explanation
-
తెలంగాణ అప్పు రూ.6,85,765 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘పదేళ్ల బీఆర్ఎస్ విధ్వంసం–ఆర్థిక అరాచకం’పేరుతో విడుదల చేయనున్న శ్వేతపత్రంలో భాగంగా 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, తద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించనున్నట్లు సమాచారం. అలాగే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023–24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, జరిగిన ఖర్చుతో పాటు అప్పుల గురించి శాసనసభకు తెలియజేయనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని, రెండింటికీ మధ్య సుమారు 20 శాతం తేడా ఉందంటూ గణాంకాలు వెల్లడించనున్నట్లు తెలిపాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం రూ.14,87,834 కోట్లను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది కేవలం రూ.12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించనుంది. అప్పులు ఇలా..! ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75 వేల కోట్ల అప్పు ఉంటే గత పదేళ్లలో అది రూ.6,85,765 కోట్లకు చేరింది. అందులో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడి తెచ్చిన అప్పు రూ.3.89 లక్షల కోట్లయితే, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీల ద్వారా ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్లకు పైగా సమకూర్చి ఖర్చు పెట్టింది. మరో రూ.1.09 లక్షల కోట్లను గ్యారంటీలిచ్చి కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టింది. ఇక ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా రూ.60 వేల కోట్ల మేర కార్పొరేషన్లే నేరుగా అప్పులు చేశాయి..’అని విశదీకరించనున్నారు. ‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.12 లక్షల కోట్లకు పైగా కేవలం మిషన్ భగీరథ, సీతారామ, కాళేశ్వరంతో పాటు కొంతమేర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు. ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల్లో కొంత వెచ్చించి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అయితే 1956 నుంచి 2014 వరకు అన్ని బడ్జెట్లు కలిపి తెలంగాణకు వచ్చి న వాటా కేవలం రూ.5 లక్షల కోట్లకు పైగా మాత్రమే. ఈ తక్కువ మొత్తంతోనే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఇతర సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అమలు చేశాయి..’ అని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
క్రెడిట్ కార్డ్.. లిమిట్ పెంచుకుంటున్నారా?
క్రెడిట్ కార్డ్ వినియోగం మన దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2023 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 8.6 కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. 2022 ఏప్రిల్ నాటికి ఉన్న 7.5 కోట్లతో పోలిస్తే ఏడాదిలో 15 శాతం పెరిగాయి. 2024 ఆరంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేస్తే తగ్గింపులతో పాటు, రివార్డులు, ఉచిత మూవీ టికెట్లు ఇలా ఎన్నో ఆఫర్లు వినియోగాన్ని పెంచుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌లు తీసుకున్న తర్వాత దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని, క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలంటూ బ్యాంక్‌లు కోరుతుండడం చాలా మందికి అనుభవమే. చాలా మంది తమ కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం లేదంటే క్రెడిట్ లిమిట్ (అప్పు పరిమితి) పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కార్డ్ అప్‌గ్రేడ్ లేదా క్రెడిట్ లిమిట్ పెంపుతో ప్రయోజనాలున్నట్టే.. కొన్ని రిస్క్‌లు లేకపోలేదు. కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఓకే చెప్పడానికి ముందు ఇందులో ఉండే చిక్కుల గురించి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత దీనిపై నిర్ణయానికి రావాలి.. ‘‘క్రెడిట్ పరిమితి (లిమిట్) పెంపు లేదా క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ను, కార్డుదారుడి ఇటీవలి రుణ చరిత్ర ఆధారంగానే బ్యాంక్‌లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రస్తుత కార్డుపై ఉన్న పనితీరును చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటుంటాయి. కార్డుదారుడి ఆదాయ స్థాయి పెరిగినట్టు బ్యాంక్ భావించిన సందర్భాల్లోనూ ఈ ఆఫర్లు ఇస్తుంటాయి’’అని విష్ఫిన్ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ లేదా లిమిట్ పెంపు ఆఫర్ వచి్చందంటే అది కచి్చతంగా రుణ పరపతి పెరిగిన దానికి సంకేతంగా చూడొచ్చు. అయితే, సంబంధిత ఆఫర్ లేదా అభ్యర్థనను ఆమోదించే ముందు తప్పకుండా సానుకూలతలు, ప్రతికూలతల గురించి విశ్లేíÙంచుకోవాలని రిషి మెహ్రా సూచించారు. అప్‌గ్రేడ్ మంచికేనా..? ఉన్నత శ్రేణి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే, దానిపై రుణం రేటు, రివార్డులు, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు, డీల్స్ కూడా మెరుగ్గానే ఉంటుంటాయి. దీంతో కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల అధిక రివార్డులు, క్యాష్‌బ్యాక్, ఇతర ప్రయోజనాలు లభిస్తుంటాయి. కాకపోతే కార్డ్‌పై నిర్ధేశిత వ్యయాలు చేయాలనే నిబంధనలు ఉంటాయని మర్చిపోవద్దు. అప్‌గ్రేడెడ్ కార్డుకు వెళ్లకుండా, ఎన్నేళ్లు గడిచిన అదే పాత కార్డ్‌లోనే కొనసాగే వారు మంచి డీల్స్‌ను కోల్పోవాల్సి రావచ్చు. ‘‘పాతబడిన క్రెడిట్ కార్డ్ ఆధునిక ఫీచర్లు, ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు. నేడు దాదాపు చాలా క్రెడిట్ కార్డ్ సంస్థలు అర్హులైన కస్టమర్లకు ఉచిత ఎయిర్పోర్ట్ లాంజెస్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్రతీ లావాదేవీపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, క్రెడిట్ లిమిట్‌ను పెంచుతున్నాయి. పాత కార్డ్‌లోనే కొనసాగడం వల్ల.. బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల లభించే నూతన, అదనపు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి వివరించారు. అధిక లిమిట్ లాభమేనా? క్రెడిట్ లిమిట్ కంటే తక్కువ ఖర్చు చేసే వారి పట్ల క్రెడిట్ బ్యూరోలు సానుకూలంగా వ్యవహరిస్తాయి. ‘‘క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోరును ఎన్నో అంశాల ఆధారంగా లెక్కిస్తుంటాయి. అందులో క్రెడిట్ వినియోగం ఒకటి. తక్కువ క్రెడిట్ వినియోగ రేషియో (సీయూఆర్) అన్నది.. లిమిట్‌ను వినియోగించుకునే విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలియజేస్తుంది. క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడడం లేదని సంకేతం ఇస్తుంది. ఇది ఒకరి క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుంది’’అని ఆదిల్ శెట్టి వివరించారు. కార్డుపై ఉన్న మొత్తం లిమిట్లో ఎంత శాతం ప్రతి నెలా వినియోగిస్తున్నారన్నది క్రెడిట్ వినియోగ రేషియో రూపంలో తెలుస్తుంది. ఇది తక్కువగా ఉంటే సానుకూలం అవుతుంది. ‘‘ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్ రూ.లక్షగా ఉంటే, ప్రతి నెలా వినియోగిస్తున్నది రూ.50,000గా ఉంటే అప్పుడు సీయూఆర్ 50 శాతం అవుతుంది. అదే క్రెడిట్ లిమిట్ రూ.1,50,000 అయి ఉండి, వినియోగించే మొత్తం ప్రతి నెలా రూ.50,000 స్థాయిలోనే ఉంటే, అప్పుడు వినియోగ రేషియో 33 శాతం అవుతుంది’’అని శెట్టి తెలియజేశారు. క్రెడిట్ స్కోర్ సగటున 700–750 మధ్య ఉంటే, దీన్ని పెంచుకునేందుకు అధిక క్రెడిట్ లిమిట్ సాయపడుతుంది. ‘‘సగటు స్కోరులో ఉన్న వ్యక్తి (750లోపు) క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల అప్పుడు వారి క్రెడిట్ స్కోరు సైతం 750 ఎగువకు చేరుతుంది. అప్పటికే ఎక్కువ స్కోర్‌లో ఉన్న వారు క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల అదనంగా పొందేదేమీ ఉండదు’’అని మెహ్రా సూచించారు. తక్కువ సీయూఆర్ వ్యక్తి ఆర్థిక ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆదిల్‌శెట్టి సూచించారు. ‘‘సీయూఆర్ తక్కువగా ఉంటే మీరు మీ ఆర్థిక వ్యవహారాలను ఎంతో క్రమశిక్షణగా నిర్వహిస్తున్నట్టు తెలియజేస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు దాదాపు తక్కువగా ఉంటాయని సంకేతమిస్తుంది. రుణాల విషయంలో సరైన నడవడిక, సకాలంలో చెల్లింపులు, రుణాల్లో సరైన సమతుల్యం (వివిధ రుణాలు) అనేవి మంచి క్రెడిట్ స్కోరుకు దారితీస్తాయి’’అని శెట్టి తెలిపారు. రిస్‌్కలు ఇవీ.. అధిక క్రెడిట్ లిమిట్‌తో ఉండే అతిపెద్ద రిస్క్ పరిమితికి మించి ఖర్చు చేయడం. ‘‘ఎక్కువ లిమిట్ ఉంటే, అవసరాలు ఏర్పడినప్పుడు ఆలోచించకుండా ఖర్చు చేస్తుంటారు. సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే అది భారంగా మారుతుంది. క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ కార్డ్ నిర్వహణ భద్రంగా లేకపోతే అది దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. మోసపూరిత లావాదేవీలకు ఆస్కారం ఉంటుంది’’అని మెహ్రా పేర్కొన్నారు. కార్డు వినియోగం విషయంలో జాగ్రత్తగా, నియంత్రణతో వ్యవహరించకపోతే అది ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. అధికంగా వినియోగించడం వల్ల అప్పుడు క్రెడిట్ వినియోగ రేషియో (సీయూఆర్) పెరిగేందుకు దారితీస్తుంది. సీయూఆర్ ఎక్కువ అయితే అది క్రెడిట్ స్కోర్‌ను వెనక్కి లాగేస్తుంది. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉంటే, అప్పటికే ఉన్న క్రెడిట్ లిమిట్లో అధిక శాతం వినియోగించాల్సి వస్తుంటే.. అప్పుడు క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవాలి. సీయూఆర్ 30 శాతం మించకుండా చూసుకోవాలి. దీనితోపాటు క్రమశిక్షణతో కార్డును వినియోగించడం, సకాలంలో చెల్లింపులు చేయడం చాలా కీలకమవుతుంది. ఆఫర్‌కు ఓకే చెప్పాలా..? బ్యాంక్‌లు, లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీలు తరచుగా కార్డ్ అప్‌గ్రేడ్ లేదా లిమిట్ పెంచుకోవాలంటూ ఆఫర్లు ఇస్తుంటాయి. అప్పుడు తమ వైపు నుంచి సమీక్షించుకోవాలి. ఖర్చు చేసేందుకు అదనపు వెసులుబాటు ఉందా? రివార్డుల పరంగా ఆ కార్డ్ మెరుగైనదా? లేదంటే తమ అవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక కార్డా? సెక్యూరిటీ ఫీచర్లు ఏ మేరకు? ఇవన్నీ చూడాలి. ముఖ్యంగా ఒక క్రెడిట్ కార్డ్‌తోనే ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ పరిమితం కాదు. ఇతర బ్యాంక్‌ల నుంచి రుణాలు, కార్డ్‌లు తీసుకోవాల్సి వస్తే, మీ పరిస్థితి ఏంటన్నది కూడా చూడాలి. మంచి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ ఉంటే ఇతర కార్డ్ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుంటాయి. ‘‘బ్యాంక్ ఇచి్చన ఆఫర్ తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగానే ఉందా? ఖర్చు చేసే ధోరణికి అనుకూలంగా ఉందా?మరిన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయా? వీటికి అవుననే సమాధానం వస్తే, అప్పుడు ఆ కార్డ్ ఆఫర్‌ను ఆమోదించొచ్చు. తాజా ఆఫర్‌కు సంబంధించి షరతులు మీకు అనుకూలంగా లేకపోతే, మీ లక్ష్యాలకు అనుకూలమైన ఇతర కార్డ్‌ను పరిశీలించొచ్చు’’అని ఆదిల్ శెట్టి సూచించారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంపు లేదా కార్డ్ అప్‌గ్రేడేషన్ అదనపు సదుపాయాలతో రావడమే కాదు, వార్షిక ఫీజు కూడా అధికంగా ఉంటుంది. అందుకని అప్‌గ్రేడ్‌ను ఎంపిక చేసుకునే ముందు పడే భారం ఎంత, ప్రయోజనాలు ఏ మేరకో చూడాలి. చాలా వరకు బ్యాంక్‌లు కార్డ్‌పై వార్షికంగా ఇంత వ్యయం చేస్తే, వార్షిక నిర్వహణ చార్జీని మాఫీ చేస్తున్నాయి. దీంతో సులభంగానే ఈ భారం పడకుండా చూసుకోవచ్చు. ఇలా అయితే సమ్మతి.. క్రెడిట్ కార్డ్ సంస్థ నుంచి ఎలాంటి ఆఫర్లు రానప్పుడు.. ఇంతకంటే మెరుగైన కార్డ్‌కు తాను అర్హుడినని భావిస్తే, అప్పుడు కార్డుదారుడే స్వయంగా లిమిట్ పెంచాలని లేదా కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కోరొచ్చు. ‘‘క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత తమ ఆదాయం పెరిగితే అప్పుడు క్రెడిట్ లిమిట్ పెంపునకు అర్హత లభించినట్టుగా భావించొచ్చు. క్రెడిట్ కార్డ్ కంపెనీతో దీర్ఘకాల బంధం ఉన్నవారు తమ లిమిట్ పెంచుకునే అనుకూలతతో ఉంటారు. కొన్ని ప్రయోజనాలు ప్రీ అప్రూవ్డ్ (ముందే ఆమోదించినది)గా ఉంటాయి’’అని శెట్టి వివరించారు. అప్‌గ్రేడ్ చేసుకోవడం, క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం పూర్తిగా అవసరాల ప్రాతిపదికనే ఉండాలన్నది మర్చిపోవద్దు. ఆదాయం పెరిగినప్పుడు, మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడే క్రెడిట్ లిమిట్, క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడేషన్‌కు వెళ్లాలని మెహ్రా సూచిస్తున్నారు. ‘‘ఒక వ్యక్తి ఖర్చులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. కొంత కాలానికి ఇందులో మార్పు వస్తుంటుంది. అలాంటప్పుడు కార్డ్‌ను మార్చుకోవచ్చు. ప్రస్తుత కార్డ్ ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు, అవి తమకు అనుకూలంగా లేకపోతే కార్డ్ అప్గ్రేడేషన్ను కోరొచ్చు. ఉదాహరణకు ఒక బ్యాంక్ ఒక కార్డ్‌ను ఉపసంహరించి, దాని స్థానంలో వేరేది ఇస్తున్నట్టు అయితే, అందులో ప్రయోజనాలు అంత ఆకర్షణీయంగా లేవనిపిస్తే అప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని కోరొచ్చు’’అని మెహ్రా సూచించారు. అప్‌గ్రేడ్ ద్వారా తీసుకునే కార్డులో ప్రయోజనాలు తమకు అనుకూలంగా, ఆకర్షణీయంగా ఉన్నాయేమో చూసుకోవాలి. అంతేకానీ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. -
జీ20: ఎందుకు.. ఏమిటి!
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా ఖ్యాతికెక్కిన జీ20 సదస్సుకు హస్తిన ముస్తాబైంది. ఈనెల 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగు తున్నాయి. జీ20కి భారత సారథ్య బాధ్యతలు త్వరలో ముగుస్తున్న తరుణంలో ఢిల్లీలో జరిగే సదస్సులో విప్లవాత్మక తీర్మానా లు జరిగే అవకాశముంది. వర్కింగ్ గ్రూప్ సెషన్స్‌లో తీసుకున్న నిర్ణయాలు, వివిధ శాఖల జీ20 మంత్రుల విడివిడి సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఈ శిఖరాగ్ర సదస్సు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో జీ20 గురించి కొన్ని విషయాలను గుర్తుచేసుకుందాం. ఈసారి ఇతివృత్తమేంటి ? వసుధైక కుటుంబం అనేది ఈ ఏడాదికి జీ20 సదస్సు ఇతివృత్తం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే భావనను స్ఫూర్తిగా తీసుకున్నారు. మహా ఉపనిషత్తులోని సంస్కృత రచనల్లో పేర్కొన్నట్లు సూక్షజీవులు మొదలు మనుషులు, జంతుజాలం అంతా ఈ భూమిపైనే ఒకే కుటుంబం జీవిస్తూ ఉమ్మడి భవిష్యత్తుతో ముందుగు సాగుతాయనేది ‘వసుధైక కుటుంబం’ అంతరార్థం. భూమిపై మనగడ సాగిస్తున్న జీవజాలం మధ్య అంతర్గత బంధాలు, సంపూర్ణ సమన్వయ వ్యవస్థల సహాహారమే వసుధైక కుటుంబం అని చాటిచెపుతూ దీనిని జీ20 సదస్సుకు ఇతివృత్తంగా తీసుకున్నారు. లైఫ్(లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్).. అంటే పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంభించాలని సదస్సు ద్వారా జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిచ్చాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు అభిలషిస్తోంది. ‘లైఫ్’తోనే శుద్ధ, పర్యావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమని జీ20 కూటమి భావిస్తోంది. జీ20 సారథ్య బాధ్యతలను ఎలా నిర్ణయిస్తారు? 19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమే జీ20. ప్రపంచం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది. జీ20లో అంతర్గతంగా ఐదు గ్రూప్‌లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి ఒక దేశం జీ20 సారథ్యం కోసం పోటీపడొచ్చు. ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో ఒక గ్రూప్‌కు సారథ్య బాధ్యతల అవకాశం దక్కుతుంది. తమ గ్రూప్ తరఫున సారథ్య అవకాశం వచ్చినపుడు ఆ గ్రూప్ నుంచి ఎవరు ప్రెసిడెన్సీకి పోటీ పడాలనేది అంతర్గతంగా ఆ దేశాలు విస్తృతంగా చర్చించుకుని నిర్ణయించుకుని ఉమ్మడి నిర్ణయం ప్రకటిస్తాయి. అలా తదుపరి సారథి ఎవరో నిర్ణయమైపోతుంది. సారథ్యం వహించే దేశం అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. జీ20 అజెండా ఖరారు, శిఖరాగ్ర సదస్సుసహా మంత్రిత్వ శాఖల స్థాయిలో విడివిడిగా జీ20 గ్రూప్ సమావేశాలను వేర్వేరు పట్టణాల్లో నిర్వహించాలి. సమావేశాల తాలూకు అన్ని రకాల నిర్వహణ ఖర్చులు, సిబ్బంది తరలింపు బాధ్యత సారథ్య దేశానిదే. శాశ్వత సచివాలయం లేని సందర్భాల్లో జీ20 సదస్సు సంబంధ వ్యవహారాలనూ అతిథ్య దేశమే చూసుకోవాలి. తొలి సదస్సు ఎక్కడ ? 2008 నాటి ఆర్థిక సంక్షోభం కారణంగా జీ20 ఉద్భవించింది. ఆనాడు యురోపియన్ యూని యన్‌కు సారథ్యం వహిస్తున్న ఫ్రాన్స్.. ప్రపంచం ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కి ఆర్థికవ్యవస్థ మళ్లీ ఉరకలెత్తాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు నిచ్చింది. అప్పటికే జీ8 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, బ్రిటన్, అమెరికాలు పరిస్థితిని చక్కదిద్దలేకపోయాయి. దీంతో మరిన్ని దేశాలతో కలిపి జీ20ని కొత్తగా ఏర్పాటుచేశారు. ‘ఫైనాన్షియల్ మార్కెట్లు– ప్రపంచ ఆర్థికవ్యవస్థ’ ఇతివృత్తంతో తొలి జీ20 సదస్సు 2008 నవంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈసారి సదస్సుకు ఎవరెవరు వస్తున్నారు? అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యావరణ మార్పులను అడ్డుకుంటూ శుద్ధ ఇంథనం వైపు ప్రపంచ దేశాలను ఎలా నడిపించాలనే అంశంపై ప్రసంగించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. బహుళజాతి అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యం పెంపుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అంశాలపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని సమీక్షించనున్నారు. చైనా తరఫున లీ కియాంగ్ ఈసారి సదస్సులో చైనా తరఫున ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ రావట్లేదు. ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్యం లక్ష్యంగా బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. మోదీతో విడిగా భేటీ కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఢిల్లీలోని క్లారిడ్జ్ హోటల్లో ఈయన బస చేయనున్నారు. కెనడా ప్రధాని ట్రూడో రష్యాతో యుద్ధంలో తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు ఈ అంతర్జాతీయ వేదికపై ఈయన ప్రకటన చేయనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోనూ పర్యటిస్తూ ఈయన భారత్‌లో జీ20లో పాల్గొననున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలూ సదస్సులో పాల్గొంటారు. రానివారెవ్వరు ? ఆహ్వానం అందని కారణంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రావట్లేదు. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, జపాన్, ఇటలీ, జర్మనీ, ఇండోనేసియా, బ్రెజిల్, అర్జెంటీనాల అగ్రనేతలు సదస్సుకు రావట్లేదు. అతిథులు వస్తున్నారు.. అతిథి హోదాలో కొన్ని దేశాల నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఒమన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియా ఈ జాబితాలో ఉన్నాయి. శి ఖరాగ్ర సదస్సు మొదలవగానే ఈ భేటీలో అగ్రరాజ్యాధినేతలు ఏమేం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏం వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్సకతతో ఎదురుచూడటం ఖాయం. పెను వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి. సదస్సులో భాగంగా విచ్చేసే దేశాధినేతలు విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు, ఉమ్మడి ప్రణాళికలు చేసుకునేందుకు చక్కని అవకాశం దక్కనుంది. ఇది ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతో దోహదపడనుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
డెలాయిట్ రాజీనామాకు సరైన కారణాలు లేవు
న్యూఢిల్లీ: ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి డెలాయిట్ చెబుతున్న కారణాలు సహేతుకంగా, నమ్మశక్యంగా లేవని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టాక్ ఎక్సే్చంజీలకు 163 పేజీల వివరణ సమరి్పంచింది. డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్‌తో తమ నాయకత్వం నిర్వహించిన సమావేశాల్లో గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ వ్యవహారాలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అయితే, ఇతర సంస్థలన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవైనందున.. వాటిల్లో నియామకాల విషయంలో సిఫార్సులు చేయడమనేది ఆడిటర్ పరిధిలో ఉండదని డెలాయిట్‌కు తాము స్పష్టం చేసినట్లు వివరించింది. ఆడిటర్‌గా కొనసాగేందుకు డెలాయిట్ ఇష్టపడకపోవడం వల్ల సామరస్యంగా క్లయిట్–ఆడిటర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపింది. డెలాయిట్ రాజీనామా వల్ల ఆరి్థక ఫలితాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి కొన్ని లావాదేవీలపై డెలాయిట్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌లోని ఇతరత్రా సంస్థలకు తాము అధికారిక ఆడిటర్లుగా లేనందున తక్షణం ఏపీసెజ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆగస్టు 12న ప్రకటించింది. దీంతో ఏపీసెజ్ ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్‌ను ఆడిటర్‌గా నియమించుకుంది. -
నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 45 శాతం పెన్షన్? ఆర్థిక శాఖ వివరణ
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కింద వారు ఉద్యోగ విరమణకు మందు చివరిగా అందుకున్న వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ఒక కమిటీ చర్చిస్తోందని, ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పేర్కొంది. ఎన్పీఎస్ కింద ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పెన్షన్ ఖచ్చితమైన శాతం గురించి పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. ‘గత బడ్జెట్ సెషన్లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ, ప్రస్తుతం చర్చల స్థితిలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదు’ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత వారి చివరి వేతనంలో కనీసం 40 నుంచి 45 శాతం పెన్షన్ వచ్చేలా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం సవరించాలని భావిస్తోందంటూ రాయిటర్స్ కథనం వెలువరించింది. This is in reference to a news report carried in various news papers, purporting to give details of certain specific percentage of pension being proposed by the Government for the employees under National Pension System #NPS. This news report is false. The Committee, set up… — Ministry of Finance (@FinMinIndia) June 22, 2023 ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
karnataka assembly election 2023: ప్రధాని విషసర్పం.. తాకితే అంతే
యశవంతపుర: ప్రధాని మోదీ విష సర్పమని, తాకినవారు మరణిస్తారని చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వెనక్కి తగ్గారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలనుద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. అసలేం జరిగింది? సొంత రాష్ట్రం కర్ణాటకలో ప్రచారంలో భాగంగా గురువారం గదగ జిల్లాలోని రాన్ నియోజకవర్గ పరిధిలోని గజేంద్రగడలో పార్టీ ప్రచార సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు. ‘ పొరపాటు చేయకండి. జాగ్రత్త. ప్రధాని మోదీ విషసర్పం లాంటి వ్యక్తి. మరీ అంత విషతుల్యం కాదంటారా.. అయితే ఒకసారి తాకి చూడండి. మరణం తథ్యం. శాశ్వత నిద్రలోకి జారుకుంటారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ అవినీతి పాలన అందించిన బీజేపీ నాయకులను మోదీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మోదీ ముఖం చూసి ఓటు వేసే కాలం పోయింది’ అని అన్నారు. ప్రధానిని విషసర్పంతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వెంటనే హావేరి సభలో ప్రసంగిస్తూ ఖర్గే వివరణ ఇచ్చారు. ‘బీజేపీ పార్టీ ఒక విషసర్పం అనేదే నా ఉద్దేశం. ఆ పార్టీ సిద్ధాంతం విషతుల్యం. ఆ సిద్ధాంతాలను ఆచరిస్తే అంతమైనట్లే ఇక అనే ఉద్దేశంలో మాట్లాడాను’ అని వివరించారు. -
మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి కలెక్టర్ వివరణ
-
నచ్చనంత మాత్రాన విమర్శిస్తారా?
‘‘నటిగా నేను ఎంచు కున్న జీవితం ప్రత్యేకమైనది. ఇక్కడ (ఇండస్ట్రీ) ఉన్న ప్రతి ఒక్కర్నీ అందరూ ఇష్టపడతారని కచ్చితంగా అనుకోను. నేను మీకు (విమర్శిస్తున్నవారిని ఉద్దేశించి) నచ్చనంత మాత్రాన మీరు నాపై విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రతిరోజూ కష్టపడి పని (సినిమాలు) చేయడం మాత్రమే నాకు తెలుసు. నా పని వల్ల మీరు ఆనందపడితే నాకు అదే చాలు’’ అని రష్మికా మందన్నా అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక ఈ విధంగా షేర్ చేశారు. ‘‘కొన్నేళ్లుగా రెండు విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయాల్సింది. నటిగా నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి చాలామంది నన్ను ద్వేషిస్తున్నారు. విమర్శలు, నెగటివిటీ ఈ రెండు విషయాలతో ఇబ్బందిపెడుతున్నారు. ప్రతికూలత, ద్వేషం వల్ల ఉపయోగం ఏంటి? నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నన్ను చాలా నిరుత్సాహపరుస్తోంది. అవి చదివినప్పుడు నా హృదయం పగిలిపోతోంది. కొన్ని ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన కొన్ని విషయాలు తప్పుగా రీచ్ అయ్యి.. నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించాను. ఇంటర్నెట్లో వస్తోన్న తప్పుడు కథనాలు ఇటు పరిశ్రమలో అటు బయట నాకున్న మంచి రిలేషన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. నాతో పాటు నా సహచరులు కూడా ఇబ్బందిపడుతున్నారు. నన్ను నేను మెరుగుపరచుకోడానికి ఉపయోగపడే సద్విమర్శలను స్వాగతిస్తాను. నాపై వస్తున్న విమర్శలను ఎత్తి చూపడం ద్వారా నేను ఎవరిపైనో గెలవడానికి ప్రయత్నించడం లేదు. అలాగే నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నేను మారాలనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్నవారిపై నాకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. మీరందరూ నాపై చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్ నన్ను ముందుకు నడుపుతున్నాయి. ఇదిగో ఇలా అందరికీ నా మనసులోని మాటలను చెప్పే ధైర్యాన్ని నాకు ఇచ్చింది అవే. అందరం అందరికీ మంచి చేసేలా కృషి చేద్దాం’’ అని పోస్ట్ చేశారు రష్మిక. -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్‌వైడ్‌గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్‌కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్‌తో దర్శనమిచ్చి వైరల్‌గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్‌తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్‌వైడ్‌గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్‌తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్‌లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్‌లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
పోలవరంపై కీలక వివరణ ఇచ్చిన షెకావత్
-
Agnipath Scheme: అనుమానాలు, వివరణలు
అగ్నిపథ్ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం... ► 17.5 నుంచి 21 ఏళ్ల వారిని సైన్యంలోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత 75% మందిని వెనక్కు పంపుతారు. పెన్షనూ ఉండదు. అప్పుడు భవిష్యత్ అగమ్యగోచరం కాదా? అగ్నివీరుల భవిష్యత్తుకు ఢోకా లేదు. రిటైరయేప్పుడు సేవానిధి ప్యాకేజీ కింద ఆదాయ పన్ను మినహాయింపుతో రూ.11.71 లక్షలిస్తారు. దానికి తోడు వ్యాపారాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. పన్నెండో తరగతితో సమానమైన సర్టిఫికెట్ ఇస్తారు. సైన్యంలో అనుభవంతో తేలిగ్గా ఇతర ఉద్యోగాలు లభిస్తాయి. పైగా రక్షణ శాఖ నియామకాలతో పాటు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్ నియామకాల్లోనూ వారికి 10 శాతం కోటా ఉంటుంది. పలు రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లోనూ ప్రాధాన్యముంటుంది. ► కేవలం నాలుగేళ్ల సర్వీస్ కోసం ఎవరైనా ఎందుకు అంతగా కష్టపడతారు? అగ్నిపథ్ ఒక అవకాశాల నిధి. దేశంలో 14 లక్షల మంది సైనికులున్నారు. వీరిలో ఏటా 60 వేల మంది రిటైరవుతారు. అగ్నిపథ్‌లో భాగంగా ఖాళీల కంటే 75 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. అంటే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయి. ఆర్మీ శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. జీవితాన్ని నచ్చినట్టుగా మలచుకునే అవకాశముంటుంది. ► నాలుగేళ్లకే ఉద్యోగం కోల్పోతే యువత అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదముంది. ఒక్కసారి యూనిఫాం ధరిస్తే అలా ఎప్పటికీ మారరు. నియమబద్ధమైన జీవితం గడుపుతారు. ► రిటైర్డ్ సైనికాధికారులు తదితరులతో సంప్రదింపులు జరపకుండా హడావుడిగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారు. వారితో రెండేళ్లు విస్తృతంగా సంప్రదింపులు జరిపాకే తీసుకువచ్చాం. దీనితో ఎన్నో లాభాలంటూ మాజీ అధికారులు స్వాగతించారు. ► బలగాల సామర్థ్యాన్ని పథకం దెబ్బ తీస్తుంది. స్వల్పకాలిక సర్వీసు కోసం సైన్యంలో నియామకాలు చేపడుతున్న దేశాలెన్నో ఉన్నాయి. భారత్ కూడా అలాగే ముందుకెళ్లాలి. ప్రతి 100 మందిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పర్మనెంట్ అవుతారు. వారు దేశ రక్షణకు కోటగోడలా మారతారు. ► 21 ఏళ్ల వయసులో మానసిక పరిపక్వత ఉండదు. నమ్మకంగా పని చేయలేరు. ఎన్నో దేశాలు యువ రక్తాన్నే సైన్యంలోకి తీసుకుంటున్నాయి. ఉడుకు రక్తం ఉన్నప్పుడే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కరోనా వల్ల రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టలేదు గనుక ఈ ఏడాదికి వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాం. యువత, అనుభవజ్ఞులు సగం సగం ఉండేలా చూస్తాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎం పీ రఘురామకృష్ణరాజు అనర్హత వేటుపై స్పీకర్ ను వివరణ అడిగిన సాక్షి టీవీ
-
విధి లేకపోతేనే విదేశాల్లో ఐపీఎల్
న్యూఢిల్లీ: భారత్‌లో ఐపీఎల్ టి20 టోర్నీ నిర్వహణకు ఏమాత్రం అవకాశమున్నా ఇక్కడే నిర్వహిస్తామని... ఏ దారీ లేకపోతేనే చివరి ప్రత్యామ్నాయంగా విదేశీ గడ్డ గురించి ఆలోచిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. భారత్‌లో రోజురోజుకీ కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఈ సీజన్ విదేశాల్లోనే జరిగే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై ధుమాల్ తాజాగా వివరణ ఇచ్చారు. బోర్డు ప్రాధాన్యం సొంతగడ్డపైనే అని విధిలేని పరిస్థితుల్లోనే విదేశీ వేదికను ఎంపిక చేస్తామన్నారు. ‘తదుపరి ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా వేదికపైనే చర్చిస్తాం. మా తొలి ప్రాధాన్యత భారత్‌కే. విదేశాల్లో నిర్వహణ అనేది ఆఖరి ప్రత్యామ్నాయం మాత్రమే’ అని ధుమాల్ అన్నారు. 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐపీఎల్–2ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈసారి టోర్నీ గనక జరగకపోతే బోర్డుకు రూ. 4 వేల కోట్ల నష్టం వస్తుంది. అందుకే ఇంట అయినా.... బయటైనా ఈ సీజన్‌ను నిర్వహించాలనే లక్ష్యంతో బోర్డు ఉంది. -
నేను చేసిన తప్పేంటో వెతుకుతున్నా
న్యూఢిల్లీ: భారత మహిళల రెజ్లింగ్ కోచ్ పదవి నుంచి తనను తప్పించడానికి గల కారణమేమిటో తనకు ఇంకా అంతుపట్టడం లేదని ఆండ్రూ కుక్ పేర్కొన్నాడు. రెప్పపాటులో మొత్తం మారిపోయిందని అతనన్నాడు. ఈ చర్య ద్వారా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తనకు తీరని నష్టం చేసిందని కుక్ ఆరోపించాడు. ఆన్లైన్ సెషన్లకు కుక్ గైర్హాజరు కావడంతోనే అతన్ని కోచ్ పదవి నుంచి తప్పించినట్లు డబ్ల్యూఎఫ్ఐ పేర్కొనగా... ఆ సెషన్ కోసం తాను ఉదయం 3 గంటలకే నిద్రలేచి సిద్ధంగా ఉన్నట్లు ఆండ్రూ కుక్ వెల్లడించాడు. కరోనా నేపథ్యంలో స్వదేశం అమెరికా వెళ్లిన కుక్ భారత రెజ్లర్ల కోసం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నానని తెలిపాడు. ‘భారత్ నన్ను పూర్తిగా దెబ్బతీసింది. మళ్లీ నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురుకావొద్దని కోరుకుంటున్నా. నిజంగా అసలేం జరిగిందో నాకు తెలియదు. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు. ఆన్లైన్ తరగతుల కోసం నేను ఉదయం 3 గంటల సమయంలోనూ అందుబాటులో ఉన్నా. ఆ సెషన్‌కు రెజ్లర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇంత చేసినా నన్ను పదవి నుంచి తప్పించినట్లు మీడియాలో చూసి తెలుసుకున్నా. ఇప్పటికీ సాయ్, డబ్ల్యూఎఫ్ఐ నుంచి నాకు అధికారికంగా ఎలాంటి సందేశం రాలేదు. చాలా నిరాశగా ఉంది’ అని కుక్ వివరించాడు. -
కాస్త జలుబు చేసిందంతే
ఆక్లాండ్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త జలుబు చేసినా సరే నానా హైరానా పడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి న్యూజిలాండ్ పేస్ బౌలర్ లోకీ ఫెర్గూసన్‌కు కూడా ఎదురైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో తొలి వన్డే ఆడిన తర్వాత అతనికి కొంత అనారోగ్యంగా కనిపించడంతో కివీస్ బోర్డు వెంటనే స్పందించింది. కరోనా వైరస్‌కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్ రూమ్‌లోనే ఉండాలని నిర్బంధించింది. శనివారం అతని రిపోర్ట్లు నెగెటివ్‌గా రావడంతో ఊపిరి పీల్చుకొని ఫెర్గూసన్ ఆక్లాండ్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. దీనిపై అతను స్పందిస్తూ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు. కరోనా విషయంలో అతి చేసినట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు. ‘నా ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందారు. నేను బాగానే ఉన్నానని వారందరికీ సమాధానమిచ్చా. నాకు కాస్త జలుబు చేసిందంతే. అంతకుమించి ఏమీ కాలేదు. టీమ్ వైద్యులు నిబంధనలు అమలు చేశారు కాబట్టి అర్థం చేసుకోగలను. కానీ మొత్తంగా చూస్తే అంతా అతి చేసినట్లు అనిపిస్తోంది.’ అని ఫెర్గూసన్ అన్నాడు. మరోవైపు కరోనా కారణంగా మరో రెండు క్రికెట్ ఈవెంట్లు రద్దయ్యాయి. జింబాబ్వేలో పర్యటిస్తోన్న ఇంగ్లండ్ కౌంటీ జట్టు డెర్బీషైర్ టూర్‌ను రద్దు చేసుకొని ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ చివరి రౌండ్ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి. -
పౌరసత్వంపై ఆందోళన వద్దు!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో చట్టంలో పొందుపర్చిన పౌరసత్వం నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. జూలై 1, 1987న లేదా ఆ లోపు భారత్‌లో జన్మించిన వారు సహజంగానే భారతీయ పౌరులవుతారని తెలిపింది. అలాగే, ఆ తేదీ(జూలై 1, 1987)లోపు వారి తల్లిదండ్రులు భారత్‌లో జన్మించినట్లైనా కానీ ఆ పిల్లలు చట్టప్రకారం భారతీయ పౌరులేనన్నారు. సీఏఏపై, ఎన్నార్సీపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అస్సాం విషయంలో ఈ కటాఫ్ 1971వ సంవత్సరంగా ఉంటుందన్నారు. ï పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం, జూలై 1, 1950 – డిసెంబర్ 3, 2004 మధ్య భారత్‌లో జన్మించిన వారు పౌరసత్వానికి అర్హులు. అలాగే, పిల్లలు జన్మించిన సమయంలో తల్లిదండుల్లో ఏ ఒకరైనా భారతీయ పౌరుడైతే.. ఆ పిల్లలు కూడా ఇక్కడి పౌరులవుతారు. డిసెంబర్ 10, 1992– డిసెంబర్ 3, 2004 మధ్య భారత్‌కు వెలుపల జన్మించిన వారి తల్లిదండ్రులకు భారత పౌరసత్వం ఉంటే.. ఆ పిల్లలను కూడా ఇక్కడివారిగా పరిగణిస్తారు. -
ఆర్బీఐ సొమ్ము కోరలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ మిగులు నిల్వల నుంచి రూ 3.6 లక్షల కోట్లు బదిలీ చేయాలని ప్రభుత్వం కోరుతోందన్న వార్తలను కేంద్రం శుక్రవారం తోసిపుచ్చింది. ఆర్బీఐ నిల్వల నుంచి సొమ్మును తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని సాగుతున్న ప్రచారం నిరాధారమని, ఇవి కేవలం ఊహాగానాలేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆర్బీఐ నిల్వలను బదిలిచేయాలన్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆర్బీఐ కోసం తగిన ఆర్థిక మూలధన కార్యాచరణ కసరత్తు కేవలం ప్రతిపాదన దశలో ఉందని తెలిపారు. ప్రభుత్వం ద్రవ్య లోటును 5.1 శాతం నుంచి విజయవంతంగా నియంత్రిస్తూ వస్తోందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గిస్తామన్నారు. కాగా ఆర్బీఐ వద్దనున్న రూ 9.59 లక్షల కోట్ల నుంచి రూ 3.6 లక్షల కోట్లను బదలాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనే ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభనకు కేంద్రబిందువని ఓ వర్గం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవస్ధలను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలతో విరుచకుపడింది. -
రాఫెల్ వివాదం: రిలయన్స్ ఎంపికపై దసాల్ట్ వివరణ
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందాన్ని సొంతం చేసుకునేందుకే రిలయన్స్ డిఫెన్స్‌ను వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్ ఏవియేషన్ గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌కు చెందిన రిలయన్స్ గ్రూప్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నామని, 2017, ఫిబ్రవరి 10న దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ ఏర్పాటైందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్-ఫ్రాన్స్‌ల మధ్య 2016 సెప్టెంబర్‌లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగానే దసాల్ట్ ఏవియేషన్ భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించిందని ప్రకటన పునరుద్ఘాటించింది. బీటీఎస్ఎల్, కైనెటిక్, మహింద్రా, మైని, శాంటెల్ వంటి వంద సంస్ధలతో వ్యాపార భాగస్వామ్యాలు కుదర్చుకున్నామని కూడా దసాల్ట్ వివరించింది. రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును దక్కించుకునేందుకు అనివార్యంగానే రిలయన్స్ డిఫెన్స్‌తో డీల్‌కు సంస్థ సంతకం చేసిందని కంపెనీ అంతర్గత నివేదిక పేర్కొందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ దసాల్ట్ ఏవియేషన్ తాజా వివరణతో ముందుకొచ్చింది. రూ 60,000 కోట్ల రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన ప్రకటనతో పెనువివాదంలో కూరుకుపోయింది. భారత్ ఒత్తిడి మేరకే రిలయన్స్ డిఫెన్స్‌ను ఒప్పందంలో భాగస్వామిగా చేర్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
గోల్డ్ ది గ్రేట్
నా పేరు శ్యామ్ సుందరం అండీ. నా భార్య నన్ను అందంగా శ్యామ్ అని పిలుచుకుంటుందండీ. అయితే ఇప్పుడు నేను నా గురించో, నా భార్య గురించో చెప్పబోవడం లేదు. నా కుక్క గురించే చెప్పాలనుకుంటున్నానండీ. కుక్కే గాని కుక్క అనడం నాకిష్టం లేదనుకోండి. మీకందరికీ అలా ముందు ముందుగా ఆ ముక్కేదో చెప్పేస్తే తర్వాత్తర్వాత అలా అనకపోయినా పర్లేదని అనేశానన్నమాట. వాడికో పేరుందండి. దటీజ్ గోల్డీ అండి. వాడని ఎందుకన్నానంటేనండి, వాడు వాడు కాబట్టి. అది కాదు కాబట్టి అని మీకు మనవి చేసుకోవాలనే ఈ కాస్త వివరణ. సుత్తి లేకుండా సూటిగా విషయానికొచ్చేస్తానండి. మా గోల్డీ గాడు నన్ను వదిలి పారిపోయాడండి. నన్ను ఒంటరోణ్ణి చేసి అకస్మాత్తుగా ఎటో మాయమైపోయాడండి. కారణం చిన్నదేనండి. కానీ దానికి ముందు మేటర్ మాత్రం చాలా పెద్దదే వుందండి. మీతో నా బాధ పంచుకోవాలని నా ఆరాటం. సాక్షాత్తు కన్న కొడుకు ఇంటి నుంచి పారిపోయినట్టనిపిస్తోందండి. గోల్డీ కేవలం ఒక కుక్క కాదు సార్. నా ప్రాణం. నా కుటుంబ సభ్యులతో కంటే, వాడితో నేను, నాతో వాడు గడిపిన క్షణాలే ఎక్కువ. వాడు నాకు దొరకడమే ఓ విచిత్రం. మార్నింగ్ వాకింగ్‌లో రోజూ కూడా నడిచేవాడు. మేం గవర్నమెంట్ క్వార్టర్స్‌లో వుంటాం. రాత్రిపూట మా క్వార్టర్ ముందే పడుకునే వాడు. పొద్దునే వాకింగ్ కోసం నేను తలుపులు తీయగానే పటపటా వొళ్ళు దులుపుకుని రెడీ అయిపోయేవాడు.పొద్దున్నే కుక్క మొహం చూడ్డం ఏంట్రా బాబూ అనుకుని ఛీ అని విదిలించేవాణ్ణి. కొన్ని బంధాలు అంత తేలిగ్గా వదిలించుకోలేం. వాడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా నా వెంటే నడిచేవాడు. కొన్నాళ్ళకి మేం వేరే క్వార్టర్‌కి మారినప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ తినేవాడో ఏమో! అప్పుడిక అనుకున్నాను, వీడికీ నాకూ ఎక్కడో లింకుందని. మా ఆవిడతో చెప్తే అన్నం పెట్టడం మొదలుపెట్టింది. వాడు ఇక మా ఇంట్లోకి రావడం మొదలుపెట్టాడు. అయినా ఆ హిస్టరీ అంతా ఇప్పుడెందుకులెండి. ‘వాడిని ఈ మధ్య గొలుసు వేసి తిప్పుతున్నారే. ఎలా పోయాడు?’ అంటున్నారంతా. విషయం గొలుసు కాదు. నిజమే! ఇంతకుముందు గొలుసు లేకుండా వదిలేసేవాళ్ళం. ఈ మధ్యనే గొలుసు వేసి బంధించడం మొదలుపెట్టాం. అలవాటు లేని కట్టడి. నచ్చి వుండక పోవచ్చు. కానీ కారణం అది కాదనుకోండి. ఏదో చిన్న తప్పు చేశాను. దానికింత పెద్ద శిక్ష వేశాడు వాడు. బంధమే తెంచుకుని పోయాడు. నాతో ఉన్న బంధాన్ని తెంచుకుని పోయాడు. ఆగండి కొంచెం. కన్నీళ్ళొస్తున్నాయి.ఏమిటో నేనేదో నా కడుపులో దు:ఖం మీతో చెప్పుకుంటున్నా కదా! కాసేపు ఆగొచ్చుగా వెదవ కన్నీరు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పొంగాలో తెలీదు. అదిగో ఆ సిమెంటు దిమ్మ మీద కాసేపు కూచుంటాను. హమ్మయ్య కూచున్నాన్లెండి. ఇక్కడ నేను కూర్చున్నప్పుడల్లా ఎగిరి గంతేసి పక్కనే కూర్చునేవాడు మా గోల్డీ. ఇంకెవరి కుక్కయినా నా దగ్గరకొచ్చి ముద్దు చేయించుకుంటే నా సామిరంగా ఇక ఎటాకే అన్నమాట. కుళ్ళుమోతోడు. నేనెవరినీ ముద్దు చేయకూడదు వాణ్ణి తప్ప. నేను లేకపోతే హాయిగా కాలనీలో కుక్కలతో బాగానే ఆడుకుంటాడు. సర్లెండి. ఆ సోదంతా ఎందుకు గాని. బంధాలు మక్కువే కాని బంధనాలు ఎవరికిష్టం వుంటాయి చెప్పండి? కానీ మా గోల్డీ గాడు మాత్రం నా బంధం తెంచుకుపోయింది గొలుసు గురించి కాదు. వాడికీ నాకు చాలా ఇష్యూస్ వున్నాయి.మీరలా నవ్వక్కర్లేదండోయ్. ఏదో పెళ్లాంతో, పిల్లలతో వున్నట్టు ఒక కుక్కతో ఇష్యూసేంటండీ అని పగలబడుతున్నారు కదా! నేనూహించగలను. నవ్వుకుంటే నవ్వుకోండి. ఇంతకీ గొలుసు ఎందుకేసేనో ముందు చెప్తాను. వీధిలో వదిలితే బయటి కుక్కలన్నీ వాడి మీదే ఎగబడతాయి. అయితే మీరనుకున్నట్టు కుక్కలన్నీ మీదపడి కరుస్తాయని కాదు గొలుసు వేసింది. మేటర్ వేరే వుంది. కుక్కలన్నీ మా వాడంటే ఇష్టపడుతున్నాయి. ఆడ కుక్కలు ఇష్టపడితే సరే. మగ కుక్కలు కూడా వెనకపడతాయి. మా వాడి రంగు బంగారంలా మెరిసిపోతుంది. వాడి పేరు గోల్డీ అని పెట్టడానికి కారణం అదే. వాడంటే కుక్కలకు అట్రాక్షన్ వెనక కారణం కూడా అదే. అందుకే గొలుసు వేయాల్సి వచ్చింది.‘ఏమిటీ.. గొలుసు వేయడం దేనికి? హాయిగా ఎంజాయ్ చేయనివ్వొచ్చు కదా!’ అంటారా? నా పాయింట్ అది కాదండి బాబూ.అందులో నాకిష్టం లేని కుక్క ఒకటి వుంది. దాని మీదే మా వాడు మనసు పారేసుకున్నాడు. ఏమిటీ పిచ్చి మాటలని కొట్టి పారేయకండి. నిజంగా ఆ కర్రి కుక్క మీద మా వాడికి పిచ్చే పట్టింది. అది బక్కగా ఎండు కట్టెలా వుంటుంది. పైగా మచ్చలు మచ్చలు. ఛీ ఒకటే రోతగా వుంటుంది. ఎంత కొట్టినా అది మా ఇంటి చుట్టే తిరుగుతుంది. ‘నిను వీడని నీడను నేనే’ అని పాట పాడుతుందేమో. అంతే అది మా గోల్డీ గాడికి తెలిసిపోతుంది. ఇక ఒక్కసారిగా పైకి లేస్తాడు. నన్ను అదోలా చూస్తాడు. వాడెప్పుడు ఎలా చూస్తాడో నాకు తెలుసు. నా ప్రేయసితో నన్నెన్నాళ్ళు దూరంగా వుంచుతావో నేనూ చూస్తా అన్నట్టు వుంటాయి వాడి చూపులు. ఏమాత్రం వీలు దొరికిందా ఇంక దానితోనే షికార్లు. మా గోల్డీ తక్కువోడు కాదు సార్. మహా ముదురు నా కొడుకు. అదంటే నాకు ఇష్టముండదని వీడికి తెలుసు కదా, నేను పక్కనున్నప్పుడు మాత్రం అది పక్కకొస్తే దాన్ని దూరంగా అరిచి తరిమేస్తాడు. అబ్బే మా మధ్య ఏమీ లేదు అని చెప్పడానికన్నమాట. వాళ్ళిద్దరూ కలుసుకునే రహస్య స్థావరాలు వేరే వున్నాయి లెండి.‘ఏమైందండీ తిరిగితే?’ అంటారు మీరు. ఎదుటివాళ్ళకయితే ఎన్నయినా చెప్తాం లెండి. మా పక్క క్వార్టర్లో సుధాకర్ గారు పెంచుకుంటున్నారే, ఆ తెల్లబొచ్చు తింగరి బుచ్చితో తిరగొచ్చు కదా. అబ్బే అదంటేనే గిట్టదు. అది దగ్గరికొస్తే చాలు భయంకరంగా అరుస్తుంది. పాపం దానికేమో వీడి మీద మోజు. ఏంట్రా చిన్నా ఆ కర్రి దాంతో ఎందుకురా? ఈ తెల్లదానితో జతకట్టరా అన్నాను. దానికి మావోడేమన్నాడో తెలుసా? చెప్తాను జస్ట్ వెయిట్. ప్లీజ్ లెట్ మీ టేక్ సమ్ బ్రేక్. మీరు కూడా కాస్త రిలాక్సవ్వండి. ఆ.. ఎక్కడున్నాను? ఓకే. నేనూ మా గోల్డీ ఏ భాషలో మాట్లాడుకున్నామో సెలవివ్వండని మీరు ఏమైనా వ్యంగ్యం పోవాలనుకుంటున్నారా? మీకేం తెలుసండి బాబూ. అందరికీ అన్ని భాషలుంటాయి. మా ఇద్దరికీ అర్థమయ్యే భాష ఒకటుంది. అది చెవులు కదిపితే ఏమంటుందో, తోక అదే పనిగా ఊపితే ఏమంటుందో, కళ్ళు కుడివైపు తిప్పితే అర్థమేంటో, ఎడమ వైపు తిప్పితే అర్థమేంటో, తన చుట్టూ తాను తిరుగుతున్నట్టే తిరుగుతూ నా వైపు చూస్తే అర్థమేంటో, ఎప్పుడు మొరుగుతుందో, ఎప్పుడు మూలుగుతుందో అన్నీ నాకు తెలుసు. రాత్రి నేను చాలాసేపు చదువుకుంటూ వుంటాను. వాడు నన్ను చదువుతూ వుంటాడు. నా ప్రతి కదలికా వాడికి క్షుణ్ణంగా తెలుసు. పడుకున్నట్టే వుంటాడు కానీ కళ్ళు మూసినా తెరిచినా వాడి పరిశోధనాంశం నేనే. చెప్పాల్సిందేమంటే నా భాషని మా గోల్డీ బాగా నేర్చుకున్నాడు. సరే విషయానికొస్తాను. మా గోల్డీ ఏమన్నాడంటే...‘మీలా అన్ని రంగులు మాకు తెలీదు. కాబట్టి రంగు భేదం పాటించడం మా జాతికి తెలియని విషయం.’ అని తేల్చి చెప్పాడు. అబ్బా చెంప మీద కొట్టినట్టనిపించిందండి. వాడు ఏ అంగ విన్యాసంతో ఈ మాట చెప్పాడని మీరు వంకర్లు పోతూ అడగక్కర్లేదులెండి. ప్రతీదీ అవయవాలతోనే చెప్పాలా? వాడి చూపులు చాలు. చూడబోతే మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ తెలివి తేటలున్నాయని నేను చెప్పబోతున్నట్టుగా మీరు నిర్ధారించుకుంటే మీరు జ్ఞానవంతులే. పదివేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ మనుషుల కంటే వాసన చూసే శక్తి కుక్కలకు వుంటుందని తెలుసుకుని మా గోల్డీగాణ్ణి ఒక గ్రహాంతర వాసిలా చూడ్డం మొదలుపెట్టాను. వాడి పుణ్యమా అని కుక్కల గురించి చాలా చాలా చదివేశాను. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సెన్సరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ జేమ్స్ వాకర్ వారి బృందం చేసిన పరిశోధనలు చూస్తే మతిపోయింది. అంతెందుకు చెప్పండి. అలెగ్జాండ్రా హోరోవిట్జ్ అనే ఆవిడ రాసిన ‘ఇన్ సైడ్ ఆఫ్ ఏ డాగ్’ అనే పుస్తకం ఒకటి చాలు. ఆ లెక్కకొస్తే మా గోల్డీ ప్రపంచంలోనే అత్యున్నత మేలు జాతి శునకాల కంటే మేలైన మేధస్సు ఉన్నవాడని నేను ఢంకా భజాయించి చెప్పగలను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను చాలు.మా ఇంటికి ఒకసారి ఎవరైనా కొత్తగా వస్తే గోల్డీ మొరుగుతాడు. మళ్లీ వస్తే మొరగడు. ఓహో కొత్త వాళ్ళొస్తే మొరుగుతాడు కదా అనుకున్నాం. ఒకసారి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. మొరగలేదు.ఆశ్చర్యపోయాం. తీరా ఆరా తీస్తే ఆ వచ్చిన వ్యక్తి ఇంతకు ముందు వచ్చిన వ్యక్తికి పరిచయమున్న వాడు. అంటే ఒక మనిషి నుంచి ఆ మనిషికి సంబంధించిన మనుషుల వాసన కూడా పసిగట్టాడన్న మాట. కుక్కల్ని కొట్టేవాళ్ళు ఎవరైనా రోజూ వచ్చినా రోజూ మొరుగుతాడు. అదేమిటబ్బా అని ఆరా తీస్తే వాళ్ళకి కుక్కలంటే పడదని తెలిసింది. అందుకే మా గోల్డీకి వాళ్ళంటే పడదు. ఇంతకీ ఆ నల్ల కుక్క దగ్గరకి మా గోల్డీని పోనివ్వటం లేదని మా మీద అలిగి వాడు ఆ కర్రిదాన్ని లేపుకు పోయాడని మీరు డౌటుపడితే, మహాప్రభో అదేం కాదు. వాడి ఇష్టానికి అనుగుణంగా అప్పుడప్పుడూ వదిలేస్తాను కదా, అందుకు వాడికి నేనంటే కాస్త కృతజ్ఞతాభావం వుందండోయ్. మరేమైంది? అని మీరు విసుక్కోవద్దు. కొంచెం శాంతం కావాలి మరి.మనం మనుషులం. మన పద్ధతుల్లోనే వాటిని పెంచుతాం.మన పద్ధతులు వాటికి నచ్చవు. వేరే కుక్కలు చెప్తాయో లేదో కాని, మా వాడు మాత్రం అన్ని సందర్భాల్లో తన నిరసన వ్యక్తం చేసేవాడు. మా గోల్డీ మనిషై వుంటే, వాడిని మించిన విప్లవకారుడు మరొకడు వుండే వాడు కాదనిపించేది చాలాసార్లు. మనం రా ఫుడ్ తినం. జంతువులకు రా ఫుడ్ ఇష్టం. మాంసం తెచ్చి నూనె వేసి ఉప్పూ కారం మసాలాలు దట్టించి వండుకుంటాం. వాడికి కూడా అలాగే పెడతాం.మొదట్లో చాలా ప్రొటెస్ట్ చేశాడు. కానీ తప్పక అదే తినడం అలవాటు చేసుకున్నాడు.‘ప్రకృతిలోంచి వచ్చి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నార్రా! మీరు చెడితే చెడిపోయారు. ప్రకృతిలో భాగంగా బతికే మాలాంటి ప్రాణుల్ని కూడా ఎందుకు చెడగొడతార్రా బాబూ’ అని కొంచెం మందలించేవాడు. అబ్బే! మనమెందుకు వింటాం. మా అలవాట్లే వాడి మీద రుద్దాం. మా ఆహారం మీద మీ ఆంక్షలేంటి అని మనం ఇంకెవర్నో తిట్టుకుంటున్నామే. జంతువులు కూడా మనుషుల్ని అలాగే తిట్టుకుంటాయని మా గోల్డీ చాలాసార్లు చెప్పాడు. నిజమే అనుకున్నా గాని వాడి మాట మాత్రం ఎప్పుడూ వినలేదు. వాడికి మాలాగే రుచిగా పెట్టాలని మా కోరిక. రుచికి మించిన శత్రువు లేడని వాడి హెచ్చరిక. అందుకే వాడిని అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరకి తీసుకుపోవడం, అరుగుదలకి, వగైరా వగైరా జబ్బులకు మందులు వాడటం చేస్తుంటాం.వాడు నవ్వుకుంటాడు. ఎందుకురా నవ్వుతావంటే, ‘నాయాళ్ళారా మీ అజ్ఞానంతో పాటు మీ అభిరుచులతో నన్ను కూడా రోగిష్టి వాడిని చేసేశారు కదా’ అని వాడి కంటెన్షన్.ఆగండాగండి. మా వాడు మా అభిమానం, ప్రేమ తట్టుకోలేక, దానిమూలంగా ఆసుపత్రుల చుట్టూ తిరగలేక పారిపోయాడని మీరనబోతున్నారు అంతేగా. అయితే మీరు దాల్ మే లెగ్గేసినట్టే. మా వాడు అంత డెలికేట్ డెసిషన్స్ తీసుకునే సెన్సిబుల్ కాదు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ఫ్రెండ్ మా గోల్డీ. ఏంటి.. సస్పెన్స్‌లో పెట్టి చంపేస్తున్నానంటారా? అలాంటి ఉద్దేశాలేమీ లేవు. మా గోల్డీకి సంబంధించిన పూర్తి సమాచారం మీకందితే, మీరెక్కడ ఉన్నా ఓ చేయి నా భుజం మీద వేసి ఓదారుస్తారనే. అసలేం జరిగిందంటే.. నా ప్రేమని వాడు భరించలేని స్థితికి వచ్చే పని ఒకటి చేశాను. అదే.. అదే వాడు నానుంచి దూరమయ్యేలా చేసింది. ఎంత మంచి వాడు, నా అత్యుత్సాహంతో నేనే వాడిని దూరం చేసుకున్నాను. నేను ఏం చెప్పినా చేస్తాడు. మా అలవాట్లు తెలుసుకుంటాడు. వాటిని నచ్చకపోయినా భరిస్తాడు. నేనే రెండుమూడు సార్లు వాణ్ణి కొట్టాను. అసహ్యించుకున్నాను. అయినా వాడు మాత్రం నా కోపం పోయిందని తెలుసుకున్నాక వచ్చి మెల్లిగా వొళ్లో వాలిపోయేవాడు. వాడికి వారానికి రెండుసార్లు స్నానం చేయిస్తాం. వాడి షాంపూ, సబ్బు, డియోడరెంట్ అన్నీ సెపరేట్. స్నానం చేయించిన తర్వాత మా గోల్డీ గాడి బొచ్చు చూడాలండీ. బంగారానిక్కూడా కుళ్ళేసుకొస్తుందంటే నమ్మండి. దాని వొంటి మీద ఒకసారి చేయి వేసి నిమిరితే జన్మజన్మాంతరాల స్పర్శానుభవం పొందినట్టే అనిపించేది. కానీ చాలాసార్లు స్నానం చేయించిన రోజే వాడు ఏదో బురదలోనో, మట్టిలోనో కసిదీరా దొర్లిదొర్లి వచ్చేవాడు. పోనీలే ఆడుకుంటాడు కదా అని వదిలేస్తే వాడు చేసే ఘనకార్యం ఇది. నాకు కోపం ముంచుకొచ్చి కర్ర తీసుకుని కొట్టేవాణ్ణి. దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు. బయటే పెట్టి తలుపు పెట్టేసేవాణ్ణి. పాపం వాడు మాత్రం తలుపుకు ఆనుకుని అక్కడే పడుకునే వాడు. ఎప్పుడో జాలి పుట్టి ఏ బట్టో తీసుకుని వాడి వొళ్లంతా దులిపి అప్పుడు ఇంట్లోకి రానిచ్చేవాణ్ణి. దగ్గరకొచ్చి నా కళ్ళలోకి కళ్లు పెట్టి అలాగే చూసేవాడు. మనం ఏది శుచీ శుభ్రం అనుకుంటున్నామో అది వాడికి నచ్చడం లేదేమో. కడుక్కోవలసిందంతా లోపలే దాచుకుని పైపైన చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమం అంతా నాటకంలా వాడికనిపిస్తుందేమో. మనం చేసే ప్రతి పనీ వాడి సహజత్వం నుండి దూరం చేసే అసహజమైన దానిగానే అనుకుంటున్నాడేమో. అప్పుడు వాడి కళ్ళలోకి చూస్తే ఎందుకో నా కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అదంతా తల్చుకుంటుంటే ఇప్పుడూ తిరుగుతున్నాయనుకోండి. ఓహో! ఇదన్నమాట కారణం అనుకొని అప్పుడే ఓ కంక్లూజన్‌కి వచ్చేయకండి. స్నానం చేయించినందుకు చిరాకు పుట్టి పారిపోయాడని అనేసుకోవద్దు. అలా అనేసుకుని ఎంతైనా కుక్క కుక్కే. అందుకే కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధెక్కడ పోనిచ్చుకుంటుందని మాటలు జారేస్తారేమో అంత పనిచేయకండి. అసలు జంతువుల్ని మనుషులు ఎందుకు పెంచుకుంటారో తెలుసా? అది జంతు ప్రేమ కాదు. మనలోపలున్న జంతువులకీ, బయట స్వేచ్ఛగా తిరిగే జంతువులకీ మధ్య జరిగే యుద్ధానికి మనం పెట్టుకున్న అందమైన పేరు. అంత ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. వాస్తవానికి మన లోపలున్న జంతువులు బయట హాయిగా వున్న జంతువుల మీద కుళ్ళుతో వాటిమీద కసి తీర్చుకోడానికి వాటికి ఇష్టం లేని పనులు చేయడానికి మనల్ని ఉసికొల్పుతాయి. ఇక మనం పెంచుకున్నవి మనకు నచ్చని పనులు చేసి వాటి నిరసన తెలియజేస్తాయి. ఇదంతా నేను మా గోల్డీ సాహచర్యంలో తెలుసుకున్న విశేషాలే సుమా. సరే! విషయానికే వద్దాం. స్నానం చేయించినంత మాత్రానికే పారిపోయే కురచబుద్ధి వాడు కాదు మా గోల్డి. నా వల్లే నా సరదా సంతోషాలే వాణ్ణి నా నుండి దూరం చేశాయి. వాడిది సహజంగానే బంగారంలా మెరిసిపోయే జుట్టు అని చెప్పాను కదా. అలాంటి వాడికి నా సరదా కోసం ఒక పూల చొక్కా కుట్టించాను. ఒక రంగు టోపీ కొన్నాను. వాటిని బలవంతంగా ఒకరోజు అలంకరించాను. అంతే, ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. ఏంటో గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది ఉండండి. పొలమారితే ఎవరో తల్చుకున్నట్టే. వెదవ! నన్ను తలుచుకుంటున్నాడేమో.వాడికేదో పోయేకాలమొచ్చి పోయాడని అనొద్దండి.మీకు దండం పెడతాను. మేముండే చోటుకి నెమళ్ళు బాగా వస్తాయి. బావుంటుంది కదా అని ఓ నెమలి కన్నుల చొక్కా కుట్టించేను గోల్డీకి. అంతే! వాడికి ఎక్కడ లేని తిక్క రేగింది. వాడన్న మాటల్ని మీకోసం ఇక్కడ మీకు తెలిసిన భాషలో చెప్తున్నా చూడండి.‘మీ మనుషులు మారర్రా అన్నాడు. ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల జీవులున్నాయి. ఒక్కటంటే ఒక్కటైనా బట్టలు వేసుకుంటాయా? అది ప్రకృతికి విరుద్ధంరా! మీ మనుషులు చేసేదంతా ప్రకృతి విరుద్ధమే. ఆ నెమలిని చూడు. ఏదో రోజు ఆ నెమలిని కూడా మచ్చిక చేసుకుని నువ్వు దానికి కూడా పనికిమాలిన చీర ఏదో చుట్టినా చుడతావు. బాబూ నీకూ నీ చాదస్తంతో కూడిన అజ్ఞానంతో నిండిన అసహజత్వానికీ పరాకాష్టలాంటి నీ అలవాట్లకో నమస్కారం. నీకూ నాకూ రాం రాం.’ అని అన్నాడండి. దాని తర్వాత ఒకటి రెండురోజులు నెమలి మా దొడ్డి వైపు వస్తే దాన్ని తరిమేసే వాడు. అలా చివరికి ఒకరోజు తనను తానే నానుండి దూరంగా తరిమేసుకున్నాడు. మీరిప్పుడు ఏమంటారో నాకు తెలుసు. ‘మీ కుక్కప్రేమ నక్కలెత్తుకెళ్ళా. ఆ కుక్క నాయాలకు చొక్కా ఎందుకు కుట్టించారండి’ అంటారా? అనండి. అంటే అన్నాడు గాని భలే అన్నాడని నవ్వుకుంటున్నారు కదా. ‘నెమలికి కూడా మీరు చీర కట్టగలిగే నేర్పరులే’ అని నన్ను వెక్కిరించండి. ‘ చీర కట్టిన నెమలి. ఆహా! పోతేపోయాడు కాని మాంచి జ్ఞానోదయం చేశాడండి మీ గోల్డి!’ అంటారా? అనండి అనండి. మీరనాలి.నేను పడాలి. అంత దిక్కుమాలిన పని చేశాను మరి.నిజంగానే మనిషి తక్కువోడు కాదు. తనలోపల పాతిపెట్టాల్సిన వాటినెన్నింటినో నిత్యం బయటపెడుతూనే ఉన్నాడు. స్వార్థం, కుళ్ళు, ద్వేషం, అసహనం, మోహం, అత్యాశ, క్రోధం ఇలా ఎన్నని చెప్పాలి! వేటిని ఇనప కచ్చడాలు వేసి బిగించాలో వాటిని నిర్లజ్జగా వదిలేసి, ఏవేవో కపట వస్త్రాలతో తనను తాను కప్పుకుంటున్నాడు. మనిషి చేసే ప్రతి పనీ ప్రకృతి విరుద్ధమే అని నిరూపించగల అద్భుత మేధావి మా గోల్డీ గాడు. కాని వాడి భాష నాకు మాత్రమే తెలుసుగా ఏం చేస్తాం. నేనేమీ ఏడ్వటం లేదండి. నిజంగా. ఇన్ని విషయాలు నాకు బోధించి పోయాడు మా గోల్డీ గాడు. అదే తల్చుకుని పొంగిపోతున్నా. నిజంగానండి. పైకి చూపుతున్న గాంభీర్యం కాదు.ఏంటి? ఒకసారి సారీ చెప్పేసి, ఆ చొక్కా చింపి పారేయాల్సిందంటారా? వెధవ చొక్కా. కనీసం కుక్కయినా దక్కేదంటారా? మీ వ్యంగ్యానికేంగాని నా పశ్చాత్తాపాన్ని ప్రకటించుకునే అవకాశాన్ని కూడా నాకివ్వలేదు మా గోల్డి. దానికి కూడా అర్హుడనని వాడనుకోలేదు కాబోలు. వాడు కచ్చితంగా నెమళ్ళను నా నుండి కాపాడే మహోద్యమం ఏదో మొదలుపెట్టడానికే ఏ అడవుల్లోకో పారిపోయి ఉంటాడని నా నమ్మకం. నన్ను చూసి మీరేమీ జాలి పడక్కర్లేదు. తెలివిమాలిన వారు సానుభూతికి అనర్హులు. హచికో సినిమాలో కుక్క, చనిపోయిన యజమాని కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసి చూసి పాపం చివరికి గడ్డకట్టుకుపోయిందే! నేను కూడా అలాగే అయిపోయేలా వున్నానని మాత్రం భయం కలుగుతోంది. అందులో యజమాని కోసం ఎదురుతెన్నులు చూసి కుక్క అలాగైంది. కుక్క కోసం ఎదురుతెన్నులు చూసి నేనిలా అవుతున్నాను. అంతే. వాడిని మర్చిపోలేను. దయచేసి వేరే కుక్కను పెంచుకోమని మీరు సలహాలు ఇవ్వొద్దు. మా గోల్డీ స్పెషల్. వాడి కోసం చుట్టుపక్కల ఎక్కడెక్కడ అడవులున్నాయో అన్నీ వెదుకుతున్నాను. ఒకవేళ వాడు కనబడితే ఏం చేస్తానో చెప్పమంటారా?బతిమాలుకుంటాను. వాడు రానంటే వాడితోనే వుండిపోతాను. వాడికి బట్టలిష్టం లేదుగా. నేను కూడా వాడి ఇష్టాన్నే ఫాలో అయిపోతా. సూఫీ గురువు సర్మద్లాగా నగ్నంగా తిరుగుతాను. ఔరంగజేబు రాజధాని నగరం నడిరోడ్డు మీద తల తీయించేశాడే ఆ సూఫీ గురువు గురించి మాట్లాడుతున్నానని మీరు కనిపెట్టే వుంటారు.ఔను! ఒక కవి తత్వాన్ని తలబిరుసు అనుకున్నాడు రాజు. అందుకే తల నరికించాడు. కాని ప్రజలు ఆ ఫకీరు అంతరాత్మలోని సత్యమనే వెలుగును దర్శించారు. అందుకే అతని సమాధిని ఒక తీర్థ స్థలంగా మార్చేశారు.ఉండండి ఉండండి. దూరంగా ఏవో నెమళ్ళు ఆడుకుంటున్నాయి. పక్కనే ఏదో కుక్క కూడా ఉన్నట్టుంది. తర్వాత చెప్తాను. పరుగు పెడుతూ మాట్లాడలేను. అవును! మా గోల్డీలానే వున్నాడు. ఉండండి ఒక్క నిమిషం. తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెయిట్ చేసినందుకు సంతోషం. కానీ నేనే మీతో మాటల్లో పడి మళ్ళీ బుద్ధి తక్కువ పని చేశాను. నా హడావుడి పరుగు చూసి నెమళ్ళన్నీ ఒక్కసారిగా రెక్కల్ని ఎడాపెడా చాచేసి కూడబలుక్కున్నట్టు రివ్వున ఎగిరిపోయాయండి. దగ్గరకు పోయి చూస్తే అక్కడ కుక్క ఏదీ కనిపించలేదు. పైకి చూస్తే నెమళ్ళతోపాటు కుక్క ఆకారంలో ఎర్రని వర్ణం ధగధగా మెరిసిపోతూ కనిపించిందండోయ్. మీరు నమ్ముతారో లేదో. వాడు కచ్చితంగా మా గోల్డీనే. కచ్చితంగా చెప్తున్నా కదా, మా గోల్డీనే. ఇంక నేను మీతో మాట్లాడలేను. ఎందుకంటే నా వొంటికి పట్టింది చెమటో కన్నీళ్ళో నాకు తెలీదు. కాసేపు ఇక్కడే నేల మీద సేద తీరి పైకి చూస్తూ ఉంటాను. మా గోల్డీ నాకోసం తప్పకుండా వస్తాడు. మీకు ఒక విషయం తెలుసా తనను పెంచుకుంటున్న యజమానిని వదిలి కుక్కలు ఎక్కడికీ వెళ్ళవు. వస్తాడు. మా గోల్డీ తప్పకుండా వస్తాడు. కనీసం తనతో నన్ను తీసుకుపోడానికైనా వస్తాడు. - ప్రసాదమూర్తి -
24 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు నోటీసులు
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయం నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లాలో కొనసాగుతున్న 24 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సంజాయిషీ నోటీసులు అందజేస్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ కూన రామ్‌జీ తెలిపారు. వర్సిటీ కాలేజ్ డెవలఫ్‌మెంట్ కౌన్సిల్ డీన్ పెద్దకోట చిరంజీవులుతో ఈ సంజాయిషీ నోటీసులు అంశంపై వర్సిటీలో సోమవారం ఆయన చర్చించారు. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు, డిగ్రీ కళాశాలల పరిశీలనకు నియమించిన కమిటీలపై చర్చించారు. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం నోటీసులు ఇస్తున్నామని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్ ఎన్.రంగనాథ్, ఇదే విశ్వవిద్యాలయంకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ఎల్.జయశ్రీ, ఏపీ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ టీవీ శ్రీకృష్ణమూర్తి, ఏపీఎస్సీహెచ్ఈ అకడమిక్ సెల్ అధ్యాపకురాలు బీఎస్ సలీనా, స్థానిక బీఆర్‌ఏయా సీడీసీ డీన్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు ప్రైవేటు కళాశాలల్లో అమలవుతున్న నిబంధనలు పరిశీలించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 88 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా, చాలా కళాశాలలను నిబంధనలు అతిక్రమించి నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎస్వీఆర్ డిగ్రీ కాలేజ్(పాలకొండ), స్వర్ణభారతి(ఇచ్ఛాపురం), కృష్ణసాయి(సోంపేట), పీపీఆర్‌ఎస్ కౌముది(శ్రీకాకుళం), శ్రీ సత్యా(కాశీబుగ్గ), శ్రీకుమార్(మందస), టీఎస్ఆర్(ఆమదాలవలస), అమర్(నందిగాం), శ్రీ సాయి(సరుబుజ్జిలి), శ్రీ సిద్ధార్థ(హరిపురం), కృష్ణ సాయి(కంచిలి), షిర్డీసాయి(కాశీబుగ్గ), కిరణ్మయి(పాతపట్నం), రంగముద్రి(రాజాం), రామలీల(పాలకొండ), సంస్కార భారతి(సోంపేట), శ్రీ సాయికృష్ణ(కాశీబుగ్గ), ఎస్వీజే(కవిటి), సూర్యతేజ(పలాస), శాంతినికేతన్(రణస్థలం), కౌముది(ఆమదాలవలస), శ్రీరామా(అట్టలి), శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల(శ్రీకాకుళం)కు సంజాయిషీ నోటీసులు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కళాశాలల నుంచి వివరణ సేకరించి, ఉన్నత విద్యా మండలికి సమాచారం అందజేస్తామని అన్నారు. అనంతరం వారి నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని చెప్పారు. నిబంధనలు మేర కు ఐదేళ్లు దాటాక సొంత భవనాల్లోకి కళాశాలలు షిఫ్టు చేయాల్సి ఉంటుందని, అయితే నిబంధనలు పాటి ంచకుండా, యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా కళాశాలలు నిర్వహిస్తూ ముందుకు పోతున్నారని చెప్పారు. అద్దెభవనాల్లో నిర్వహించటంతో మౌలిక వసతులు కనీసం పాటించటం లేదని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో విద్యా బోధన బలోపేతం, మౌలిక వసతులపై ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు. రెండో రెక్టార్‌గా చిరంజీవులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రెక్టార్‌గా ప్రస్తుత ప్రిన్సిపాల్, సీడీసీ డీన్ చిరంజీవులును నియమిస్తూ ఉత్తర్వులు అందజేసినట్టు వీసీ రామ్‌జీ చెప్పారు. రెండో రెక్టార్‌గా ఈయన బాధ్యతలు నిర్వహించనున్నారు. జూన్ 30న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. గతంలో మొదటి రెక్టార్‌గా ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య వ్యవహరించారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ప్రస్తుతం రెక్టార్ పోస్టు ఖాళీగా ఉంది. -
యాంగ్జై'టీ' కప్పులో..
ఇసుక రేణువంత కష్టం ఒక్కోసారి పర్వతమంత భారమైపోతుంది. చిరుజల్లులా అనిపించాల్సిన చిన్నకష్టం కూడా తుఫానులా అనిపిస్తుంది. ఈ మానసిక స్థితిని కంట్రోల్ చేయకపోతే... కుటుంబంలో అనవసరమైన టెన్షన్ మిగిలిపోతుంది. ప్రపంచాన్ని వేధిస్తున్న కొన్ని యాంగ్జైటీ డిజార్డర్లను అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఆ ఆందోళన టీకప్పులో తుఫానులా అనిపిస్తుంది. పొలంలోని పంట చేతికి రాక... చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక... చేతికి అందేంత దూరంలో పురుగులమందు డబ్బా ఉన్నప్పుడు దాన్ని అందుకుని దుర్బలుడయ్యే స్థితికీ... అందుకోకూడదు అన్న విచక్షణకూ మధ్య తారట్లాడే మనస్థితి అది. పరీక్ష రాసేందుకు బయల్దేరిన ఒక పిల్లవాడు తన సామర్థ్యాలు తెలిసి కూడా వాటిని సక్రమంగా నెరవేర్చగలనో లేనో అంటూ సంశయపడే వేళ కలిగే భావోద్వేగం అది. ఇక్కడి చదువైపోయి... అమెరికాలో కొలువొచ్చింది. కానీ ట్రంపాసురుడు మోకాలడ్డుతున్నాడు. ఏం చేయాలన్న పరిస్థితుల్లో కలిగే మానసిక స్థితి... వీటిన్నింటికీ ఓ పేరు పెడితే అది ‘యాంగై్జటీ’. ఇదో వెరైటీ వేదన. కాకపోతే ఇవి కాస్త అత్యంత తీవ్రస్థాయి భావాలు. కానీ దీన్లోనే ఒకింత కింది స్థాయి భావోద్వేగాలూ ఉంటాయి. కొత్తగా కారు నేర్చుకున్న తర్వాత, తొలిసారి సొంతకారును తానే సొంతంగా డ్రైవ్ చేస్తున్నప్పటి పరిస్థితి... తొలిసారి ఉద్యోగంలో చేరాక తన సీట్లో కూర్చున్నప్పటి మనఃస్థితి... ఇవి కాస్తంతసేపటి తర్వాత చల్లబడి... క్రమంగా సర్దుకునే పరిస్థితులు. కానీ మొదట పేర్కొన్న రెండూ మాత్రం చాలా తీవ్రమైనవి. ఆ మనస్థితి పేరే ‘యాంగై్జటీ’. ఆ యాంగై్జటీలలోని కొన్ని రకాలు... 1 జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ కిరణ్‌కు 30 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఉదయం ఆఫీస్‌కి లేట్ అవుతుందేమోనని టెన్షన్. బాస్ ఎక్స్ప్లనేషన్ అడుగుతాడేమోనని ఆందోళన. అడిగితే ఏం చెప్పాలి అనే బెంగ. తనకు అప్పజెప్పిన పని తనకెంతో సులువైనదైనా టైమ్‌కి కంప్లీట్ చేస్తానో లేదో అనే చింత. సాయంత్రం ఇంటికి వెళ్లేప్పుడూ అదే టెన్షన్‌ను పట్టుకెళ్తాడు. చివరకు నవ్వుతూ ఆడుకుంటున్న తన రెండేళ్ల కొడుకును చూసినా టెన్షనే. తప్పటడుగులతో ఎక్కడ కింద పడిపోతాడో, ఏ అసౌకర్యం కలిగి ఏడుస్తాడో అని. ఇలా నిత్యం బెంగతో, ఏదో టెన్షన్‌తో బాధపడుతూ ఉండే పరిస్థితిని జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్ (జీఏడీ) అని పేర్కొంటారు. దీని బారిన పడ్డ వ్యక్తులు మానసికంగా పూర్తిగా అలసిపోయినట్లుగా, అత్యంత నిస్సత్తువతో, తమలోని సహనం పూర్తిగా అయిపోయినట్లుగా ఫీలవుతుంటారు. 2 అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కల్పన ఇల్లును ఎంత నీట్‌గా పెడుతుందో! ఇంట్లోకి చిన్న దుమ్మురేణువునూ రానీయదని చుట్టాల్లో కల్పనకు ఒక ఇమేజ్. కానీ ఆ అలవాటు ఇంట్లోవాళ్లను డామేజ్ చేస్తోంది. భర్తను, పిల్లలను ఏదీ ముట్టుకోనివ్వదు. వాళ్లు ఏది ముట్టుకున్నా ఆమె కడగాల్సిందే. పొద్దున్నుంచి పడుకోబోయే దాకా కల్పనకు ఒకటే పని... శుభ్రం చేయడం. పది సార్లు ఇల్లు ఊడ్వడం, తుడవడం, స్టవ్ వెలిగించి ఆర్పేసినా ప్లాట్‌ఫామ్‌తో సహా అంతా శుభ్రం చేయందే ఊరుకోదు. ఇంట్లో వాళ్లు టాయ్‌లెట్‌ను ఉపయోగిస్తే చాలు వెంటనే కడిగేస్తుంది. ఈ అతిశుభ్రంతో తిండీతిప్పలను కూడా మరిచిపోయి పీనుగులా తయారైంది. తన అతిశుభ్రంతో ఇంట్లోవాళ్లనూ చిరాకు పెడుతోంది. దీన్నే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఇది కూడా ఒక రకం యాంగై్జటీయే. ఒక వస్తువు తమ అనుకున్నంత శుభ్రంగా లేదని పడే యాంగై్జటీ ఇది. 3 సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ 24 ఏళ్ల సంపత్. చాలా చలాకీగా ఉండేవాడు. చదువుల్లోనూ జెమ్. బీటెక్ కాగానే అమెరికాలో ఎమ్మెస్ చేయాలని ప్రయత్నం. బాగా చదివే కుర్రాడే. ఏమైందో ఏమో... జీఆర్ఈ, టోఫెల్ దేంట్లోనూ పాస్కాలేకపోయాడు. విపరీతమైన కన్ఫ్యూజన్. అయోమయం వల్ల వచ్చిన జవాబులనూ రాయలేకపోయాడు. ఎమ్మెస్ విషయం మరిచిపోయి ఇక్కడే ఉద్యోగవేటలో పడ్డాడు. అక్కడా చుక్కెదురే. తనవల్ల ఏమీ కాదు.. తాను ఏమీ చేయలేనని సిగ్గుతో బిక్కచచ్చిపోయాడు. బాధతో కుమిలిపోయాడు. ఈ బాధ చివరకు అతనిని ఎలా మార్చిందంటే ఎవరినీ లెక్కచేయని మొండిఘటంగా! చిన్నా, పెద్దా అనే తేడా మరిచిపోయి అందరితో చాలా అగ్రెసివ్‌గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇదే సోషల్ యాంగై్జటీ డిసార్డర్. 20 ఏళ్ల వారిలో కనీసం 80 శాతం మంది ఈ తరహా రుగ్మతకు లోనై అంతులేని వేదనను అనుభవిస్తుంటారు. అన్నీ తెలిసీ అయోమయంగా ఉండటం, చేయగలిగీ చేయలేనప్పుడు సిగ్గుతో బిక్కచచ్చిపోవడం, కుమిలిపోవడం, ఈ భావనలన్నీ తీవ్రంగా కలచివేస్తే ఒక్కోసారి సంఘవ్యతిరేకిగా మారడం.. ఇవన్నీ సోషల్ యాంగై్జటీ డిజార్డర్ లక్షణాలే. 4 ప్యానిక్ డిజార్డర్ సురేశ్‌కు డేరింగ్, డాషింగ్, డైనమిక్ అని పేరు. అతను ఒక్కడే పది మంది పెట్టు అని ఫీలయ్యేవాళ్లు సురేశ్ స్నేహితులు. ఎవరికి ఏ అవసరమొచ్చినా అర్ధరాత్రీ, అపరాత్రీ అని చూడకుండా సహాయానికి వెళ్లేవాడు. అలాంటి మనిషి ఇటీవల రాత్రి తొమ్మిదయిందంటే గడపదాటట్లేదు. ఒంటరిగా ఉండడానికి జంకు. కారణమేంటో అతని శ్రేయోభిలాషులకు అంతుచిక్కట్లేదు. ఇదే ప్యానిక్ డిజార్డర్. గతంలో ఒక అంశం ఎన్నడూ భయం కలిగించనిదే. అనేక సార్లు ఆ పని నిస్సంకోచంగా, విజయవంతంగా చేసి ఉంటాం. ఒక ప్రదేశానికి నిర్భయంగా వెళ్లి ఉంటాం. కానీ ఎందుకో ఆ పని చేయాలన్నా, అక్కడికి వెళ్లాలన్నా మునుపెన్నడూ లేనంత తీవ్రమైన భయం. అకస్మాత్తుగా కలిగే ఈ భావోద్వేగాలతో ఊపిరి సరిగా అందదు. మాట సరిగా రాదు. కళ్లు తిరుగుతాయి. వణుకు వస్తుంది. ఒళ్లంతా చల్లగా చెమటలు. వాంతి వస్తున్న భావన. ఒంట్లోంచి వేడి ఆవిర్లు. మన జనాభా మొత్తంలో ఐదు శాతం మంది ఈ రకమైన ప్యానిక్ డిజార్డర్‌ను వారి జీవితంలోని ఏదో ఒక దశలో ఏదో ఒక సమయంలోనైనా అనుభవించి ఉంటారు. 5 ఫోబియాలు సురభికి బల్లి అంటే భయం. అది మిడిగుడ్లేసుకొని ఏ గోడ మీద కనిపించినా ఆమెకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. కుటుంబ సభ్యులు దాన్ని బయటకు పంపించేంత వరకు సురభి ఇంట్లోకి రాదు. దీన్నే ఫోబియా అంటారు. ఇదీ యాంగై్జటీయే. బల్లి అంటే సురభికి ఉన్న భయం మిగతావారికి అర్థంలేనిదిగా అనిపిస్తుంటుంది. ఈ భయం జంతువులు, క్రిమికీటకాలు, మనుషులు, వస్తువులు, ప్రదేశాలు, సంఘటనల (సిచ్యువేషన్స్) పట్లా కావచ్చు. ఎంత ధైర్యం చెప్పినా తీరని భయం అది. ఈ ఫోబియాలనే యాంగై్జటీ జాబితాతో పూర్తిగా ఒక స్వతంత్ర విభాగమంతటి శాస్త్రవిజ్ఞాన భాండాగారం అందుబాటులో ఉంది. 6 పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ 2004లో వచ్చిన సునామీలో జయ అనే పధ్నాలుగేళ్ల అమ్మాయి ఇంటిని, ఇంటివాళ్లను పోగొట్టుకొని అనాథ అయింది. అనాథశరణాలయంలో చేరింది. అందరినీ పోగొట్టుకున్న బాధతో నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోయింది. ఆకలి, దప్పులు తెలిసేవి కావు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒంటి మీద స్పృహæ లేనిదానిలా తయారైంది. ఆమె పరిస్థితిని అదనుగా తీసుకున్న ఆ హోమ్ మేల్కుక్ ఆమె మీద లైంగిక దాడి చేశాడు. దాంతో మరింత కుంగిపోయింది జయ. అమ్మానాన్న, అక్క, తమ్ముడిని తన కళ్లముందే సముద్రం కబళించడం, కుక్ చేసిన అఘాయిత్యం పదేపదే గుర్తొచ్చి వణికిపోయేది. అర్ధరాత్రి ఉన్నట్టుండి దిగ్గున లేచి కూర్చొనేది. ఏ మగవాడు కనిపించినా.. అరిచేది. చివరకు తనకు చికిత్సచేసే డాక్టర్ తన దగ్గరకి వచ్చినా కేకలు పెట్టేది. పారిపోవడానికి ప్రయత్నించేది. ముచ్చెమటలతో మూలకు వెళ్లి దాక్కునేది. జయ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధ పడుతోందని చెప్పారు మానసిక వైద్యులు. ఇదీ ఒక తరహా యాంగై్జటీయే. 7 సపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్ భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు వారూ కొంత యాంగై్జటీకి లోనవుతుంటారు. భవిష్యత్తు పట్ల ఆందోళన పడుతుంటారు. ఇక ఆ దంపతుల పిల్లల్లోనూ తీవ్రమైన యాంగై్జటీ ఉంటుంది. తమ భవిష్యత్తు పట్ల తీవ్రమైన అభద్రత, భయం, ఆందోళన వారిని చుట్టుముడతాయి. దాంతో ఆ కుటుంబం అంతా అనుభవించే వేదన అంతా ఇంతా కాదు. దీన్ని సపరేషన్ యాంగై్జటీ డిజార్డర్‌గా కొందరు నిపుణులు పేర్కొంటారు. కాగా మరికొందరు దీన్ని సోషల్ యాంగై్జటీ డిజార్డర్‌లో భాగంగా చూస్తారు. దురలవాట్లను దగ్గర చేసే యాంగ్జైటీ యాంగై్జటీ వల్ల కలుగుతున్న ఉద్విగ్న స్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక... ఆ స్థితిని అధిగమించడానికి సిగరెట్‌ను ఆశ్రయిస్తారు. ఇలా రోగి చేరువయ్యే మరో దురలవాటు మద్యం. మద్యాన్ని ఆశ్రయించాక... ఇక ఆ మత్తు ఇచ్చే తాత్కాలికమైన అభయభ్రాంతి నుంచి దూరం కావాలని అనుకోరు. అలా మద్యానికి బానిసై కాలేయం, కిడ్నీలూ పాడుచేసుకుంటారు. మరికొందరు డ్రగ్స్‌కు బానిసలవుతారు. అందుకే యాంగై్జటీకి లోనయ్యేవారిని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. నిత్యం మానసిక స్థైర్యాన్ని నూరిపోస్తూ, కడుపున పెట్టుకొని కాపాడుకుంటూ ఉండాలి. యాంగ్జైటీ చాలావరకు వారసత్వమే యాంగై్జటీ సమస్యలు చాలావరకు వారసత్వంగానే వస్తుంటాయి. పేరెంట్స్‌లో ఒకరు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ, అస్థిమితంగా ఉండేవారైతే... వారి పిల్లలూ పెద్దయ్యాక యాంగై్జటీకి లోనవుతారని చాలా అధ్యయనాల్లో తేలింది. అయితే జీవశాస్త్రపరమైన అంశాలు, మానసికాంశాలు, పరిసరాలు, జీన్స్... ఈ నాలుగు అంశాలూ కలిసి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి. చికిత్సలూ కాస్త విచిత్రాలే యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడే రోగులకు ఇచ్చే చికిత్సల్లో సంప్రదాయ చికిత్సల్లా మందులు ఇవ్వడం వంటివి అంతగా ఉండవు. మందులు ఇచ్చినా వాటితో పాటు అనేక రకాల చికిత్స ప్రక్రియలు కొనసాగిస్తారు. ఉదా: రోగికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇస్తూ... అతడితో మాట్లాడుతూ ఉండటం ∙తాను ఆందోళన పడే పరిస్థితులకు క్రమంగా ఎక్స్పోజ్ చేస్తూ, ఆ పరిస్థితులను అధిగమించే ధైర్యాన్ని సమకూర్చే వ్యూహాలు, ఎత్తుగడలు వంటివి పాటిం చేలా కోపింగ్ స్ట్రాటజీస్ అవలంబించడం. యాంగ్జైటీలూ... కొన్ని నమ్మలేని నిజాలు ⇒ కొన్నిసార్లు అంతులేని యాంగై్జటీ ఒత్తిడిలో చేసే పనులు ఒక్కోసారి ఊహించని విజయాలను తెచ్చిపెడతాయి. అయితే ఇవి చాలా అరుదు. సాధారణంగా ఈ ఒత్తిడితో నలిగిపోతూ సవ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే చాలా సందర్భాల్లో జరుగుతుంది. అది పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. ⇒ పురుషులు / యువకులతో పోలిస్తే యాంగై్జటీకి లోనయ్యే అవకాశాలు, సందర్భాలు మహిళలు / యువతులకే ఎక్కువ. సాధారణంగా వారు రేప్, లైంగికదాడి, అత్యాచారం వంటి సంఘటనలకు లోనైనప్పుడు, లేదా యుద్ధాల వంటి అవాంఛిత అనర్థాలు కొనసాగే సమయంలో దాడులు మహిళల మీదే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి యాంగై్జటీ డిజార్డర్‌కు లోనయ్యే అవకాశాలు మహిళలకే ఎక్కువ. ∙యాంగై్జటీలకు లోనైనప్పుడు కలిగే మానసిక ప్రభావాలు మెదడుపై చాలా సంక్లిష్టమైన ముద్రలు వేస్తాయి. ⇒ యాంగై్జటీ కేవలం మానసికమైన సమస్యగానే చాలామంది భావిస్తుంటారు. కానీ యాంగై్జటీకి లోనైన వారు ఆయాసం, ఆస్తమాకు లోనవుతుంటారు. అలాగే కడుపునొప్పి, ఇతరత్రా భౌతిక సమస్యల రూపంలోనూ ఈ మానసిక సమస్య వ్యక్తమవుతుంటుంది. కొన్నిసార్లు డాక్టర్లు దీన్ని కేవలం శారీరకమైన, భౌతికమైన సమస్యగానే పొరబడి మందులు ఇస్తుంటారు. సమస్య ఎంతకూ తగ్గకపోవడంతో అప్పుడు అది యాంగై్జటీ వల్ల వచ్చిన పరిణామం కావచ్చని కాస్త ఆలస్యంగా డయాగ్నోజ్ చేస్తుంటారు. ఈ తరహా రోగులతో ఈ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ∙ఎన్నో యాంగై్జటీ సమస్యలు దీర్ఘకాలం కొనసాగి కొనసాగి దాన్ని గుండెజబ్బులకు దారితీస్తాయి. ∙కొన్ని రకాల యాంగై్జటీల వల్ల కడుపులో నిత్యం ఆహారాన్ని జీర్ణం చేసే యాసిడ్‌ను స్రవించేలా చేస్తుంది. ఇదే దీర్ఘకాలం కొనసాగడం వల్ల రోగికి దీర్ఘకాలిక గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు ఉంటాయి. ఇవి స్టమక్ అల్సర్స్‌గా... దీర్ఘకాలం ఉండే ఆ అల్సర్లు... కడుపు క్యాన్సర్స్‌గా కూడా పరిణమిస్తాయి. అలా యాంగై్జటీలు క్యాన్సర్లకూ కారణమవుతాయి. ∙కేవలం గుండె, జీర్ణ వ్యవస్థ సమస్యలే గాక... దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలకూ యాంగై్జటీలు కారణమవుతాయి. కారణమేదైనా వేదన ఒకటే... రకమేదైనా లక్షణాలు అవే... క్లేశానికి కారణం ఏదైనా కావచ్చు. బాధకు దారితీసే పరిస్థితి వేరుగా ఉండవచ్చు. కానీ యాంగై్జటీకి గురవుతున్నవారిలో కనిపించే కామన్ లక్షణాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. వాటిలో కొన్ని ఇవి... ⇒ కండరాలు బిగుసుకు పోతుండటం / అకస్మాత్తుగా కండరం బిగుసుకుపోతుండటం. ⇒ గుండె లయ తప్పడం (ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్) ⇒ అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) ⇒ నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్) ⇒ శ్వాససరిగా అందకపోవడం /బలంగా తీసుకోవడం / ఆయాస పడటం వంటి శ్వాస సంబంధిత సమస్యలు. కారణాలు : యాంగై్జటీకి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణంలో వచ్చే పర్యావరణ సంబంధితమైన మామూలు కారణాలు మొదలుకొని ఎన్నో అంశాలు యాంగై్జటీకి దోహదపడతాయి. ఉదాహరణల్లో అన్నింటికంటే ముఖ్యమైనది ఆర్థికపరమైన సమస్యలు. ఇక పనిచేసే ప్రదేశంలో ఒత్తిళ్లు, అక్కడ నిర్ణయించే లక్ష్యాలు, చదువుకునే చోట్ల అగ్రగామిగా నిలవాల్సిన అవసరం కలిగించే ఒత్తిడి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, జీవనగమనంలో వచ్చే అవాంఛిత పరిస్థితులు (చాలా ఇష్టమైన వారు దూరం కావడం/మరణించడం వంటివి)... ఇలాంటి ఎన్నో అంశాలు యాంగై్జటీని కలిగించి మానసిక వేదనకు కారణమవుతాయి. డాక్టర్ టి. నాగలక్ష్మి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
సెట్‌టాప్ బాక్సుల తప్పనిసరిపై వివరణ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలోని వీక్షకులు ఈ నెల 31 కల్లా సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాల్సిందేనంటూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
హోర్డింగ్స్‌పై సమాధానమివ్వండి..
గుంటూరు లీగల్: నగరంలోని ప్రధాన కూడళ్లలో అనధికారికంగా కొనసాగుతున్న గ్రౌండ్‌సైడ్ హోర్డింగ్‌లతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎదుట మన లక్ష్యం పోస్టర్ ఫ్రీ అనే స్వచ్ఛంద సేవాసంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ నెల 25న నగరపాలక సంస్థ సమాధానం దాఖలు చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి శనివారం ఆదేశాలు జారీచేశారు. నగరంలో అనధికారికంగా గ్రౌండ్‌సైడ్ హోర్డింగ్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన హోర్డింగ్స్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ మన లక్ష్యం పోస్టర్ ఫ్రీ అనే సంస్థ గతంలో దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషనర్, పట్టణ ప్రణాళికాధికారులు అక్టోబర్ 15న హాజరై తమ సమాధానం దాఖలు చేయాని ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం జిల్లా న్యాౖయసేవాధికార సంస్థ ఎదుట పట్టణ ప్రణాళికాధికారి రమేష్‌బాబు హాజరయ్యారు. కొంత సమయం ఇస్తే తమ సమాధానం దాఖలు చేస్తామని న్యాయమూర్తికి విన్నవించారు. న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి స్పందిస్తూ గ్రౌడ్‌సైడ్ హోర్డింగ్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉదని నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 25వ తేదీన సమాదానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. -
అనుమతి లేకుండా విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం తెలపకుండా పాఠశాలల విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వారం రోజులలోగా వివరణ ఇవ్వాలని డీఈఓ వై.చంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.విమల 2011 నుంచి, మునగాల మండలం నెలమర్రీ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పి.సౌజన్య 2005 నుంచి, నల్లగొండలోని ఆర్పీ రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సబియా జబీన్ 2013 నుంచి, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కె.శ్రీదేవి 2013 నుంచి విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఏలాంటి వివరణ ఇవ్వకుంటే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలిపారు. -
ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం తెలపకుండా పాఠశాలల విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వారం రోజులలోగా వివరణ ఇవ్వాలని డీఈఓ వై.చంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.విమల 2011 నుంచి, మునగాల మండలం నెలమర్రీ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పి.సౌజన్య 2005 నుంచి, నల్లగొండలోని ఆర్పీ రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సబియా జబీన్ 2013 నుంచి, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కె.శ్రీదేవి 2013 నుంచి విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఏలాంటి వివరణ ఇవ్వకుంటే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలిపారు.