ఆస్తుల విలువ, వివరాలు చెప్పండి
► విక్రయానికి రాతపూర్వక హామీ ఇవ్వండి
► అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
► డిపాజిటర్లకు న్యాయం చేయడమే మా ఉద్దేశం
► తేల్చి చెప్పిన ధర్మాసనం.. విచారణ 24కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ‘మీకు ఎంత మేర ఆస్తులున్నాయి? వాటి విలువ ఎంత? వాటి విక్రయం లేదా వేలం ద్వారా ఎంత మొత్తం రాబట్టవచ్చు.. ఆ మొత్తం డిపాజిటర్లకు చెల్లించేందుకు సరిపోతుందా..? ఈ వివరాలను మా ముందు ఉంచండి...’ అంటూ హైకోర్టు సోమవారం అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆస్తులను విక్రయించి, డిపాజిటర్లకు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఇతర డెరైక్టర్లకు హైకోర్టు స్పష్టం చేసింది.
ఆ అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. డిపాజిటర్లకు న్యాయం చేయడమే తమ ఉద్దేశమని, అందుకే యాజమాన్యం నుంచి హామీ కోరుతున్నాని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ రూ.6,350 కోట్లను డిపాజిట్లుగా వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్ల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రజా సమీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేశామని, కేసు కూడా నమోదు చేశామన్నారు. ఆస్తుల జప్తును సవాలు చేస్తూ అగ్రిగోల్డ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, జప్తుపై హైకోర్టును ఆశ్రయించడం ద్వారా అగ్రిగోల్డ్ ఉద్దేశం అర్థమవుతోందని, వారికి నిజాయితీ ఉంటే కోర్టుకు వచ్చే వారే కాదని వ్యాఖ్యానించింది.
ఈ సమయంలో అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆస్తులు విక్రయించి డిపాజిట్లను వెనక్కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించిన 14 ఆస్తుల వివరాలను కూడా ఇచ్చామని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఎన్ని ఆస్తులను జప్తు చేశారని ప్రశ్నించింది. 433 ఆస్తులను జప్తు చేసిందని ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. మరి 14 ఆస్తుల వివరాలనే ఎందుకు ఇచ్చారని, వాటి విక్రయం ద్వారా మొత్తం సొమ్ము తిరిగి చెల్లించడం సాధ్యమవుతుందా..? అని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. సరిపోతాయని ఆయన చెప్పడంతో, తాము ఆస్తుల వేలానికి అనుమతిస్తామని ధర్మాసనం తెలిపింది. ఆస్తుల పూర్తి వివరాలను కోరింది.