
సాక్షి, అమరావతి: నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసులు పట్టు సాధించారు. శాంతి భద్రతల పరిరక్షణలో దాదాపు అన్ని జిల్లాల్లోని పోలీసులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దోషులను పట్టుకోవడం, మరో వైపు నేరాలు పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో ఏపీ పోలీస్ శాఖ విజయం సా«ధించిందనే విషయాన్ని నేర గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి.
ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2019తో పోలిస్తే 2020లో 15 శాతం నేరాలు తగ్గాయి. 2019లో 1,11,112 కేసులు నమోదు కాగా, 2020లో 94,578 నేరాలు నమోదైనట్టు ఏపీ పోలీస్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 18 పోలీస్ యూనిట్లున్నాయి. వాటిలో 14 పోలీస్ యూనిట్లు శాంతిభద్రతల నిర్వహణలో భేష్ అనిపించుకున్నాయి. ఆ 14 యూనిట్ల పరిధిలో ప్రధాన నేరాలు 2019 కంటే 2020లో తక్కువగా నమోదు కావడం గమనార్హం. మిగిలిన నాలుగు యూనిట్ల పరిధిలోనూ ప్రధాన నేరాలు నామ మాత్రంగానే పెరిగాయి.
నేరాల అదుపులో వైఎస్సార్ జిల్లా ఫస్ట్
నేరాల ఆదుపులో రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే జిల్లాలో సరాసరి సగం(49శాతం) వరకూ ప్రధాన నేరాలు తగ్గాయి. 2019లో 10,483 నేరాలు నమోదు కాగా, 2020లో 5,345 మాత్రమే నమోదయ్యాయి. నేర నియంత్రణలో వైఎస్సార్ జిల్లా తర్వాత తిరుపతి అర్బన్, గుంటూరు యూనిట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గతం కంటే నేరాలు స్వల్పంగా పెరిగిన జిల్లాల్లో చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు వరుస స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment