'అందరి ఇళ్లలోకి వెళ్లి చూడలేం కదా..'
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడంపట్ల ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి తాము చూడలేము కదా అని అభిప్రాయపడుతూ పిల్లలకు సంబంధించిన అశ్లీల వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సిందేనని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టు హాజరై అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడం పట్ల సమాజంలోగానీ, పార్లమెంటులోగానీ భారీ స్ధాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
గత వారం మొత్తం 850 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత రాగా కొంతమేరకు నిషేధం ఎత్తివేశారు. అయితే, పోర్న్ సైట్లను నిషేధించడం పట్ల కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపధ్యంలో ముఖుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు.