ఏజెన్సీలో ఉద్రిక్తత | Komaram Bheem Tension In Adilabad | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ఉద్రిక్తత

Published Tue, Jul 31 2018 1:26 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

Komaram Bheem Tension In Adilabad - Sakshi

కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ నాయకులు

సాక్షి, ఆసిఫాబాద్‌: ఏజెన్సీ సర్టిఫికెట్‌ విషయంలో వివాదంతో కుమురంభీం జిల్లాలో సోమవారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఆదివారం రాత్రి ఓ సందేశం వైరల్‌గా మారడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం ఒక దశలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందేమోనని అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. సిర్పూర్‌(యూ) మండలంలో ఎస్టీ సర్టిఫికెట్‌ జారీ విషయంలో జరిగిన వివాదం కాస్త ముదిరి కలెక్టరేట్‌ ముట్టడికి దారి తీసింది. జిల్లా పోలీసుల కృషితో సాయంత్రం వరకు పరిస్థితి అంతా సద్దుమణిగింది. సోమవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌తోపాటు వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్‌(యూ), లింగాపూర్,  తిర్యాణి మండలాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ మండలాల నుంచి ఎస్సైలను ఆసిఫాబాద్‌కు రప్పించి వజ్ర వాహనంతో గస్తీ నిర్వహించారు. కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు లంబాడ వర్గాలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి ఆదివాసీ గ్రామాల్లో మావా నాటే మావ రాజ్‌(మా ఊళ్లో మా రాజ్యం) పేరుతో లంబాడ ఉద్యోగులను బహిష్కరిస్తున్నారు.

దీంతో ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీలో రెవెన్యూ అధికారులు జంకుతున్నారు. రాజ్యాంగంలోని 342 ప్రకారం మొదటగా గుర్తించిన షెడ్యూల్డ్‌ కులాల్లో లంబాడ వర్గం ఆ జాబితాలో లేరని, వారిని 1976లో సవరణ ద్వారా చేర్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో తహసీల్దార్లు స్థానిక ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వాలా వద్దా ? అనే సందేహాలు రావడంతో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ ఈ విషయం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆ శాఖ కమిషనర్‌ క్రిస్టియానా జడ్‌ చాంగ్దూ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. వాటి ప్రకారం మొదట 1950లో పేర్కొన్న వర్గాలకు మాత్రమే ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఈ ఎస్టీ సర్టిఫికెట్‌ ఇవ్వడంగానీ, నిలిపివేయడం గానీ ఐటీడీఏ పీవో చైర్మన్‌గా, ఆర్డీవో, జిల్లా గిరిజ సంక్షేమ శాఖ అధికారి, ట్రైబల్‌ కమిషనర్‌ హైదరాబాద్‌ నుంచి ఒక అధికారిని సభ్యులుగా ఓ కమిటీ నిర్ధారిస్తుంది. ఈ నిబంధనలు అమలు చేయడంతో తాజాగా నిరసనలకు దారి తీసినట్లయింది.

ఏజెన్సీ సర్టిఫికెట్‌తో రాజుకున్న వివాదం
ఈ నెల 7న కుమురంభీం జిల్లా సిర్పూర్‌(యూ) మండలం దనోరా(పి)కి చెందిన లంబాడ యువకుడు అడె ప్రవీణ్‌కుమార్‌కు స్థానిక ఎస్టీ సర్టిఫికెట్‌ కోసం ఆ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసిన జీవో నంబర్‌ 24 ప్రకారం ఇవ్వడం కుదరని అప్పటి ఇన్‌చార్జి తహసీల్దార్‌ మస్కూర్‌ అలి ఆ యువకుడికి మెమొ ఇచ్చారు. ఈ మెమొలో జీవో నంబర్‌ 24ను పేర్కొంటూ కారణంగా చూపించారు. ఈ మెమొ జారీపై కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌కు ఫిర్యాదు అందడంతో కలెక్టర్‌ సదరు తహసీల్దార్‌ను వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహించి కలెక్టర్‌ తీరుకు నిరసగా సోమవారం మూకుమ్మడిగా పెద్దయెత్తున కలెక్టరేట్‌కు వినతిపత్రాలు ఇచ్చేందుకు తరలివచ్చారు. అంతేకాక ‘సంవిధాన్‌ పడో–ఆదివాసీ బచావో’(రాజ్యాంగం చదువు–ఆదివాసీని కాపాడుకో) అంటూ ప్రత్యేకంగా ఓ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నిరసన ఎక్కడ ఉగ్రరూపం దాల్చుతుందోనని పోలీసులు ముందస్తుగా ఏజెన్సీలో హై అలర్ట్‌ ప్రకటించారు.
 
ఫలించిన ఎస్పీ వ్యుహం...
ఆదివాసీలు నిరసనలు చేపడుతున్నారని తెలిసి ఎస్పీ కల్మేశ్వర్‌ సింగనేవార్‌ పరిస్థితిని ఆదిలో అదుపులోకి తెచ్చారు. ఆదివాసీలు సోమవారం కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున వస్తున్నరాన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ నాయకులు కలెక్టరేట్‌కు వచ్చేకంటే.. వాళ్లలో ఎంపిక చేసిన కొందరిని పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. నిరసనలు చేపడుతామని అనుకున్న వారిని శాంతియుతంగా చర్చలకు ఆహ్వానించారు. వారిలో ముఖ్యులతో దాదాపు గంటపైగా సమావేశం ఏర్పాటు చేయించారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో సమన్వయపరుస్తూ పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేశారు. వీరిలో కొందరు ఆదివాసీ నాయకులు చర్చల సందర్భంగా ఎస్పీ సార్‌ వచ్చినప్పటి నుంచి జిల్లాలో శాంతి భద్రతలకు సహకరిస్తున్నామని, ఆదివాసీలు ఇంత ఉద్యమం చేస్తున్నా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

రెవెన్యూ శాఖలో ఎస్టీ సర్టిఫికెట్ల జారీ.. ఇటీవల విద్యావాలంటీర్ల నియామకాలు, సీఆర్టీల ఎంపికలోనూ అదే అన్యాయం జరుగుతోందని ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు వివరించినట్లు సమాచారం. ఇటీవల తిర్యాణిలో ఆదివాసీలు ఆశ్రమ పాఠశాలల్లో జరిగిన నియామకాలను వ్యతిరేకించినా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నుంచి తిరిగి వారికే పోస్టింగ్‌ ఇవ్వడంతో జిల్లా ఉన్నతాధికారులపై నమ్మకం పోతోందని చర్చల సందర్భంగా వాపోయినట్లు ఆదివాసీ నాయకుడు ఒకరు ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలపై నమ్మకం పోయిందని జిల్లా ఉన్నతాధికారులే తమ శాంతియుత ఉద్యమాన్ని గుర్తించి భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. చర్చల సందర్భంగా నాయకులు చెప్పిన విషయాలు విన్నాక తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించగలుగుతామని వారికి వివరించారు. అంతేకాక చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించొద్దని ఎస్పీ ఆదివాసీ నాయకులకు పదే పదే విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
 
దుకాణాలు బంద్‌   
ఆసిఫాబాద్‌: ఆదివాసీల ఆందోళనను అంచనా వేసిన పోలీసులు ఏజెన్సీ మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గతంలో కలెక్టరేట్‌పై ఆదివాసీల దాడిని దృష్టిలో పెట్టుకుని పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం ఉదయం ఆసిఫాబాద్‌ ప్రధాన మార్కెట్‌లోని దుకాణాలను మూసి వేయించారు. తుడుందెబ్బ జిల్లా అద్యక్షుడు కొట్నాక విజయ్, ఆదివాసీ నాయకులు డీఎస్పీ సత్యనారాయణను కలిసి సమస్య వివరించారు. శాంతియుతంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని కోరడంతో సుమారు 40 మంది ఆదివాసీలు కలెక్టర్‌ ప్రశాంత్‌పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్‌ సింగనేవార్‌లను కలిసి సమస్య వివరించారు. కలెక్టర్, ఎస్పీ ఆదివాసీలతో చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

కలెక్టరేట్‌లో ఆదివాసీ నాయకులు

2
2/2

కలెక్టరేట్‌ వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement