► టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలి నియామకంపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ చంద్రావతిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) సభ్యురాలుగా నియమించడంపై ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ వివరణను కోరింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శులతో పాటు చంద్రావతికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలిగా కొనసాగేందుకు చంద్రావతికి తగిన అర్హతలు లేవన్నారు. మంచి ప్రవర్తన, ప్రజల్లో విశ్వాసం పెంచేవారు, నిష్పాక్షికంగా వ్యవహరించే వ్యక్తులే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా ఉండాలన్నారు. చంద్రావతిపై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆమె విధి నిర్వహణలో అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, చంద్రావతి నియామకంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
' నియామకంపై వివరణ ఇవ్వండి'
Published Sat, Jan 2 2016 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM
Advertisement