
మణిపూర్‌లో శాంతిస్థాపన కోసం పోరాడతాం: రాహుల్
న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతిస్థాపన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడతామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నెలకొన్న విషాదాన్ని పారద్రోలి శాంతినెలకొనేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి అక్కడి వారి బాధలను అర్ధంచేసుకుని ఘర్షణలకు చరమగీతం పాడాలని కోరారు.
ఈ మేరకు ఇటీవల ఆయన మణిపూర్‌లో పర్యటన, బాధితులతో మాట్లాడటం తదితర ఘటనల వీడియోను గురువారం ‘ఎక్స్’లో షేర్‌చేస్తూ హిందీలో పలు పోస్ట్‌లుచేశారు. ‘మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాక మూడుసార్లు రాష్ట్రంలో పర్యటించా. ఇన్నిరోజులైన అక్కడి పరిస్థితిలో మార్పురాలేదు. ఇప్పటికీ అక్కడి జనం రెండు వర్గాలుగా విడిపోయి బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీస్తున్నారు.
వేలాది కుటుంబాలు దిక్కులేక శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. ప్రధాని మోదీ వ్యక్తిగతంగానైనా ఒక్కసారి మణిపూర్‌లో పర్యటించి అక్కడి వారి బాధలను వినాలి. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి’ అని అన్నారు. ‘పార్లమెంట్‌లో మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తాం. శాంతిస్థాపన కోసం చర్యలు తీసుకునేదాకా కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి మోదీ సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తాయి’ అని అన్నారు. ‘ మీ వాణిని పార్లమెంట్‌లో వినిపిస్తాగానీ మీరు శరణార్థి శిబిరాలను వీడి స్వస్థలాలకు ఎప్పటికల్లా వెళ్లగలరు? అనే ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం వద్దే ఉంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment