యాంగ్జై'టీ' కప్పులో.. | Generalized Anxiety Disorder | Sakshi
Sakshi News home page

యాంగ్జై'టీ' కప్పులో..

Published Wed, Feb 22 2017 10:33 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

యాంగ్జై'టీ' కప్పులో.. - Sakshi

యాంగ్జై'టీ' కప్పులో..

ఇసుక రేణువంత కష్టం ఒక్కోసారి
పర్వతమంత భారమైపోతుంది.
చిరుజల్లులా అనిపించాల్సిన చిన్నకష్టం కూడా తుఫానులా అనిపిస్తుంది.
ఈ మానసిక స్థితిని కంట్రోల్‌ చేయకపోతే...
కుటుంబంలో అనవసరమైన టెన్షన్‌ మిగిలిపోతుంది.
ప్రపంచాన్ని వేధిస్తున్న కొన్ని యాంగ్జైటీ డిజార్డర్లను అర్థం చేసుకుందాం.
ఆ తర్వాత ఆ ఆందోళన టీకప్పులో తుఫానులా అనిపిస్తుంది.

పొలంలోని పంట చేతికి రాక... చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక... చేతికి అందేంత దూరంలో పురుగులమందు డబ్బా ఉన్నప్పుడు దాన్ని అందుకుని దుర్బలుడయ్యే స్థితికీ... అందుకోకూడదు అన్న విచక్షణకూ మధ్య తారట్లాడే మనస్థితి అది. పరీక్ష రాసేందుకు బయల్దేరిన ఒక పిల్లవాడు తన సామర్థ్యాలు తెలిసి కూడా వాటిని సక్రమంగా నెరవేర్చగలనో లేనో అంటూ సంశయపడే వేళ కలిగే భావోద్వేగం అది. ఇక్కడి చదువైపోయి... అమెరికాలో కొలువొచ్చింది. కానీ ట్రంపాసురుడు మోకాలడ్డుతున్నాడు. ఏం చేయాలన్న పరిస్థితుల్లో కలిగే మానసిక స్థితి... వీటిన్నింటికీ ఓ పేరు పెడితే అది ‘యాంగై్జటీ’. ఇదో వెరైటీ వేదన. కాకపోతే ఇవి కాస్త అత్యంత తీవ్రస్థాయి భావాలు. కానీ దీన్లోనే ఒకింత కింది స్థాయి భావోద్వేగాలూ ఉంటాయి. కొత్తగా కారు నేర్చుకున్న తర్వాత, తొలిసారి సొంతకారును తానే సొంతంగా డ్రైవ్‌ చేస్తున్నప్పటి పరిస్థితి... తొలిసారి ఉద్యోగంలో చేరాక తన సీట్లో కూర్చున్నప్పటి మనఃస్థితి... ఇవి కాస్తంతసేపటి తర్వాత చల్లబడి... క్రమంగా సర్దుకునే పరిస్థితులు. కానీ మొదట పేర్కొన్న రెండూ మాత్రం చాలా తీవ్రమైనవి. ఆ మనస్థితి పేరే ‘యాంగై్జటీ’. ఆ యాంగై్జటీలలోని కొన్ని రకాలు...

1 జనరలైజ్‌డ్‌ యాంగ్జైటీ డిజార్డర్‌
కిరణ్‌కు 30 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.  ఉదయం ఆఫీస్‌కి లేట్‌ అవుతుందేమోనని టెన్షన్‌. బాస్‌ ఎక్స్‌ప్లనేషన్‌ అడుగుతాడేమోనని ఆందోళన. అడిగితే ఏం చెప్పాలి అనే బెంగ. తనకు అప్పజెప్పిన పని తనకెంతో సులువైనదైనా టైమ్‌కి కంప్లీట్‌ చేస్తానో లేదో అనే చింత. సాయంత్రం ఇంటికి వెళ్లేప్పుడూ అదే టెన్షన్‌ను పట్టుకెళ్తాడు. చివరకు నవ్వుతూ ఆడుకుంటున్న తన రెండేళ్ల కొడుకును చూసినా టెన్షనే. తప్పటడుగులతో ఎక్కడ కింద పడిపోతాడో, ఏ అసౌకర్యం కలిగి ఏడుస్తాడో అని. ఇలా  నిత్యం బెంగతో, ఏదో టెన్షన్‌తో బాధపడుతూ ఉండే పరిస్థితిని జనరలైజ్‌డ్‌ యాంగై్జటీ డిజార్డర్‌ (జీఏడీ) అని పేర్కొంటారు. దీని బారిన పడ్డ వ్యక్తులు మానసికంగా పూర్తిగా అలసిపోయినట్లుగా, అత్యంత నిస్సత్తువతో, తమలోని సహనం పూర్తిగా అయిపోయినట్లుగా ఫీలవుతుంటారు.

2 అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌
కల్పన ఇల్లును ఎంత నీట్‌గా పెడుతుందో! ఇంట్లోకి చిన్న దుమ్మురేణువునూ రానీయదని  చుట్టాల్లో కల్పనకు ఒక ఇమేజ్‌. కానీ ఆ అలవాటు ఇంట్లోవాళ్లను డామేజ్‌ చేస్తోంది. భర్తను, పిల్లలను ఏదీ ముట్టుకోనివ్వదు. వాళ్లు ఏది ముట్టుకున్నా ఆమె కడగాల్సిందే. పొద్దున్నుంచి పడుకోబోయే దాకా కల్పనకు ఒకటే పని... శుభ్రం చేయడం. పది సార్లు ఇల్లు ఊడ్వడం, తుడవడం, స్టవ్‌ వెలిగించి ఆర్పేసినా ప్లాట్‌ఫామ్‌తో సహా అంతా శుభ్రం చేయందే ఊరుకోదు. ఇంట్లో వాళ్లు టాయ్‌లెట్‌ను ఉపయోగిస్తే చాలు వెంటనే కడిగేస్తుంది. ఈ అతిశుభ్రంతో తిండీతిప్పలను కూడా మరిచిపోయి పీనుగులా తయారైంది. తన అతిశుభ్రంతో ఇంట్లోవాళ్లనూ చిరాకు పెడుతోంది.  దీన్నే అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ అంటారు. ఇది కూడా ఒక రకం యాంగై్జటీయే. ఒక వస్తువు తమ అనుకున్నంత శుభ్రంగా లేదని పడే యాంగై్జటీ ఇది.

3 సోషల్‌ యాంగ్జైటీ  డిజార్డర్‌
24 ఏళ్ల సంపత్‌. చాలా చలాకీగా ఉండేవాడు. చదువుల్లోనూ జెమ్‌. బీటెక్‌ కాగానే అమెరికాలో ఎమ్మెస్‌ చేయాలని ప్రయత్నం. బాగా చదివే కుర్రాడే. ఏమైందో ఏమో... జీఆర్‌ఈ, టోఫెల్‌ దేంట్లోనూ పాస్‌కాలేకపోయాడు. విపరీతమైన కన్‌ఫ్యూజన్‌. అయోమయం వల్ల వచ్చిన జవాబులనూ రాయలేకపోయాడు. ఎమ్మెస్‌ విషయం మరిచిపోయి ఇక్కడే ఉద్యోగవేటలో పడ్డాడు. అక్కడా చుక్కెదురే. తనవల్ల ఏమీ కాదు.. తాను ఏమీ చేయలేనని సిగ్గుతో బిక్కచచ్చిపోయాడు. బాధతో కుమిలిపోయాడు. ఈ బాధ చివరకు అతనిని ఎలా మార్చిందంటే ఎవరినీ లెక్కచేయని మొండిఘటంగా! చిన్నా, పెద్దా అనే తేడా మరిచిపోయి అందరితో చాలా అగ్రెసివ్‌గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇదే సోషల్‌ యాంగై్జటీ డిసార్డర్‌. 20 ఏళ్ల వారిలో కనీసం 80 శాతం మంది ఈ తరహా రుగ్మతకు లోనై అంతులేని వేదనను అనుభవిస్తుంటారు. అన్నీ తెలిసీ అయోమయంగా ఉండటం, చేయగలిగీ చేయలేనప్పుడు సిగ్గుతో బిక్కచచ్చిపోవడం, కుమిలిపోవడం, ఈ భావనలన్నీ తీవ్రంగా కలచివేస్తే ఒక్కోసారి సంఘవ్యతిరేకిగా మారడం.. ఇవన్నీ సోషల్‌ యాంగై్జటీ డిజార్డర్‌ లక్షణాలే.

4 ప్యానిక్‌ డిజార్డర్‌
సురేశ్‌కు డేరింగ్, డాషింగ్, డైనమిక్‌ అని పేరు. అతను ఒక్కడే పది మంది పెట్టు అని ఫీలయ్యేవాళ్లు సురేశ్‌ స్నేహితులు. ఎవరికి ఏ అవసరమొచ్చినా అర్ధరాత్రీ, అపరాత్రీ అని చూడకుండా సహాయానికి వెళ్లేవాడు. అలాంటి మనిషి ఇటీవల రాత్రి తొమ్మిదయిందంటే గడపదాటట్లేదు. ఒంటరిగా ఉండడానికి జంకు. కారణమేంటో అతని శ్రేయోభిలాషులకు అంతుచిక్కట్లేదు. ఇదే ప్యానిక్‌ డిజార్డర్‌. గతంలో ఒక అంశం ఎన్నడూ భయం కలిగించనిదే. అనేక సార్లు ఆ పని నిస్సంకోచంగా, విజయవంతంగా చేసి ఉంటాం. ఒక ప్రదేశానికి నిర్భయంగా వెళ్లి ఉంటాం. కానీ ఎందుకో ఆ పని చేయాలన్నా, అక్కడికి వెళ్లాలన్నా మునుపెన్నడూ లేనంత తీవ్రమైన భయం. అకస్మాత్తుగా కలిగే ఈ భావోద్వేగాలతో ఊపిరి సరిగా అందదు. మాట సరిగా రాదు. కళ్లు తిరుగుతాయి. వణుకు వస్తుంది. ఒళ్లంతా చల్లగా చెమటలు. వాంతి వస్తున్న భావన. ఒంట్లోంచి వేడి ఆవిర్లు. మన జనాభా మొత్తంలో ఐదు శాతం మంది ఈ రకమైన ప్యానిక్‌ డిజార్డర్‌ను వారి జీవితంలోని ఏదో ఒక దశలో ఏదో ఒక సమయంలోనైనా అనుభవించి ఉంటారు.

5 ఫోబియాలు
సురభికి బల్లి అంటే భయం. అది మిడిగుడ్లేసుకొని ఏ గోడ మీద కనిపించినా ఆమెకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. కుటుంబ సభ్యులు దాన్ని బయటకు పంపించేంత వరకు సురభి ఇంట్లోకి రాదు. దీన్నే ఫోబియా అంటారు. ఇదీ యాంగై్జటీయే. బల్లి అంటే సురభికి ఉన్న భయం మిగతావారికి అర్థంలేనిదిగా అనిపిస్తుంటుంది. ఈ భయం జంతువులు, క్రిమికీటకాలు, మనుషులు, వస్తువులు, ప్రదేశాలు, సంఘటనల (సిచ్యువేషన్స్‌) పట్లా  కావచ్చు.  ఎంత ధైర్యం చెప్పినా తీరని భయం అది.  ఈ ఫోబియాలనే యాంగై్జటీ జాబితాతో పూర్తిగా ఒక స్వతంత్ర విభాగమంతటి శాస్త్రవిజ్ఞాన భాండాగారం అందుబాటులో ఉంది.

6 పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌
2004లో వచ్చిన సునామీలో జయ అనే పధ్నాలుగేళ్ల అమ్మాయి ఇంటిని, ఇంటివాళ్లను పోగొట్టుకొని అనాథ అయింది. అనాథశరణాలయంలో చేరింది. అందరినీ పోగొట్టుకున్న బాధతో నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోయింది. ఆకలి, దప్పులు తెలిసేవి కావు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒంటి మీద స్పృహæ లేనిదానిలా తయారైంది. ఆమె పరిస్థితిని అదనుగా తీసుకున్న ఆ హోమ్‌ మేల్‌కుక్‌ ఆమె మీద లైంగిక దాడి చేశాడు. దాంతో మరింత కుంగిపోయింది జయ. అమ్మానాన్న, అక్క, తమ్ముడిని తన కళ్లముందే సముద్రం కబళించడం, కుక్‌ చేసిన అఘాయిత్యం పదేపదే గుర్తొచ్చి వణికిపోయేది. అర్ధరాత్రి ఉన్నట్టుండి దిగ్గున లేచి కూర్చొనేది. ఏ మగవాడు కనిపించినా.. అరిచేది. చివరకు తనకు చికిత్సచేసే డాక్టర్‌ తన దగ్గరకి వచ్చినా కేకలు పెట్టేది. పారిపోవడానికి ప్రయత్నించేది. ముచ్చెమటలతో మూలకు వెళ్లి  దాక్కునేది. జయ పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌తో బాధ పడుతోందని చెప్పారు మానసిక వైద్యులు. ఇదీ ఒక తరహా యాంగై్జటీయే.

7 సపరేషన్‌ యాంగ్జైటీ డిజార్డర్‌
భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు వారూ కొంత యాంగై్జటీకి లోనవుతుంటారు. భవిష్యత్తు పట్ల ఆందోళన పడుతుంటారు. ఇక ఆ దంపతుల పిల్లల్లోనూ తీవ్రమైన యాంగై్జటీ ఉంటుంది. తమ భవిష్యత్తు పట్ల తీవ్రమైన అభద్రత, భయం, ఆందోళన వారిని చుట్టుముడతాయి. దాంతో ఆ కుటుంబం అంతా అనుభవించే వేదన అంతా ఇంతా కాదు. దీన్ని సపరేషన్‌ యాంగై్జటీ డిజార్డర్‌గా కొందరు నిపుణులు పేర్కొంటారు. కాగా మరికొందరు దీన్ని సోషల్‌ యాంగై్జటీ డిజార్డర్‌లో భాగంగా చూస్తారు.

దురలవాట్లను దగ్గర చేసే యాంగ్జైటీ
యాంగై్జటీ వల్ల కలుగుతున్న ఉద్విగ్న స్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక... ఆ స్థితిని అధిగమించడానికి సిగరెట్‌ను ఆశ్రయిస్తారు. ఇలా రోగి చేరువయ్యే మరో దురలవాటు మద్యం. మద్యాన్ని ఆశ్రయించాక... ఇక ఆ మత్తు ఇచ్చే తాత్కాలికమైన అభయభ్రాంతి నుంచి దూరం కావాలని అనుకోరు. అలా మద్యానికి బానిసై కాలేయం, కిడ్నీలూ పాడుచేసుకుంటారు. మరికొందరు డ్రగ్స్‌కు బానిసలవుతారు. అందుకే యాంగై్జటీకి లోనయ్యేవారిని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి. నిత్యం మానసిక స్థైర్యాన్ని నూరిపోస్తూ, కడుపున పెట్టుకొని కాపాడుకుంటూ ఉండాలి.

యాంగ్జైటీ  చాలావరకు వారసత్వమే
యాంగై్జటీ సమస్యలు చాలావరకు వారసత్వంగానే వస్తుంటాయి. పేరెంట్స్‌లో ఒకరు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ, అస్థిమితంగా ఉండేవారైతే... వారి పిల్లలూ  పెద్దయ్యాక యాంగై్జటీకి లోనవుతారని చాలా అధ్యయనాల్లో  తేలింది. అయితే జీవశాస్త్రపరమైన అంశాలు, మానసికాంశాలు, పరిసరాలు, జీన్స్‌... ఈ నాలుగు అంశాలూ కలిసి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి.

చికిత్సలూ కాస్త విచిత్రాలే
యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడే రోగులకు ఇచ్చే చికిత్సల్లో సంప్రదాయ చికిత్సల్లా  మందులు ఇవ్వడం వంటివి అంతగా ఉండవు. మందులు ఇచ్చినా వాటితో పాటు అనేక రకాల చికిత్స ప్రక్రియలు కొనసాగిస్తారు. ఉదా: రోగికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌ ఇస్తూ... అతడితో మాట్లాడుతూ ఉండటం ∙తాను ఆందోళన పడే పరిస్థితులకు క్రమంగా ఎక్స్‌పోజ్‌ చేస్తూ, ఆ పరిస్థితులను అధిగమించే ధైర్యాన్ని సమకూర్చే వ్యూహాలు, ఎత్తుగడలు వంటివి పాటిం చేలా కోపింగ్‌ స్ట్రాటజీస్‌ అవలంబించడం.

యాంగ్జైటీలూ... కొన్ని నమ్మలేని నిజాలు
కొన్నిసార్లు  అంతులేని యాంగై్జటీ ఒత్తిడిలో చేసే పనులు ఒక్కోసారి ఊహించని విజయాలను తెచ్చిపెడతాయి. అయితే ఇవి చాలా అరుదు. సాధారణంగా ఈ ఒత్తిడితో నలిగిపోతూ సవ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే చాలా సందర్భాల్లో జరుగుతుంది. అది పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుంది.

⇒  పురుషులు / యువకులతో పోలిస్తే యాంగై్జటీకి లోనయ్యే అవకాశాలు, సందర్భాలు  మహిళలు / యువతులకే ఎక్కువ. సాధారణంగా వారు రేప్, లైంగికదాడి, అత్యాచారం వంటి సంఘటనలకు లోనైనప్పుడు, లేదా యుద్ధాల వంటి అవాంఛిత   అనర్థాలు కొనసాగే సమయంలో దాడులు మహిళల మీదే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి యాంగై్జటీ డిజార్డర్‌కు లోనయ్యే అవకాశాలు మహిళలకే ఎక్కువ. ∙యాంగై్జటీలకు లోనైనప్పుడు కలిగే మానసిక ప్రభావాలు మెదడుపై చాలా సంక్లిష్టమైన ముద్రలు వేస్తాయి.

యాంగై్జటీ కేవలం మానసికమైన సమస్యగానే చాలామంది భావిస్తుంటారు. కానీ యాంగై్జటీకి లోనైన వారు ఆయాసం, ఆస్తమాకు లోనవుతుంటారు. అలాగే కడుపునొప్పి, ఇతరత్రా భౌతిక సమస్యల రూపంలోనూ ఈ మానసిక సమస్య వ్యక్తమవుతుంటుంది. కొన్నిసార్లు డాక్టర్లు దీన్ని కేవలం శారీరకమైన, భౌతికమైన సమస్యగానే పొరబడి మందులు ఇస్తుంటారు. సమస్య ఎంతకూ తగ్గకపోవడంతో అప్పుడు అది యాంగై్జటీ వల్ల వచ్చిన పరిణామం కావచ్చని కాస్త ఆలస్యంగా డయాగ్నోజ్‌ చేస్తుంటారు. ఈ తరహా రోగులతో ఈ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ∙ఎన్నో యాంగై్జటీ సమస్యలు దీర్ఘకాలం కొనసాగి కొనసాగి దాన్ని గుండెజబ్బులకు దారితీస్తాయి. ∙కొన్ని రకాల యాంగై్జటీల వల్ల కడుపులో నిత్యం ఆహారాన్ని జీర్ణం చేసే యాసిడ్‌ను స్రవించేలా చేస్తుంది. ఇదే దీర్ఘకాలం కొనసాగడం వల్ల రోగికి దీర్ఘకాలిక గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ సమస్యలు ఉంటాయి. ఇవి స్టమక్‌ అల్సర్స్‌గా... దీర్ఘకాలం ఉండే ఆ అల్సర్లు... కడుపు క్యాన్సర్స్‌గా కూడా పరిణమిస్తాయి. అలా యాంగై్జటీలు క్యాన్సర్లకూ కారణమవుతాయి. ∙కేవలం గుండె, జీర్ణ వ్యవస్థ సమస్యలే గాక... దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలకూ యాంగై్జటీలు కారణమవుతాయి.

కారణమేదైనా వేదన ఒకటే... రకమేదైనా లక్షణాలు అవే...
క్లేశానికి కారణం ఏదైనా కావచ్చు. బాధకు దారితీసే పరిస్థితి వేరుగా ఉండవచ్చు. కానీ యాంగై్జటీకి గురవుతున్నవారిలో కనిపించే కామన్‌ లక్షణాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. వాటిలో కొన్ని ఇవి...
కండరాలు బిగుసుకు పోతుండటం / అకస్మాత్తుగా కండరం బిగుసుకుపోతుండటం.
గుండె లయ తప్పడం (ఇర్రెగ్యులర్‌ హార్ట్‌ బీట్‌)
⇒  అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్‌ అటాక్‌)
నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్‌ స్లీప్‌ పాట్రన్స్‌)
శ్వాససరిగా అందకపోవడం /బలంగా తీసుకోవడం / ఆయాస పడటం వంటి శ్వాస సంబంధిత సమస్యలు.

కారణాలు : యాంగై్జటీకి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణంలో వచ్చే పర్యావరణ సంబంధితమైన మామూలు కారణాలు మొదలుకొని ఎన్నో అంశాలు యాంగై్జటీకి దోహదపడతాయి. ఉదాహరణల్లో అన్నింటికంటే ముఖ్యమైనది ఆర్థికపరమైన సమస్యలు. ఇక పనిచేసే ప్రదేశంలో ఒత్తిళ్లు, అక్కడ నిర్ణయించే లక్ష్యాలు, చదువుకునే చోట్ల అగ్రగామిగా నిలవాల్సిన అవసరం కలిగించే ఒత్తిడి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, జీవనగమనంలో వచ్చే అవాంఛిత పరిస్థితులు (చాలా ఇష్టమైన వారు దూరం కావడం/మరణించడం వంటివి)... ఇలాంటి ఎన్నో అంశాలు యాంగై్జటీని కలిగించి మానసిక వేదనకు కారణమవుతాయి.
డాక్టర్‌ టి. నాగలక్ష్మి కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌
కిమ్స్‌ హాస్పిటల్‌ సికింద్రాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement