Certificate issued
-
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, మానిటర్స్, మొబైల్స్ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్/మెంబర్షిప్ సర్టిఫికేట్ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్ మెషీన్స్ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. -
శాంతి కపోతం.. డీఎస్పీ సీతారెడ్డికి ఐరాస శాంతి పతకం
తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. ఈ ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) శుక్రవారం (భారత కాలమాన ప్రకారం) పీస్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఉన్నత విద్యనభ్యసించి పోలీసుగా... హైదరాబాద్‌కు చెందిన సీతారెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. నగరంలోనే వివిధ యూనివర్శిటీల్లో ఎంఏ (ఇంగ్లీష్), ఎంఏ (సైకాలజీ), ఎంఈడీ, సైబర్ క్రైమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1996లో సబ్–ఇన్స్పెక్టర్గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. ఇన్స్పెక్టర్, డీఎస్పీ హోదాల్లో నల్లగొండ టూ టౌన్, జీడిమెట్ల, సరూర్‌నగర్ ఉమెన్, పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పని చేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా సీతారెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు. రెండోసారి ఈ దళంలో పని... అంతర్గత ఘర్షణలతో అతలాకుతలం అవుతున్న సూడాన్, తైమోర్ తదితర దేశాల్లో శాంతి పరిరక్షణకు, అక్కడి పోలీసు విభాగానికి శిక్షణ ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి ఈ శాంతి పరిరక్షక దళాన్ని వినియోగిస్తోంది. వివిధ దేశాలకు చెందిన పోలీసు విభాగాల నుంచి ఏడాది సమయం పని చేయడానికి అధికారులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలతో పాటు డ్రైవింగ్, షూటింగ్ వంటి పోటీలు నిర్వహించి.. ఉత్తీర్ణులైన వారికే దళంలో పని చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది భారతదేశం నుంచి మొత్తం 29 మందికి ఈ అవకాశం దక్కగా... వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి సీతారెడ్డికే ఈ అవకాశం దక్కింది. ఇలా ఐక్యరాజ్య సమితి దళంలోకి ఈమె ఎంపిక కావడం ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండుసార్లు ఎంపికైన వాళ్లు ఇంకెవరూ లేరు. జూలై నుంచి జూబాలో విధులు... యూఎన్ శాంతిపరిరక్షక దళంలో పని చేయడానికి సీతారెడ్డి ఈ ఏడాది జూలై 19న సౌత్ సూడాన్ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడి జూబా ప్రాంతంలో ఉన్న పోలీసు ట్రై నింగ్ అండ్ సెన్సిటైజేషన్ యూనిట్లో పోలీసు అడ్వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో పని చేస్తూ ఎలాంటి ప్రతికూల రిమార్క్స్ లేని వారిని ఎంపిక చేసిన యూఎన్ శుక్రవారం పీస్ మెడల్, సర్టిఫికెట్ అందించింది. వీటిని అందుకున్న వారిలో సీతారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘సూడాన్ పోలీసుల్లో శక్తిసామర్థ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం మా విధి. పూర్తి ప్రతికూల వాతావరణంలో పని చేయడం కొత్త అనుభవాలను నేర్పిస్తోంది. యూఎన్ మార్గదర్శకాల ప్రకారం వారికి నేర్పడంతో పాటు ఎన్నో కొత్త అంశాలను ఇక్కడ నేర్చుకోగలుగుతున్నా’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో సభ్యురాలిగా సీతారెడ్డి (ఎడమనుండి రెండవ వ్యక్తి) – శ్రీరంగం కామేష్ ,సాక్షి సిటీ బ్యూరో -
ఓయూ టు యూఎస్ నేరుగా సర్టిఫికెట్ల జారీ
వందేళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచస్థాయి వర్సిటీలకు పోటీగా నిలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల అనంతరం ఓయూలో దరఖాస్తుల విధానం మొదలు.. పరీక్షలు, ఫలితాలు,కౌన్సెలింగ్, మూల్యాంకనం, ఫీజుల చెల్లింపు, సర్టిఫికెట్ల జారీ తదితర సేవలన్నింటినీ ఆన్లైన్ చేశారు. ఓయూలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్లు పొందే ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ: వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ అన్ని అంశాల్లో ప్రపంచస్థాయి వర్సిటీలకు పోటీగా నిలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల అనంతరం ఓయూలో అన్ని సేవలను ఆన్లైన్ చేశారు. దరఖాస్తు మొదలు పరీక్షలు, ఫలితాలు, కౌన్సెలింగ్, మూల్యాంకణం, ఫీజుల చెల్లింపు, సర్టిఫిక్కెట్ల జారీ తదితర సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఓయూలో విద్యాభ్యాసం చేసిన వారు అమెరికాతో సహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎంత దూరంలో ఉన్న వారికైనా సర్టిఫికెట్లు అందించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఓయూలో చదివి మారుమూల ప్రాంతాలు, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులెవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విధానంలో 270 కోర్సుల సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. వెరీ అర్జెంట్ మోడ్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు కేవలం రెండు రోజుల్లో సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఎగ్జామినేషన్ విభాగంలో డిగ్రీ కోర్సుల ఆన్లైన్ మూల్యంకణం కోసం కొత్తగా 400 కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను కల్పించినట్లు తెలిపారు. ఓయూలో డబ్ల్యూఎస్ సేవలు ఓయూలో వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ (డబ్ల్యూస్) సేవలు అందిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రాన్స్స్క్రిఫ్టులు, ఇతర సర్టిఫికెట్లను అంతర్జాతీయ స్పీడ్ పోస్టు ద్వారా విద్యార్థులకు చేరవేస్తున్నామన్నారు. వాటి వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థులకు ట్రాకింగ్ ఐడీని ఇస్తామన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు మార్కుల జాబితాలు కాకుండా నేరుగా ప్రింట్ చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎస్డీఎల్ సర్టిఫికెట్ల డిపాజిట్ ఎంహెచ్ఆర్డీ ఆదేశాల మేరకు నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్‌లో భాగంగా ఓయూలో చదివిన విద్యార్థుల అకాడమిక్ రికార్డులను ఆన్లైన్లో పొందపర్చనున్నట్లు కంట్రోలర్ పేర్కొన్నారు. ఓయూలోని 270 కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లను నేషనల్ సెక్యురిటీ డిపాజిట్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) వెబ్సైట్లో ఉచితంగా పొందపర్చామన్నారు. మొదటి విడతలో భాగంగా 2005 విద్యా సంవత్సరం నుంచి 10.20 లక్షల మంది విద్యార్థుల డిగ్రీ సర్టిఫికెట్లను ఆన్లైన్లో ఉంచామని. భవిష్యత్తులో అంతకు ముందు విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం ఆన్లైన్లో పెడుతామన్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌లో పొందపరచిన సర్టిఫిక్కెట్ల 17 విధాలుగా ఉపయోగించుకోవచ్చునని, అవసరమైతే ఎన్ఎస్డీఎల్ నుంచి డిజిటల్ సర్టిఫికెట్ పొందవచ్చునని తెలిపారు. దేశ, విదేశాల్లో ఓయూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఎన్ఎస్డీఎల్ ద్వారా సర్టిఫికెట్లను నేరుగా వెరిఫికేషన్ చేసుకోవచ్చునన్నారు. అయితే దూరవిద్య డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులకు ఈ అవకాశం అందుబాటులో లేదన్నారు. ఇంటి నుంచే పీజీ, పీహెచ్డీ మూల్యాంకనం ఓయూలో ఇకపై పీజీ, పీహెచ్డీ కోర్సుల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యంకనం అధ్యాపకుల ఇల్లలోనే చేస్తారని కంట్రోలర్ తెలినారు. జవాబు పత్రాలను స్కాన్ చేసిన అనంతరం ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల వెబ్సైట్లకు డౌన్లోడ్ చేస్తామని, ప్రతి అధ్యాపకుని పని తీరును ఓటీపీ నంబర్ ద్వారా తెలుసుకుంటామన్నారు. పీహెచ్డీ థిసీస్‌ను కూడ దేశ వ్యాప్తంగా అధ్యాపకులకు ఆన్లైన్ ద్వారా పంపించి పరిశీలించాలని కోరనున్నట్లు తెలిపారు. తద్వారా సమయం ఆదా కావడమే కాకుండా నాణ్యమైన పరిశోధనలు వెలుగులోకి వస్తాయన్నారు. విచారణ విభాగం పునరుద్ధరణ ఓయూ ఎగ్జామినేషన్ కార్యాలయంలో మూతపడిన విచారణ విభాగాన్ని పునరుద్ధరించినట్లు కంట్రోలర్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చే విద్యార్థులకు తక్షణ సమాచారం కోసం ఎంక్వైరీ కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈడీపీ విభాగం, కంట్రోలర్ పేషీలో రెండు కొత్త సెల్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవసరమైన వారు కంట్రోలర్ పేషీ నంబర్ 7569989081, ఈడీపీ సెక్షన్ నంబర్ 7569998409 సంప్రదించాలని సూచించారు. -
జల్లికట్టుకు ‘గిన్నిస్’లో చోటు
సాక్షి, చెన్నై: తమిళుల సాహసక్రీడ జల్లికట్టు గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం పుదుకోట్టై జిల్లా విరాళిమలైలో జరిగిన జల్లికట్టుకు గిన్నిస్ ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు. అయితే, ఈ క్రీడ తిలకించేందుకు వచ్చిన ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఎద్దులను అదుపులోకి తెచ్చేందుకు యత్నించి 31 మంది గాయాలపాలయ్యారు. గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగంగా విరాళి మలైలో జల్లికట్టుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. 1,354 ఎద్దులను రంగంలోకి దించిన నిర్వాహకులు వీటిని పట్టుకునేందుకు మాత్రం 424 క్రీడాకారులనే అనుమతించారు. తొలుత 2,000కుపైగా ఎద్దులను బరిలోకి దించాలని భావించినప్పటికీ సమయాభావం కారణంగా కుదరలేదు. పోటీలో ఎద్దుల సంఖ్య ఎక్కువ, పాల్గొనేవారి సంఖ్య తక్కువ కావడంతో క్రీడాకారులతో పాటు సందర్శకులకు కూడా వైద్య బీమా కల్పించారు. ఎద్దులతో జరిగిన పోరులో దాదాపు 31 మంది గాయపడ్డారు. తిలకించేందుకు వచ్చిన వారిపైకి ఎద్దులు దూసుకు పోవడంతో రాము(25), సతీష్(43) అనే వారు ప్రాణాలు కోల్పోయారు. బసవన్నలను అదుపు చేసిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కాగా, భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు దక్కినందుకు లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
ఏజెన్సీలో ఉద్రిక్తత
సాక్షి, ఆసిఫాబాద్: ఏజెన్సీ సర్టిఫికెట్ విషయంలో వివాదంతో కుమురంభీం జిల్లాలో సోమవారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఆదివారం రాత్రి ఓ సందేశం వైరల్‌గా మారడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం ఒక దశలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందేమోనని అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. సిర్పూర్(యూ) మండలంలో ఎస్టీ సర్టిఫికెట్ జారీ విషయంలో జరిగిన వివాదం కాస్త ముదిరి కలెక్టరేట్ ముట్టడికి దారి తీసింది. జిల్లా పోలీసుల కృషితో సాయంత్రం వరకు పరిస్థితి అంతా సద్దుమణిగింది. సోమవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌తోపాటు వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ మండలాల నుంచి ఎస్సైలను ఆసిఫాబాద్‌కు రప్పించి వజ్ర వాహనంతో గస్తీ నిర్వహించారు. కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు లంబాడ వర్గాలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఆదివాసీ గ్రామాల్లో మావా నాటే మావ రాజ్(మా ఊళ్లో మా రాజ్యం) పేరుతో లంబాడ ఉద్యోగులను బహిష్కరిస్తున్నారు. దీంతో ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీలో రెవెన్యూ అధికారులు జంకుతున్నారు. రాజ్యాంగంలోని 342 ప్రకారం మొదటగా గుర్తించిన షెడ్యూల్డ్ కులాల్లో లంబాడ వర్గం ఆ జాబితాలో లేరని, వారిని 1976లో సవరణ ద్వారా చేర్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో తహసీల్దార్లు స్థానిక ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలా వద్దా ? అనే సందేహాలు రావడంతో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఈ విషయం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆ శాఖ కమిషనర్ క్రిస్టియానా జడ్ చాంగ్దూ ఓ సర్క్యులర్ జారీ చేశారు. వాటి ప్రకారం మొదట 1950లో పేర్కొన్న వర్గాలకు మాత్రమే ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఈ ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వడంగానీ, నిలిపివేయడం గానీ ఐటీడీఏ పీవో చైర్మన్‌గా, ఆర్డీవో, జిల్లా గిరిజ సంక్షేమ శాఖ అధికారి, ట్రైబల్ కమిషనర్ హైదరాబాద్ నుంచి ఒక అధికారిని సభ్యులుగా ఓ కమిటీ నిర్ధారిస్తుంది. ఈ నిబంధనలు అమలు చేయడంతో తాజాగా నిరసనలకు దారి తీసినట్లయింది. ఏజెన్సీ సర్టిఫికెట్తో రాజుకున్న వివాదం ఈ నెల 7న కుమురంభీం జిల్లా సిర్పూర్(యూ) మండలం దనోరా(పి)కి చెందిన లంబాడ యువకుడు అడె ప్రవీణ్‌కుమార్‌కు స్థానిక ఎస్టీ సర్టిఫికెట్ కోసం ఆ మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 24 ప్రకారం ఇవ్వడం కుదరని అప్పటి ఇన్చార్జి తహసీల్దార్ మస్కూర్ అలి ఆ యువకుడికి మెమొ ఇచ్చారు. ఈ మెమొలో జీవో నంబర్ 24ను పేర్కొంటూ కారణంగా చూపించారు. ఈ మెమొ జారీపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌కు ఫిర్యాదు అందడంతో కలెక్టర్ సదరు తహసీల్దార్‌ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహించి కలెక్టర్ తీరుకు నిరసగా సోమవారం మూకుమ్మడిగా పెద్దయెత్తున కలెక్టరేట్‌కు వినతిపత్రాలు ఇచ్చేందుకు తరలివచ్చారు. అంతేకాక ‘సంవిధాన్ పడో–ఆదివాసీ బచావో’(రాజ్యాంగం చదువు–ఆదివాసీని కాపాడుకో) అంటూ ప్రత్యేకంగా ఓ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నిరసన ఎక్కడ ఉగ్రరూపం దాల్చుతుందోనని పోలీసులు ముందస్తుగా ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఫలించిన ఎస్పీ వ్యుహం... ఆదివాసీలు నిరసనలు చేపడుతున్నారని తెలిసి ఎస్పీ కల్మేశ్వర్ సింగనేవార్ పరిస్థితిని ఆదిలో అదుపులోకి తెచ్చారు. ఆదివాసీలు సోమవారం కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున వస్తున్నరాన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ నాయకులు కలెక్టరేట్‌కు వచ్చేకంటే.. వాళ్లలో ఎంపిక చేసిన కొందరిని పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. నిరసనలు చేపడుతామని అనుకున్న వారిని శాంతియుతంగా చర్చలకు ఆహ్వానించారు. వారిలో ముఖ్యులతో దాదాపు గంటపైగా సమావేశం ఏర్పాటు చేయించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో సమన్వయపరుస్తూ పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేశారు. వీరిలో కొందరు ఆదివాసీ నాయకులు చర్చల సందర్భంగా ఎస్పీ సార్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో శాంతి భద్రతలకు సహకరిస్తున్నామని, ఆదివాసీలు ఇంత ఉద్యమం చేస్తున్నా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలో ఎస్టీ సర్టిఫికెట్ల జారీ.. ఇటీవల విద్యావాలంటీర్ల నియామకాలు, సీఆర్టీల ఎంపికలోనూ అదే అన్యాయం జరుగుతోందని ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు వివరించినట్లు సమాచారం. ఇటీవల తిర్యాణిలో ఆదివాసీలు ఆశ్రమ పాఠశాలల్లో జరిగిన నియామకాలను వ్యతిరేకించినా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నుంచి తిరిగి వారికే పోస్టింగ్ ఇవ్వడంతో జిల్లా ఉన్నతాధికారులపై నమ్మకం పోతోందని చర్చల సందర్భంగా వాపోయినట్లు ఆదివాసీ నాయకుడు ఒకరు ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలపై నమ్మకం పోయిందని జిల్లా ఉన్నతాధికారులే తమ శాంతియుత ఉద్యమాన్ని గుర్తించి భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. చర్చల సందర్భంగా నాయకులు చెప్పిన విషయాలు విన్నాక తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించగలుగుతామని వారికి వివరించారు. అంతేకాక చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించొద్దని ఎస్పీ ఆదివాసీ నాయకులకు పదే పదే విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. దుకాణాలు బంద్ ఆసిఫాబాద్: ఆదివాసీల ఆందోళనను అంచనా వేసిన పోలీసులు ఏజెన్సీ మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గతంలో కలెక్టరేట్‌పై ఆదివాసీల దాడిని దృష్టిలో పెట్టుకుని పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం ఉదయం ఆసిఫాబాద్ ప్రధాన మార్కెట్లోని దుకాణాలను మూసి వేయించారు. తుడుందెబ్బ జిల్లా అద్యక్షుడు కొట్నాక విజయ్, ఆదివాసీ నాయకులు డీఎస్పీ సత్యనారాయణను కలిసి సమస్య వివరించారు. శాంతియుతంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని కోరడంతో సుమారు 40 మంది ఆదివాసీలు కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్ సింగనేవార్లను కలిసి సమస్య వివరించారు. కలెక్టర్, ఎస్పీ ఆదివాసీలతో చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి
అధికారులపై ‘ఎర్రబెల్లి’ ఫైర్ రాయపర్తి: ‘ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజాసేవ చేయండి. లేదంటే ఏటూరునాగారానికి పంపిస్తా’ అని పాలకుర్తి ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఎర్రబెల్లి మాట్లాడారు. పహానీ, పట్టాల్లో సవరణలు, సర్టిఫికెట్ల జారీ తదితర అంశాల్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తావించగా, దయూకర్‌రావు మాట్లాడారు. ప్రజా సమస్యలపై అధికారులు సూటిగా స్పందించాలని ఘాటుగా హెచ్చరించారు. అలాకాకుంటే ఏటూరునాగారానికి పంపించేలా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. సమీక్షకు గైర్హాజరైన పలు శాఖల అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.