వందేళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచస్థాయి వర్సిటీలకు పోటీగా నిలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల అనంతరం ఓయూలో దరఖాస్తుల విధానం మొదలు.. పరీక్షలు, ఫలితాలు,కౌన్సెలింగ్, మూల్యాంకనం, ఫీజుల చెల్లింపు, సర్టిఫికెట్ల జారీ తదితర సేవలన్నింటినీ ఆన్‌లైన్ చేశారు. ఓయూలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నేరుగా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు పొందే ఏర్పాట్లు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ: వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ అన్ని అంశాల్లో ప్రపంచస్థాయి వర్సిటీలకు పోటీగా నిలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల అనంతరం ఓయూలో అన్ని సేవలను ఆన్‌లైన్ చేశారు. దరఖాస్తు మొదలు పరీక్షలు, ఫలితాలు, కౌన్సెలింగ్, మూల్యాంకణం, ఫీజుల చెల్లింపు, సర్టిఫిక్కెట్ల జారీ తదితర సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఓయూలో విద్యాభ్యాసం చేసిన వారు అమెరికాతో సహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నేరుగా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎంత దూరంలో ఉన్న వారికైనా సర్టిఫికెట్లు అందించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఓయూలో చదివి మారుమూల ప్రాంతాలు, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులెవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విధానంలో 270 కోర్సుల సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. వెరీ అర్జెంట్ మోడ్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు కేవలం రెండు రోజుల్లో సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఎగ్జామినేషన్ విభాగంలో డిగ్రీ కోర్సుల ఆన్‌లైన్ మూల్యంకణం కోసం కొత్తగా 400 కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను కల్పించినట్లు తెలిపారు.
ఓయూలో డబ్ల్యూఎస్ సేవలు
ఓయూలో వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ (డబ్ల్యూస్) సేవలు అందిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రాన్స్‌స్క్రిఫ్టులు, ఇతర సర్టిఫికెట్లను అంతర్జాతీయ స్పీడ్ పోస్టు ద్వారా విద్యార్థులకు చేరవేస్తున్నామన్నారు. వాటి వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థులకు ట్రాకింగ్ ఐడీని ఇస్తామన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు మార్కుల జాబితాలు కాకుండా నేరుగా ప్రింట్ చేసి ఇస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌ఎస్‌డీఎల్ సర్టిఫికెట్ల డిపాజిట్
ఎంహెచ్‌ఆర్డీ ఆదేశాల మేరకు నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ (ఎన్‌ఏడీ) స్కీమ్‌లో భాగంగా ఓయూలో చదివిన విద్యార్థుల అకాడమిక్ రికార్డులను ఆన్‌లైన్‌లో పొందపర్చనున్నట్లు కంట్రోలర్ పేర్కొన్నారు. ఓయూలోని 270 కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లను నేషనల్ సెక్యురిటీ డిపాజిట్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) వెబ్‌సైట్‌లో ఉచితంగా పొందపర్చామన్నారు. మొదటి విడతలో భాగంగా 2005 విద్యా సంవత్సరం నుంచి 10.20 లక్షల మంది విద్యార్థుల డిగ్రీ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామని. భవిష్యత్తులో అంతకు ముందు విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం ఆన్‌లైన్‌లో పెడుతామన్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌లో పొందపరచిన సర్టిఫిక్కెట్ల 17 విధాలుగా ఉపయోగించుకోవచ్చునని, అవసరమైతే ఎన్‌ఎస్‌డీఎల్ నుంచి డిజిటల్ సర్టిఫికెట్ పొందవచ్చునని తెలిపారు. దేశ, విదేశాల్లో ఓయూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా సర్టిఫికెట్లను నేరుగా వెరిఫికేషన్ చేసుకోవచ్చునన్నారు. అయితే దూరవిద్య డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులకు ఈ అవకాశం అందుబాటులో లేదన్నారు.
ఇంటి నుంచే పీజీ, పీహెచ్‌డీ
మూల్యాంకనం
ఓయూలో ఇకపై పీజీ, పీహెచ్‌డీ కోర్సుల జవాబు పత్రాల ఆన్‌లైన్ మూల్యంకనం అధ్యాపకుల ఇల్లలోనే చేస్తారని కంట్రోలర్ తెలినారు. జవాబు పత్రాలను స్కాన్ చేసిన అనంతరం ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల వెబ్‌సైట్లకు డౌన్‌లోడ్ చేస్తామని, ప్రతి అధ్యాపకుని పని తీరును ఓటీపీ నంబర్ ద్వారా తెలుసుకుంటామన్నారు. పీహెచ్‌డీ థిసీస్‌ను కూడ దేశ వ్యాప్తంగా అధ్యాపకులకు ఆన్‌లైన్ ద్వారా పంపించి పరిశీలించాలని కోరనున్నట్లు తెలిపారు. తద్వారా సమయం ఆదా కావడమే కాకుండా నాణ్యమైన పరిశోధనలు వెలుగులోకి వస్తాయన్నారు.
విచారణ విభాగం పునరుద్ధరణ
ఓయూ ఎగ్జామినేషన్ కార్యాలయంలో మూతపడిన విచారణ విభాగాన్ని పునరుద్ధరించినట్లు కంట్రోలర్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చే విద్యార్థులకు తక్షణ సమాచారం కోసం ఎంక్వైరీ కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈడీపీ విభాగం, కంట్రోలర్ పేషీలో రెండు కొత్త సెల్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవసరమైన వారు కంట్రోలర్ పేషీ నంబర్ 7569989081, ఈడీపీ సెక్షన్ నంబర్ 7569998409 సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment