
యశవంతపుర: ప్రధాని మోదీ విష సర్పమని, తాకినవారు మరణిస్తారని చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వెనక్కి తగ్గారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలనుద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.
అసలేం జరిగింది?
సొంత రాష్ట్రం కర్ణాటకలో ప్రచారంలో భాగంగా గురువారం గదగ జిల్లాలోని రాన్ నియోజకవర్గ పరిధిలోని గజేంద్రగడలో పార్టీ ప్రచార సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు. ‘ పొరపాటు చేయకండి. జాగ్రత్త. ప్రధాని మోదీ విషసర్పం లాంటి వ్యక్తి. మరీ అంత విషతుల్యం కాదంటారా.. అయితే ఒకసారి తాకి చూడండి. మరణం తథ్యం. శాశ్వత నిద్రలోకి జారుకుంటారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘ అవినీతి పాలన అందించిన బీజేపీ నాయకులను మోదీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మోదీ ముఖం చూసి ఓటు వేసే కాలం పోయింది’ అని అన్నారు. ప్రధానిని విషసర్పంతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వెంటనే హావేరి సభలో ప్రసంగిస్తూ ఖర్గే వివరణ ఇచ్చారు. ‘బీజేపీ పార్టీ ఒక విషసర్పం అనేదే నా ఉద్దేశం. ఆ పార్టీ సిద్ధాంతం విషతుల్యం. ఆ సిద్ధాంతాలను ఆచరిస్తే అంతమైనట్లే ఇక అనే ఉద్దేశంలో మాట్లాడాను’ అని వివరించారు.