శాంతి కపోతం.. డీఎస్పీ సీతారెడ్డికి ఐరాస శాంతి పతకం | Telangana police officer Pedda Reddy Seetha reddy received UNO award | Sakshi
Sakshi News home page

శాంతి కపోతం.. డీఎస్పీ సీతారెడ్డికి ఐరాస శాంతి పతకం

Published Sat, Oct 23 2021 12:34 AM | Last Updated on Sat, Oct 23 2021 1:04 AM

Telangana police officer Pedda Reddy Seetha reddy received UNO award - Sakshi

తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. ఈ ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) శుక్రవారం (భారత కాలమాన ప్రకారం) పీస్‌ మెడల్, సర్టిఫికెట్‌ ప్రదానం చేసింది.

ఉన్నత విద్యనభ్యసించి పోలీసుగా...
హైదరాబాద్‌కు చెందిన సీతారెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. నగరంలోనే వివిధ యూనివర్శిటీల్లో ఎంఏ (ఇంగ్లీష్‌), ఎంఏ (సైకాలజీ), ఎంఈడీ, సైబర్‌ క్రైమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1996లో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ హోదాల్లో నల్లగొండ టూ టౌన్, జీడిమెట్ల, సరూర్‌నగర్‌ ఉమెన్, పేట్‌ బషీరాబాద్‌ పోలీసుస్టేషన్లతో పాటు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లో పని చేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా సీతారెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు.

రెండోసారి ఈ దళంలో పని...
అంతర్గత ఘర్షణలతో అతలాకుతలం అవుతున్న సూడాన్, తైమోర్‌ తదితర దేశాల్లో శాంతి పరిరక్షణకు, అక్కడి పోలీసు విభాగానికి శిక్షణ ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి ఈ శాంతి పరిరక్షక దళాన్ని వినియోగిస్తోంది. వివిధ దేశాలకు చెందిన పోలీసు విభాగాల నుంచి ఏడాది సమయం పని చేయడానికి అధికారులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలతో పాటు డ్రైవింగ్, షూటింగ్‌ వంటి పోటీలు నిర్వహించి.. ఉత్తీర్ణులైన వారికే దళంలో పని చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది భారతదేశం నుంచి మొత్తం 29 మందికి ఈ అవకాశం దక్కగా... వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి సీతారెడ్డికే ఈ అవకాశం దక్కింది. ఇలా ఐక్యరాజ్య సమితి దళంలోకి ఈమె ఎంపిక కావడం ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండుసార్లు ఎంపికైన వాళ్లు ఇంకెవరూ లేరు.

జూలై నుంచి జూబాలో విధులు...
యూఎన్‌ శాంతిపరిరక్షక దళంలో పని చేయడానికి సీతారెడ్డి ఈ ఏడాది జూలై 19న సౌత్‌ సూడాన్‌ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడి జూబా ప్రాంతంలో ఉన్న పోలీసు ట్రై నింగ్‌ అండ్‌ సెన్సిటైజేషన్‌ యూనిట్‌లో పోలీసు అడ్వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో పని చేస్తూ ఎలాంటి ప్రతికూల రిమార్క్స్‌ లేని వారిని ఎంపిక చేసిన యూఎన్‌ శుక్రవారం పీస్‌ మెడల్, సర్టిఫికెట్‌ అందించింది. వీటిని అందుకున్న వారిలో సీతారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ... ‘సూడాన్‌ పోలీసుల్లో శక్తిసామర్థ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం మా విధి. పూర్తి ప్రతికూల వాతావరణంలో పని చేయడం కొత్త అనుభవాలను నేర్పిస్తోంది. యూఎన్‌ మార్గదర్శకాల ప్రకారం వారికి నేర్పడంతో పాటు ఎన్నో కొత్త అంశాలను ఇక్కడ నేర్చుకోగలుగుతున్నా’ అని అన్నారు.

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో సభ్యురాలిగా సీతారెడ్డి (ఎడమనుండి రెండవ వ్యక్తి)

– శ్రీరంగం కామేష్‌ ,సాక్షి సిటీ బ్యూరో

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement