ’ ఘటనపై పిటిషన్ విచారణలో గందరగోళం
♦ తమ న్యాయవాదిని ధర్మాసనం నిలదీయడంతో అసహనం
♦ నేను ఎంపీని.. కావాలంటే అరెస్ట్ చేసుకోండి
♦ జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటిన వీహెచ్
♦ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం.. వెనక్కి తగ్గిన వీహెచ్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీగా అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పజెప్పడంపై దాఖలైన పిటిషన్ విచారణలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు గందరగోళం సృష్టించారు. హైకోర్టులోనే గట్టిగా మాట్లాడుతూ.. గ్యాలరీ దాటి ముందుకెళ్లేం దుకు ప్రయత్నించారు. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కితగ్గారు. ఇక ఈ పిటిషన్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వీసీ అప్పారావు, సైబరాబాద్ కమిషనర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 20కి వాయిదా వేస్తూ... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్‌సీయూ వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ ఎంపీ వి.హనుమంతరావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి స్పం దిస్తూ... హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య ఘటన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితుడిగా ఉన్నారన్నారు. దాంతో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిందని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు.
ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థుల హక్కులు ప్రభావితమవుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వీసీని సస్పెండ్ చేశారా, సెలవుపై వెళ్లారా అనే స్పష్టత లేకుంటే ఎలాగని నిలదీసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది చెప్పగా... విద్యార్థుల ప్రయోజనాలను తాము పరిరక్షిస్తామని, దాని గురించి పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. భావోద్వేగాలు, మీడియా కథనాల ఆధారంగా కేసులను విచారించడం సాధ్యం కాదని పేర్కొంది.
వీహెచ్ రగడ..
అసలు ఈ వ్యాజ్యంలో మీరు ఏం కోరుతున్నారో కూడా చెప్పాలని న్యాయవాదిని ధర్మాసనం పలుమార్లు ప్రశ్నించింది. ఈ సమయంలో కక్షిదారుల గ్యాలరీలో ఉన్న వీహెచ్ లేచి తనదైన యాసలో పెద్దగా మాట్లాడడం ప్రారంభించారు. ఓ వ్యక్తి కోసం 6 వేల మంది విద్యార్థులు రోడ్డుపై ఉన్నారని అరుస్తూ గ్యాలరీ దాటి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో న్యాయవాదులు వారించడంతో వెనక్కి తగ్గారు. ధర్మాసనం మళ్లీ న్యాయవాదిని స్పష్టత కోరడంతో వీహెచ్ సహనం కోల్పోయారు. తాను ఎంపీనని, తనను అరెస్ట్ చేసుకోవచ్చని, జైలుకు కూడా వెళతానంటూ గ్యాలరీ దాటి ముందుకెళ్లారు. తన వాదన వినాలని కోరారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను పిలిచేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో న్యాయవాదులు వీహెచ్‌ను వారించడంతో వెనక్కి వెళ్లారు. అయితే పోలీసులు కోర్టు హాల్‌లోకి రావడం, వీహెచ్ మరో ద్వారం నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగాయి. అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.