peacekeeping operations
-
Rahul Gandhi: పార్లమెంట్లో నిలదీస్తాం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతిస్థాపన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడతామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నెలకొన్న విషాదాన్ని పారద్రోలి శాంతినెలకొనేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి అక్కడి వారి బాధలను అర్ధంచేసుకుని ఘర్షణలకు చరమగీతం పాడాలని కోరారు. ఈ మేరకు ఇటీవల ఆయన మణిపూర్‌లో పర్యటన, బాధితులతో మాట్లాడటం తదితర ఘటనల వీడియోను గురువారం ‘ఎక్స్’లో షేర్చేస్తూ హిందీలో పలు పోస్ట్‌లుచేశారు. ‘మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక మూడుసార్లు రాష్ట్రంలో పర్యటించా. ఇన్నిరోజులైన అక్కడి పరిస్థితిలో మార్పురాలేదు. ఇప్పటికీ అక్కడి జనం రెండు వర్గాలుగా విడిపోయి బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు. వేలాది కుటుంబాలు దిక్కులేక శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. ప్రధాని మోదీ వ్యక్తిగతంగానైనా ఒక్కసారి మణిపూర్‌లో పర్యటించి అక్కడి వారి బాధలను వినాలి. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి’ అని అన్నారు. ‘పార్లమెంట్లో మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తాం. శాంతిస్థాపన కోసం చర్యలు తీసుకునేదాకా కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి మోదీ సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాయి’ అని అన్నారు. ‘ మీ వాణిని పార్లమెంట్లో వినిపిస్తాగానీ మీరు శరణార్థి శిబిరాలను వీడి స్వస్థలాలకు ఎప్పటికల్లా వెళ్లగలరు? అనే ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం వద్దే ఉంది’’ అని అన్నారు. -
శాంతి కోసం స్త్రీ శక్తి
ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్... సుడాన్, దక్షిణ సుడాన్‌ల సరిహద్దు నగరం అభేయ్. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్‌లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి. సుడాన్, దక్షిణ సుడాన్‌ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్ చేపడుతున్న పీస్‌కీపింగ్ మిషన్లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్ కోసం మన దేశం 2007లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్. మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్‌మోడల్‌గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. 2007లోనే ‘ఆల్ ఉమెన్’ టీమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ‘ఛాంపియన్ ఆఫ్ జెండర్ మెయిన్‌స్ట్రీమింగ్’గా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు. తాజాగా ‘అభేయ్’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్ సింగిల్ యూనిట్’గా ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే... కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు. -
శాంతి కపోతం.. డీఎస్పీ సీతారెడ్డికి ఐరాస శాంతి పతకం
తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. ఈ ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) శుక్రవారం (భారత కాలమాన ప్రకారం) పీస్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఉన్నత విద్యనభ్యసించి పోలీసుగా... హైదరాబాద్‌కు చెందిన సీతారెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. నగరంలోనే వివిధ యూనివర్శిటీల్లో ఎంఏ (ఇంగ్లీష్), ఎంఏ (సైకాలజీ), ఎంఈడీ, సైబర్ క్రైమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1996లో సబ్–ఇన్స్పెక్టర్గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. ఇన్స్పెక్టర్, డీఎస్పీ హోదాల్లో నల్లగొండ టూ టౌన్, జీడిమెట్ల, సరూర్‌నగర్ ఉమెన్, పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పని చేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా సీతారెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు. రెండోసారి ఈ దళంలో పని... అంతర్గత ఘర్షణలతో అతలాకుతలం అవుతున్న సూడాన్, తైమోర్ తదితర దేశాల్లో శాంతి పరిరక్షణకు, అక్కడి పోలీసు విభాగానికి శిక్షణ ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి ఈ శాంతి పరిరక్షక దళాన్ని వినియోగిస్తోంది. వివిధ దేశాలకు చెందిన పోలీసు విభాగాల నుంచి ఏడాది సమయం పని చేయడానికి అధికారులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలతో పాటు డ్రైవింగ్, షూటింగ్ వంటి పోటీలు నిర్వహించి.. ఉత్తీర్ణులైన వారికే దళంలో పని చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది భారతదేశం నుంచి మొత్తం 29 మందికి ఈ అవకాశం దక్కగా... వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి సీతారెడ్డికే ఈ అవకాశం దక్కింది. ఇలా ఐక్యరాజ్య సమితి దళంలోకి ఈమె ఎంపిక కావడం ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండుసార్లు ఎంపికైన వాళ్లు ఇంకెవరూ లేరు. జూలై నుంచి జూబాలో విధులు... యూఎన్ శాంతిపరిరక్షక దళంలో పని చేయడానికి సీతారెడ్డి ఈ ఏడాది జూలై 19న సౌత్ సూడాన్ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడి జూబా ప్రాంతంలో ఉన్న పోలీసు ట్రై నింగ్ అండ్ సెన్సిటైజేషన్ యూనిట్లో పోలీసు అడ్వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో పని చేస్తూ ఎలాంటి ప్రతికూల రిమార్క్స్ లేని వారిని ఎంపిక చేసిన యూఎన్ శుక్రవారం పీస్ మెడల్, సర్టిఫికెట్ అందించింది. వీటిని అందుకున్న వారిలో సీతారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘సూడాన్ పోలీసుల్లో శక్తిసామర్థ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం మా విధి. పూర్తి ప్రతికూల వాతావరణంలో పని చేయడం కొత్త అనుభవాలను నేర్పిస్తోంది. యూఎన్ మార్గదర్శకాల ప్రకారం వారికి నేర్పడంతో పాటు ఎన్నో కొత్త అంశాలను ఇక్కడ నేర్చుకోగలుగుతున్నా’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో సభ్యురాలిగా సీతారెడ్డి (ఎడమనుండి రెండవ వ్యక్తి) – శ్రీరంగం కామేష్ ,సాక్షి సిటీ బ్యూరో -
నేరాలకు సంకెళ్లు!
సాక్షి, అమరావతి: నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసులు పట్టు సాధించారు. శాంతి భద్రతల పరిరక్షణలో దాదాపు అన్ని జిల్లాల్లోని పోలీసులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దోషులను పట్టుకోవడం, మరో వైపు నేరాలు పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో ఏపీ పోలీస్ శాఖ విజయం సా«ధించిందనే విషయాన్ని నేర గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2019తో పోలిస్తే 2020లో 15 శాతం నేరాలు తగ్గాయి. 2019లో 1,11,112 కేసులు నమోదు కాగా, 2020లో 94,578 నేరాలు నమోదైనట్టు ఏపీ పోలీస్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 18 పోలీస్ యూనిట్లున్నాయి. వాటిలో 14 పోలీస్ యూనిట్లు శాంతిభద్రతల నిర్వహణలో భేష్ అనిపించుకున్నాయి. ఆ 14 యూనిట్ల పరిధిలో ప్రధాన నేరాలు 2019 కంటే 2020లో తక్కువగా నమోదు కావడం గమనార్హం. మిగిలిన నాలుగు యూనిట్ల పరిధిలోనూ ప్రధాన నేరాలు నామ మాత్రంగానే పెరిగాయి. నేరాల అదుపులో వైఎస్సార్ జిల్లా ఫస్ట్ నేరాల ఆదుపులో రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే జిల్లాలో సరాసరి సగం(49శాతం) వరకూ ప్రధాన నేరాలు తగ్గాయి. 2019లో 10,483 నేరాలు నమోదు కాగా, 2020లో 5,345 మాత్రమే నమోదయ్యాయి. నేర నియంత్రణలో వైఎస్సార్ జిల్లా తర్వాత తిరుపతి అర్బన్, గుంటూరు యూనిట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గతం కంటే నేరాలు స్వల్పంగా పెరిగిన జిల్లాల్లో చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి. -
భారత్‌కు ఐక్యరాజ్యసమితి 671 కోట్ల బాకీ!
మన దేశానికి భారీ మొత్తంలో అప్పులు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఐక్యరాజ్య సమితి కూడా మనకు బాకీ ఉందంటే మీరు నమ్ముతారా? అంతా ఇంతా కూడా కాదు.. ఏకంగా 671 కోట్ల రూపాయల వరకు ఐరాస మనకు చెల్లించాల్సి ఉందట. వివిధ దేశాలకు శాంతి పరిరక్షక దళాలను పంపి, అక్కడ పనిచేసినందుకు ఐక్యరాజ్య సమితి ఈ మొత్తాన్ని మనకు ఇవ్వాల్సి ఉంది. ఐరాస నిర్వహించే శాంతి పరిరక్షక కార్యక్రమాల్లో భారతదేశం బాగా చురుగ్గా పాల్గొంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ మూడో తేదీ వరకు ఇలాంటి కార్యక్రమాలకు సిబ్బందిని పంపినందుకు, ఇతర రకాల సాయం చేసినందుకు మొత్తం 671 కోట్ల రూపాయలు తాము భారత్‌కు చెల్లించాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ యుకియో తకసు తెలిపారు. రెండు రోజుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసేస్తామని కూడా ఆయన అన్నారు. భారతదేశంతో పాటు ఇథియోపియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కూడా ఐక్యరాజ్యసమితి బాకీ ఉంది.