‘‘నటిగా నేను ఎంచు కున్న జీవితం ప్రత్యేకమైనది. ఇక్కడ (ఇండస్ట్రీ) ఉన్న ప్రతి ఒక్కర్నీ అందరూ ఇష్టపడతారని కచ్చితంగా అనుకోను. నేను మీకు (విమర్శిస్తున్నవారిని ఉద్దేశించి) నచ్చనంత మాత్రాన మీరు నాపై విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రతిరోజూ కష్టపడి పని (సినిమాలు) చేయడం మాత్రమే నాకు తెలుసు. నా పని వల్ల మీరు ఆనందపడితే నాకు అదే చాలు’’ అని రష్మికా మందన్నా అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక ఈ విధంగా షేర్ చేశారు.
‘‘కొన్నేళ్లుగా రెండు విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయాల్సింది. నటిగా నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి చాలామంది నన్ను ద్వేషిస్తున్నారు. విమర్శలు, నెగటివిటీ ఈ రెండు విషయాలతో ఇబ్బందిపెడుతున్నారు. ప్రతికూలత, ద్వేషం వల్ల ఉపయోగం ఏంటి? నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నన్ను చాలా నిరుత్సాహపరుస్తోంది. అవి చదివినప్పుడు నా హృదయం పగిలిపోతోంది. కొన్ని ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన కొన్ని విషయాలు తప్పుగా రీచ్ అయ్యి.. నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించాను.
ఇంటర్నెట్‌లో వస్తోన్న తప్పుడు కథనాలు ఇటు పరిశ్రమలో అటు బయట నాకున్న మంచి రిలేషన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. నాతో పాటు నా సహచరులు కూడా ఇబ్బందిపడుతున్నారు. నన్ను నేను మెరుగుపరచుకోడానికి ఉపయోగపడే సద్విమర్శలను స్వాగతిస్తాను. నాపై వస్తున్న విమర్శలను ఎత్తి చూపడం ద్వారా నేను ఎవరిపైనో గెలవడానికి ప్రయత్నించడం లేదు. అలాగే నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నేను మారాలనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్నవారిపై నాకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. మీరందరూ నాపై చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్ నన్ను ముందుకు నడుపుతున్నాయి. ఇదిగో ఇలా అందరికీ నా మనసులోని మాటలను చెప్పే ధైర్యాన్ని నాకు ఇచ్చింది అవే. అందరం అందరికీ మంచి చేసేలా కృషి చేద్దాం’’ అని పోస్ట్ చేశారు రష్మిక.
Comments
Please login to add a commentAdd a comment