అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల వేలానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ తామే స్వయంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు గాను ఎప్పటికప్పుడు సంబంధిత వివరాలను తమ ముందుంచాలని పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్‌కు స్పష్టం చేసింది. ఆస్తుల వేలం నిమిత్తం మరో 10 ఆస్తులను సిద్ధం చేసి వివరాలను తమ ముందుంచాలని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డిని ఆదేశించింది. ఏ ఆస్తులు అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందో చెప్పాలని అగ్రిగోల్డ్ చైర్మన్‌ను ఆదేశించింది.
తామిచ్చే తుది అవకాశం ఇదేనని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి, వాటిని చెల్లించకుండా ఎగవేసిందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం వాటిని శుక్రవారం మరోసారి విచారించింది.
భూముల వేలం పర్యవేక్షిస్తాం..
Published Sat, Mar 12 2016 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement
Advertisement