క్రెడిట్‌ కార్డ్‌.. లిమిట్‌ పెంచుకుంటున్నారా? | Explanation of Credit card upgrade and benefits | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డ్‌.. లిమిట్‌ పెంచుకుంటున్నారా?

Published Mon, Oct 9 2023 4:43 AM | Last Updated on Mon, Oct 9 2023 9:10 AM

Explanation of Credit card upgrade and benefits - Sakshi

క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం మన దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2023 ఏప్రిల్‌ నాటికి దేశవ్యాప్తంగా 8.6 కోట్ల క్రెడిట్‌ కార్డ్‌లు ఉన్నాయి. 2022 ఏప్రిల్‌ నాటికి ఉన్న 7.5 కోట్లతో పోలిస్తే ఏడాదిలో 15 శాతం పెరిగాయి. 2024 ఆరంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. క్రెడిట్‌ కార్డ్‌లతో షాపింగ్‌ చేస్తే తగ్గింపులతో పాటు, రివార్డులు, ఉచిత మూవీ టికెట్లు ఇలా ఎన్నో ఆఫర్లు వినియోగాన్ని పెంచుతున్నాయి.

క్రెడిట్‌ కార్డ్‌లు తీసుకున్న తర్వాత దాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని, క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకోవాలంటూ బ్యాంక్‌లు కోరుతుండడం చాలా మందికి అనుభవమే. చాలా మంది తమ కార్డ్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం లేదంటే క్రెడిట్‌ లిమిట్‌ (అప్పు పరిమితి) పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కార్డ్‌ అప్‌గ్రేడ్‌ లేదా క్రెడిట్‌ లిమిట్‌ పెంపుతో ప్రయోజనాలున్నట్టే.. కొన్ని రిస్క్‌లు లేకపోలేదు. కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఓకే చెప్పడానికి ముందు ఇందులో ఉండే చిక్కుల గురించి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత దీనిపై నిర్ణయానికి రావాలి..

‘‘క్రెడిట్‌ పరిమితి (లిమిట్‌) పెంపు లేదా క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడ్‌ ఆఫర్‌ను, కార్డుదారుడి ఇటీవలి రుణ చరిత్ర ఆధారంగానే బ్యాంక్‌లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రస్తుత కార్డుపై ఉన్న పనితీరును చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటుంటాయి.

కార్డుదారుడి ఆదాయ స్థాయి పెరిగినట్టు బ్యాంక్‌ భావించిన సందర్భాల్లోనూ ఈ ఆఫర్లు ఇస్తుంటాయి’’అని విష్‌ఫిన్‌ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. బ్యాంక్‌ నుంచి క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడ్‌ లేదా లిమిట్‌ పెంపు ఆఫర్‌ వచి్చందంటే అది కచి్చతంగా రుణ పరపతి పెరిగిన దానికి సంకేతంగా చూడొచ్చు. అయితే, సంబంధిత ఆఫర్‌ లేదా అభ్యర్థనను ఆమోదించే ముందు తప్పకుండా సానుకూలతలు, ప్రతికూలతల గురించి విశ్లేíÙంచుకోవాలని రిషి మెహ్రా సూచించారు.  

అప్‌గ్రేడ్‌ మంచికేనా..?
ఉన్నత శ్రేణి క్రెడిట్‌ కార్డ్‌ తీసుకుంటే, దానిపై రుణం రేటు, రివార్డులు, క్యాష్‌ బ్యాక్, డిస్కౌంట్లు, డీల్స్‌ కూడా మెరుగ్గానే ఉంటుంటాయి. దీంతో కార్డ్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం వల్ల అధిక రివార్డులు, క్యాష్‌బ్యాక్, ఇతర ప్రయోజనాలు లభిస్తుంటాయి. కాకపోతే కార్డ్‌పై నిర్ధేశిత వ్యయాలు చేయాలనే నిబంధనలు ఉంటాయని మర్చిపోవద్దు. అప్‌గ్రేడెడ్‌ కార్డుకు వెళ్లకుండా, ఎన్నేళ్లు గడిచిన అదే పాత కార్డ్‌లోనే కొనసాగే వారు మంచి డీల్స్‌ను కోల్పోవాల్సి రావచ్చు.

‘‘పాతబడిన క్రెడిట్‌ కార్డ్‌ ఆధునిక ఫీచర్లు, ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు. నేడు దాదాపు చాలా క్రెడిట్‌ కార్డ్‌ సంస్థలు అర్హులైన కస్టమర్లకు ఉచిత ఎయిర్‌పోర్ట్‌ లాంజెస్‌ సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రతీ లావాదేవీపై డిస్కౌంట్, క్యాష్‌ బ్యాక్, క్రెడిట్‌ లిమిట్‌ను పెంచుతున్నాయి. పాత కార్డ్‌లోనే కొనసాగడం వల్ల.. బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల లభించే నూతన, అదనపు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది’’అని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి వివరించారు.  

అధిక లిమిట్‌ లాభమేనా?
క్రెడిట్‌ లిమిట్‌ కంటే తక్కువ ఖర్చు చేసే వారి పట్ల క్రెడిట్‌ బ్యూరోలు సానుకూలంగా వ్యవహరిస్తాయి. ‘‘క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోరును ఎన్నో అంశాల ఆధారంగా లెక్కిస్తుంటాయి. అందులో క్రెడిట్‌ వినియోగం ఒకటి. తక్కువ క్రెడిట్‌ వినియోగ రేషియో (సీయూఆర్‌) అన్నది.. లిమిట్‌ను వినియోగించుకునే విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలియజేస్తుంది. క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడడం లేదని సంకేతం ఇస్తుంది.

ఇది ఒకరి క్రెడిట్‌ స్కోర్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుంది’’అని ఆదిల్‌ శెట్టి వివరించారు. కార్డుపై ఉన్న మొత్తం లిమిట్‌లో ఎంత శాతం ప్రతి నెలా వినియోగిస్తున్నారన్నది క్రెడిట్‌ వినియోగ రేషియో రూపంలో తెలుస్తుంది. ఇది తక్కువగా ఉంటే సానుకూలం అవుతుంది. ‘‘ఉదాహరణకు క్రెడిట్‌ కార్డుపై క్రెడిట్‌ లిమిట్‌ రూ.లక్షగా ఉంటే, ప్రతి నెలా వినియోగిస్తున్నది రూ.50,000గా ఉంటే అప్పుడు సీయూఆర్‌ 50 శాతం అవుతుంది.

అదే క్రెడిట్‌ లిమిట్‌ రూ.1,50,000 అయి ఉండి, వినియోగించే మొత్తం ప్రతి నెలా రూ.50,000 స్థాయిలోనే ఉంటే, అప్పుడు వినియోగ రేషియో 33 శాతం అవుతుంది’’అని శెట్టి తెలియజేశారు. క్రెడిట్‌ స్కోర్‌ సగటున 700–750 మధ్య ఉంటే, దీన్ని పెంచుకునేందుకు అధిక క్రెడిట్‌ లిమిట్‌ సాయపడుతుంది. ‘‘సగటు స్కోరులో ఉన్న వ్యక్తి (750లోపు) క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకోవడం వల్ల అప్పుడు వారి క్రెడిట్‌ స్కోరు సైతం 750 ఎగువకు చేరుతుంది.

అప్పటికే ఎక్కువ స్కోర్‌లో ఉన్న వారు క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకోవడం వల్ల అదనంగా పొందేదేమీ ఉండదు’’అని మెహ్రా సూచించారు. తక్కువ సీయూఆర్‌ వ్యక్తి ఆర్థిక ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆదిల్‌శెట్టి సూచించారు. ‘‘సీయూఆర్‌ తక్కువగా ఉంటే మీరు మీ ఆర్థిక వ్యవహారాలను ఎంతో క్రమశిక్షణగా నిర్వహిస్తున్నట్టు తెలియజేస్తుంది. డిఫాల్ట్‌ అవకాశాలు దాదాపు తక్కువగా ఉంటాయని సంకేతమిస్తుంది. రుణాల విషయంలో సరైన నడవడిక, సకాలంలో చెల్లింపులు, రుణాల్లో సరైన సమతుల్యం (వివిధ రుణాలు) అనేవి మంచి క్రెడిట్‌ స్కోరుకు దారితీస్తాయి’’అని శెట్టి తెలిపారు.  

 రిస్‌్కలు ఇవీ..
అధిక క్రెడిట్‌ లిమిట్‌తో ఉండే అతిపెద్ద రిస్క్‌ పరిమితికి మించి ఖర్చు చేయడం. ‘‘ఎక్కువ లిమిట్‌ ఉంటే, అవసరాలు ఏర్పడినప్పుడు ఆలోచించకుండా ఖర్చు చేస్తుంటారు. సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే అది భారంగా మారుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ కార్డ్‌ నిర్వహణ భద్రంగా లేకపోతే అది దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. మోసపూరిత లావాదేవీలకు ఆస్కారం ఉంటుంది’’అని మెహ్రా పేర్కొన్నారు.

కార్డు వినియోగం విషయంలో జాగ్రత్తగా, నియంత్రణతో వ్యవహరించకపోతే అది ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. అధికంగా వినియోగించడం వల్ల అప్పుడు క్రెడిట్‌ వినియోగ రేషియో (సీయూఆర్‌) పెరిగేందుకు దారితీస్తుంది. సీయూఆర్‌ ఎక్కువ అయితే అది క్రెడిట్‌ స్కోర్‌ను వెనక్కి లాగేస్తుంది. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉంటే, అప్పటికే ఉన్న క్రెడిట్‌ లిమిట్‌లో అధిక శాతం వినియోగించాల్సి వస్తుంటే.. అప్పుడు క్రెడిట్‌ లిమిట్‌ను పెంచుకోవాలి. సీయూఆర్‌ 30 శాతం మించకుండా చూసుకోవాలి. దీనితోపాటు క్రమశిక్షణతో కార్డును వినియోగించడం, సకాలంలో చెల్లింపులు చేయడం చాలా కీలకమవుతుంది.  

ఆఫర్‌కు ఓకే చెప్పాలా..?
బ్యాంక్‌లు, లేదా క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు తరచుగా కార్డ్‌ అప్‌గ్రేడ్‌ లేదా లిమిట్‌ పెంచుకోవాలంటూ ఆఫర్లు ఇస్తుంటాయి. అప్పుడు తమ వైపు నుంచి సమీక్షించుకోవాలి. ఖర్చు చేసేందుకు అదనపు వెసులుబాటు ఉందా? రివార్డుల పరంగా ఆ కార్డ్‌ మెరుగైనదా? లేదంటే తమ అవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక కార్డా? సెక్యూరిటీ ఫీచర్లు ఏ మేరకు? ఇవన్నీ చూడాలి. ముఖ్యంగా ఒక క్రెడిట్‌ కార్డ్‌తోనే ఒక వ్యక్తి క్రెడిట్‌ హిస్టరీ పరిమితం కాదు.

ఇతర బ్యాంక్‌ల నుంచి రుణాలు, కార్డ్‌లు తీసుకోవాల్సి వస్తే, మీ పరిస్థితి ఏంటన్నది కూడా చూడాలి. మంచి క్రెడిట్‌ స్కోర్, క్రెడిట్‌ హిస్టరీ ఉంటే ఇతర కార్డ్‌ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుంటాయి. ‘‘బ్యాంక్‌ ఇచి్చన ఆఫర్‌ తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగానే ఉందా? ఖర్చు చేసే ధోరణికి అనుకూలంగా ఉందా?మరిన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయా? వీటికి అవుననే సమాధానం వస్తే, అప్పుడు ఆ కార్డ్‌ ఆఫర్‌ను ఆమోదించొచ్చు.

తాజా ఆఫర్‌కు సంబంధించి షరతులు మీకు అనుకూలంగా లేకపోతే, మీ లక్ష్యాలకు అనుకూలమైన ఇతర కార్డ్‌ను పరిశీలించొచ్చు’’అని ఆదిల్‌ శెట్టి సూచించారు. క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్‌ పెంపు లేదా కార్డ్‌ అప్‌గ్రేడేషన్‌ అదనపు సదుపాయాలతో రావడమే కాదు, వార్షిక ఫీజు కూడా అధికంగా ఉంటుంది. అందుకని అప్‌గ్రేడ్‌ను ఎంపిక చేసుకునే ముందు పడే భారం ఎంత, ప్రయోజనాలు ఏ మేరకో చూడాలి. చాలా వరకు బ్యాంక్‌లు కార్డ్‌పై వార్షికంగా ఇంత వ్యయం చేస్తే, వార్షిక నిర్వహణ చార్జీని మాఫీ చేస్తున్నాయి. దీంతో సులభంగానే ఈ భారం పడకుండా చూసుకోవచ్చు.  

ఇలా అయితే సమ్మతి..
క్రెడిట్‌ కార్డ్‌ సంస్థ నుంచి ఎలాంటి ఆఫర్లు రానప్పుడు.. ఇంతకంటే మెరుగైన కార్డ్‌కు తాను అర్హుడినని భావిస్తే, అప్పుడు కార్డుదారుడే స్వయంగా లిమిట్‌ పెంచాలని లేదా కార్డ్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని కోరొచ్చు. ‘‘క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న తర్వాత తమ ఆదాయం పెరిగితే అప్పుడు క్రెడిట్‌ లిమిట్‌ పెంపునకు అర్హత లభించినట్టుగా భావించొచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీతో దీర్ఘకాల బంధం ఉన్నవారు తమ లిమిట్‌ పెంచుకునే అనుకూలతతో ఉంటారు.

కొన్ని ప్రయోజనాలు ప్రీ అప్రూవ్డ్‌ (ముందే ఆమోదించినది)గా ఉంటాయి’’అని శెట్టి వివరించారు. అప్‌గ్రేడ్‌ చేసుకోవడం, క్రెడిట్‌ లిమిట్‌ పెంచుకోవడం పూర్తిగా అవసరాల ప్రాతిపదికనే ఉండాలన్నది మర్చిపోవద్దు. ఆదాయం పెరిగినప్పుడు, మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడే క్రెడిట్‌ లిమిట్, క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడేషన్‌కు వెళ్లాలని మెహ్రా సూచిస్తున్నారు. ‘‘ఒక వ్యక్తి ఖర్చులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. కొంత కాలానికి ఇందులో మార్పు వస్తుంటుంది. అలాంటప్పుడు కార్డ్‌ను మార్చుకోవచ్చు.

ప్రస్తుత కార్డ్‌ ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు, అవి తమకు అనుకూలంగా లేకపోతే కార్డ్‌ అప్‌గ్రేడేషన్‌ను కోరొచ్చు. ఉదాహరణకు ఒక బ్యాంక్‌ ఒక కార్డ్‌ను ఉపసంహరించి, దాని స్థానంలో వేరేది ఇస్తున్నట్టు అయితే, అందులో ప్రయోజనాలు అంత ఆకర్షణీయంగా లేవనిపిస్తే అప్పుడు అప్‌గ్రేడ్‌ చేయాలని కోరొచ్చు’’అని మెహ్రా సూచించారు. అప్‌గ్రేడ్‌ ద్వారా తీసుకునే కార్డులో ప్రయోజనాలు తమకు అనుకూలంగా, ఆకర్షణీయంగా ఉన్నాయేమో చూసుకోవాలి. అంతేకానీ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని ఓకే చెప్పాల్సిన అవసరం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement